Friday, May 8, 2020

వైశాఖ పురాణం 18 వ అధ్యాయము వైశాఖ పురాణం పద్దెనిమిదివ అధ్యాయము :-నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

వైశాఖ పురాణం 18 వ అధ్యాయము

                                   వైశాఖ పురాణం 

పద్దెనిమిదివ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                        విష్ణువు యముని ఊరడించుట

నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను.

యముని మాటలను విని బ్రహ్మ యిట్లనెను. ఓయీ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత పుణ్యము కల్గును. ఎన్ని యజ్ఞములను చేసినవారైనను పుణ్యఫలముల ననుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ వుండదు. శ్రీహరి నామము నుచ్చరించినవారు  కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను యెంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరానిదానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుజ్యమునందుదురు. ఇట్టి శ్రీమహా విష్ణువునకిష్టమైనది వైశాఖమాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వపాపములును హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతము నాచరించినవరు శ్రీహరి పదమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? మనలందరిని సృష్టించి సర్వ జగన్నాధుడు శ్రీమహా విష్ణువు అట్టివానిని సేవించినవారు విష్ణులోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖమాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా! యమధర్మరాజా! శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా! జన్మమృత్యు జరావ్యాధి భయము కూడ నుండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తికొలది ఆచరింప యత్నించినచో నతడు పనిని పూర్తిచేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి/సేవకుడు పాపమునందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అని బ్రహ్మ యముని బహువిధములుగ ఊరడించెను.

అప్పుడు యముడు బ్రహ్మమాటలను విని స్వామీ! నీ యాజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటిని పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్లజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖవ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నాయధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్దము చేసిన పుత్రునివలె సంతృప్తి పడుదును. కృపాకరా! నాయీ కోరిక తీరునట్టి యుపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను.

అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా! విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చెయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మపరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు మనల నాజ్ఞాపించు నియామకుడు. శ్రీహరిమాటలకు మనము బదులు చెప్పదగినది యుండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యెద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసముద్రము కడకరిగెను. జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు యిద్దరును శ్రీహరికి నమస్కరించిరి.

శ్రీహరియు వారిద్దరిని జూచి "మీరిద్దరు నెందులకిచటకు వచ్చితిరి. రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడియున్నదేమి? అతడు శిరము వంచుకొని యేల నుండెను? బ్రహ్మ! యీ విషయమును చెప్పుమని" యడిగెను.

అప్పుడు బ్రహ్మ మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరును వైశాఖ వ్రతమును పాటించి విషులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై యున్నది. అందుచే నితడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును గూడ ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై యేమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును యేమి చేయుదును. స్వామీ నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీమహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని, బ్రహ్మను జూచి యిట్లనెను. నేను లక్ష్మీదేవినైనను, నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతీమాలను, శ్వేతద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, శేషుని, గరుత్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను, జీవితములను విడిచి నాయందే ఆధారపడియున్న యుత్తమ భక్తునెట్లు విడిచెదను?

యమధర్మరాజా! నీ దుఃఖము పోవుటకొక యుపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతుమహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయము నిచ్చితిని. ఇప్పటికెనిమిదివేల సంవత్సరములు గడచినవి. ఆ తరువాత వేనుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును. పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములును ఆచరించువారు లేక లోపించును. ఆ వేనుడును తాను చేసిన పాప బలమున నశించును. అటుపిమ్మట నేను పృధువను పేరున జన్మించి ధర్మసంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప జేయగలను. అప్పుడు నాకు భక్తుడైనవాడు నన్నే ప్రాణములకంటె మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖధర్మములను తప్పక పాటించును. కాని అట్టివాడు వేయిమందిలో నొకండుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలదిమంది మాత్రమే నాయీ వైశాఖధర్మముల నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామవివశులై యుందురు. యమధర్మరాజా! అప్పుడు నీకు వలసి నంతపని యుండును. విచారపడకుము. వైశాఖమాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖవ్రతము నాచరించువారందరును నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్దములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండ జేసిన కీర్తిమంతుని నుండియు నీకు భాగము వచ్చునట్లు చేయుదును. నీకురావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారముండదు కదా! (ఇచట గమనింపవలసిన విషయమిది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట యేమని సందేహము రావచ్చును. వైశాఖవ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండ విష్ణులోకమునకు పోవుటయనగా నరకమునకు పోవలసినవారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండ విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు? రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మము నాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతము నాచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగము నిచ్చునట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి యభిప్రాయము) వైశాఖ వ్రతము నాచరించువారు ప్రతిదినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యము నిత్తురు. వైశాఖవ్రతము చివరినాడు జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నియు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతమాచరించువారు ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యము నీయవలయును మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమీయవలయును. అట్లు చేయనివారి పూజాదికర్మలు వ్యర్థములగునని భావము.

