వైశాఖ పురాణం 25 వ అధ్యాయము
వైశాఖ పురాణం
ఇరవై ఐదవ అధ్యాయము :-
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||
భాగవత ధర్మములు
నారదుడు అంబరీషమహారాజుతో నిట్లు చెప్పుచున్నాడు. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు నిట్లనెను.
స్వామీ! బ్రహ్మజ్ఞానీ! ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకొలదిగానున్న జీవులు విభిన్నకర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై యున్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని యడిగెను.
అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సత్వరజస్తమో గుణత్రయముననుసరించి జీవులు యేర్పడిరి. రాజసులు రాజసకర్మలను, తామసులు తామసకర్మలను, సాత్వికులు సాత్వికకర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలనుబట్టి సత్వరజస్తమో గుణముల పాళ్లు యెక్కువ తక్కువలగుచుండును. అందువలన వారు యెక్కువ కర్మకు యెక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖదుఃఖముల నందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలననుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును యింకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకులోబడి యీ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకులోబడి మరల కర్మలను గుణానుకూలముగ చేయు తగిన ఫలితములనందుచున్నారు. మాయకులోబడి వారి గుణకర్మల వలని మార్పులుచేర్పులు ఆ జీవులకే గాని మాయకేమియు మార్పులేదు. తామసులైన వారు పెక్కు దుఃఖముల ననుభవించుచు తామస ప్రవృత్తి కలవారై యుందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మమొదలుకొని పిశాచ జన్మాంతముగ తామసమార్గమునే చేరుచుందురు.
రాజసప్రవృత్తులు మిశ్రమబుద్దితో పుణ్యపాపములను రెండిటిని చేయుచుందురు. పుణ్యము నధికముగ చేసిన స్వర్గమును, పాపమెక్కువయైన నరకమును పొందుచుందురు. కావున నీరు నిశ్చయజ్ఞానము లేనివారై మంద భాగ్యులై సంసారచక్రమున భ్రమించుచుందురు.
సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణవిశిష్టులై శ్రద్ద కలిగినవారై యితరులను జూచి అసూయపడనివారై సాత్విక ప్రవృత్తి నాశ్రయించియుందురు. వీరు తేజశ్శాలురై గుణత్రయశక్తిని దాటి నిర్మలులై యుత్తమ లోకములనందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్నకర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు నగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలననుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు.
సంపూర్ణకాముకుడైన శ్రీహరికి భేదబుద్ది దయ స్వభావము లేవు. సృష్టిస్థితి లయములను సమముగనే జీవులగుణకర్మల ననుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరును తాము చేసిన గుణకర్మల ననుసరించియే తగిన ఫలములను, శుభములను - అశుభములను, సుఖమును - దుఃఖమును, మంచిని - చెడును పొందుచున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగనే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగ యెత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచటనాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును. పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచట గమనింప వలసిన విషయమొకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో నతని కర్మానుభవము వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో నతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమునకుండును. కాని మనము ముండ్ల చెట్లమా, పండ్ల చెట్లమా యన్నది మన కర్మలను, గుణములను అనుసరించి యుండును. తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కాని ఆ చెట్ల తీరు వేరుగానుండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా! అని శంఖుడు వివరించెను.
కిరాతుడు స్వామీ! సంపూర్ణజ్ఞానసంపద కలవారికి సృష్టిస్థితిలయములలో నెప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని యడిగెను. శంఖుడిట్లనెను. నాలుగువేల యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు నాలుగువేల యుగములకాలమే. ఇట్టి ఒక రాత్రి, ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి పదునైదు దినములోక పక్షము. ఇట్టి రెండు పక్షములోక మాసము. రెండు మాసములొక ఋతువు. మూడు ఋతువులొక ఆయనము. రెండు ఆయనములోక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైనచో దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయమేర్పడును అని వేదవిదులందురు. మానవులు అందరును నశించినప్పుడు మానవప్రళయము బ్రహ్మమానమున నొకదినము గడువగా వచ్చిన ప్రళయము. దినప్రళయము. బ్రహ్మ మానమున నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మప్రళయము అని ప్రళయమును మూడు విధములని చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడచినదో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు పదునాలుగు గడచినచో దీనిని దైనందిన ప్రళయమని యందురు.
మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు. జలపూర్ణములై యుండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావరజంగమములన్నియు లోకములతో బాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నియు నశించును. ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును.
తత్త్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున నున్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతోబాటు నిద్రింతురు. దినకల్పము పూర్తియగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గడువగనే మరల యధాప్రకారముగ జ్ఞానులకు మెలకువ వచ్చును. బ్రహ్మసృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను శ్రీహరి యవతారములను సృష్టించును. ఈ దేవతలు, మునులు బ్రహ్మ కల్పము ముగియు వరకునుందురు. ఆయా రాశులయందున్న దేవతలు, మునులు తమకు విహితములగు వేదధర్మములననుసరించు నాయా గోత్రములయందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు.
కలియుగాంతమున రాక్షసులు, పిశాచములు మున్నగువారు కలితో కలిసి నరక స్థానమును చేరుదురు. ఆ పిశాచగణముల యందున్నవారు తమ కర్మలననుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు.
