కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు కృష్ణ భగవానుని సమాధానం.
ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.
శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.
అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.
భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.
నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.
ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.
నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.
ఆయన చెప్పనారంభించాడు.
కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.
కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.
కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం
చేస్తారు.
కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.
....ఉద్ధవ గీత
శ్రీమద్భాగవతం
No comments:
Post a Comment