కావున యమధర్మరాజా! నీకు యీ విధముగా భాగము నిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడుపుము. ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలశమును, పెరుగన్నమును భాగముగ గ్రహింపుము. ఇట్లు చేయనివారి వైశాఖకర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్యపాపముల ననుసరించి నీ లోకమున నుందురు. ధర్మాధర్మముల నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నాయాజ్ఞానుసారము శిక్షింపుము. వైశాఖవ్రతమున నీకు అర్ఘ్యమునీయనివారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చునట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడును నామాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగము నిప్పించును. అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట నుండగనే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును గొని శ్రీహరి కడకు వచ్చి యా విషయమును చెప్పెను.

శ్రీహరి యీ విధముగ యమధర్మరాజు నూరడించి యంతర్ధానము నందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగినదానికి విస్మయపడుచు తన వారితో గలసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను. శ్రీమహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు, వాని యేలుబడిలోని ప్రజలు అందరును వైశాఖవ్రతము నాచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నానసమయమున అర్ఘ్యమును, వ్రతాంతమున జలకలశమును దధ్యన్నమును సమర్పించుచుండిరి. ధర్మరాజునకెవరైన అర్ఘ్యము మున్నగు వాని నీయనిచో యమధర్మరాజు వారి వైశాఖవ్రత ఫలమును గ్రహించును.

కావున వైశాఖవ్రతము నారంభించు ప్రతివారును ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యమునీయవలెను. వైశాఖపూర్ణిమయందు జలకలశమును దధ్యన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీమహావిష్ణువు కర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను, గురువును పూజింపవలయును, తరువాత శ్రీమహావిష్ణువునుద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన యన్నమును దక్షిణగల తాంబూలమును ఫలములనుంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు/పేదవాడగు వానికి నీయవలయును బ్రాహ్మణుని తన శక్తికి దగినట్లుగ గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరముల నీయగలడు. వైశాఖవ్రతము నాచరించువారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించునప్పుడు యధాశక్తిగ నాచరించుట మరింత ముఖ్యము.

ఇట్లు వైశాఖవ్రతము నాచరించినవారు జీవించినంతకాలము అభీష్టభోగముల ననుభవించుచు పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనుమరాండ్రు మున్నగువారితో సుఖముగ శుభలాభములతో నుండును. మరణించిన తరువాత సకుటుంబముగ శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యధాశక్తిగ వైశాఖవ్రతమును దానధర్మముల నాచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదల ననుభవించి తనవారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేనుడు రాజయ్యెను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖమాస వ్రతాదులును లోపించినవి. ఇందువలన మోక్షసాధనము సర్వసులభమునగు వైశాఖధర్మము యెవరికిని దెలియని స్థితిలోనుండెను. పూర్వజన్మ పుణ్యమున్నవారికి మాత్రమే వైశాఖధర్మములయందాసక్తి నిశ్చల దీక్ష శ్రీహరిభక్తి యుండును. అట్టివారికి ముక్తి యిహలోక సుఖములు, సులభములు తప్పవు. కాని పురాకృతసుకృతమువలననే యిది సాధ్యము సుమా అని శ్రుతదేవుదు శ్రుతకీర్తికి వివరించెను. శ్రుతదేవమహామునీ! పూర్వపు మన్వంతరముననున్న వేనుడు దుర్మార్గుడనియు యిక్ష్వాకు వంశమునకు చెందిన వేనుడు మంచి వాడనియు వింటిని. మీ మాటలవలన కీర్తిమంతుని తరువాత వేనుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని యడిగెను.

శ్రుతదేవుడును రాజా! యుగములనుబట్టి, కల్పములనుబట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగ చెప్పబడి యుండవచ్చును. ఆకథలును ప్రమాణములే మార్కండేయాదిమునులు చెప్పిన వేనుడొక కల్పమువాడు. నేను చెప్పిన వేనుడు మరియొక కల్పమువాడు మంచి చెడుకలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము, గొప్పతనము తరువాత వేనుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా యని పలికెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.

వైశాఖ పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణము

          🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...