బ్రహ్మ మున్నగు వారి సృష్టికాలమును ముక్తి కాలమును వినుము. శ్రీమహావిష్ణువు కన్నుమూయుట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్పమగును. మరల కనురెప్పపైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలెనను కోరిక కలుగును. అప్పుడు తన యుదరమున సృష్టింపదగినవారు, లింగశరీరులు లింగశరీర భంగమైనవారునగు జీవులనేకులుందురు.
శ్రీమహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగ నున్నవారు, అజ్ఞాన దశలోనున్నవారు లింగభంగశరీరులు పిపీలికాదిమానవాంత జీవులు, ముక్తినందినవారు, బ్రహ్మ మొదలు మానవులవరకు నుండు జీవులు వీరందరునుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహడు జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుజ్యము నిచ్చును. కొందరికి తత్త్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్య ముక్తిని, సాలోక్య ముక్తిని వారివారికి తగినట్లుగ అనిరుద్ద వ్యూహముననుసరించి వారి వారికి యిచ్చును. ప్రద్యుమ్న వ్యూహముననుసరించి సృష్టి చేయగోరును. మాయజయకృతిశాంతియను నాలుగు శక్తులను, వాసుదేవ అనిరుద్ద ప్రద్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహములనుండి వరించెను. ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీమహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను.
యోగమాయను నాశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రి యగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదుల కైనను యెరుగరావు అని శంఖుడు వివరించెను.
అప్పుడు కిరాతుడు స్వామీ! శ్రీమహావిష్ణువున కిష్టములగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను. దయయుంచి చెప్పగోరుదునని యడిగెను. అప్పుడు శంఖుడిట్లనెను. చిత్తశుద్దిని కలిగించి సజ్జనులకుపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది శ్రుతిప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్దము కానిదియగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణములచేత, బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్యనైమిత్తిక కామ్యములని మూడు రీతులుగ విభక్తములైనవి. నాలుగు వర్ణములవారును తమ తమ ధర్మములనాచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినచోనవి సాత్విక ధర్మములని యందును. శుభకరములగు భగవంతునికి చెందిన కర్మలనియును సాత్వికములనియనిరి.
శ్రీమహావిష్ణువును విడిచి మరియొక దైవము ఇట్టి వీరినే భాగవతులనవలెను. ఎవరి చిత్తము విష్ణువు నందును, నాలుక శ్రీహరి నామోచ్ఛారణయందును హృదయము విష్ణుపాదముల యందును సక్తములై యుండునో వారే భాగవతులు. సదాచారములయందాసక్తి కలిగి అందరికి నుపకారమును చేయుచు, మమకారము లేనివారు భాగవతులు. వీనియందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు, సత్కర్మలు ముఖ్యముగాగలవి రాజసధర్మములు. యక్షులు, రాక్షసులు, పిశాచాదులు యందు దైవములు. వీరిలో కనిష్ఠురులు, హింసాస్వభావులు. వీరి ధర్మములు తామసములు సత్త్వగుణము కలవారు. విష్ణుప్రీతికరములు శుభప్రదములగు ధర్మములను నిష్కామముగజేయుదురు. విష్ణువుపై భక్తి కలిగియుందురో వారు భాగవతులు భక్తులు.
వేదశాస్త్రాదులయందు చెప్పబడి శాశ్వతములై విష్ణుప్రీతికరములైన ధర్మముల నాచరించువారు భాగవతులు. అన్ని దేశములయందు తిరుగుట అన్ని అందరి కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తిలేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నియు జ్ఞానులకుపయోగింపవు. చంద్రుని జూచి చంద్రకాంత శిలద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును.
ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుటవలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును. కోరికలేని జనులను శ్రద్దతో కూడి విష్ణుప్రీతికరములగు పనులను చేయువాడు భాగవతులు. ఇహపరలోకమును కలిగించు విష్ణుప్రీతికరములగు గుణములు సర్వదుఃఖములను నశింపజేయును. పెరుగును మధించి సారభూతముగ వెన్నను స్వీకరించునట్లు అన్ని ధర్మముల సారము వైశాఖధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రమున నున్నప్పుడు చెప్పెను.
బాటసారులకు మార్గమున నీడ నిచ్చునట్టి మండపములను, చలివేంద్రముల నేర్పరుచుట విసనకఱ్ఱలతో విసరుట మరియు నుపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము, దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానమును, పుష్పములను ఇచ్చుట తాంబూల దానము. ఆవుపాలు మొదలగు వానినిచ్చుట, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటిపోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగువానిని నిచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట యివన్నియు పాపములను పోగొట్టును. సాయంకాలమున చేరకుగడ నిచ్చుట, దోసపండ్ల నిచ్చుట పండ్లరసములనిచ్చుట పితృదేవతలకు తర్పణలిచ్చుట యివి వైశాఖధర్మములు అన్ని ధర్మములలోనుత్తమములు. ప్రాతఃకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదుల నాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానముల చేయవలెను. వైశాఖము తలంటిపోసుకొనరాదు. కంచుపాత్రలో భుజింపరాదు. నిషిద్ధములగు ఉల్లి మొదలగువానిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను, పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వులపిండి పులికడుగు, చద్దియన్నము, నేతిబీరకాయ మున్నగు వానిని వైశాఖమున నిడువవలెను. బచ్చలకూర, ములగకాడలు పండని, వండని పదార్థములు, ఉలవలు, చిరుశెనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడినవానిలో దేనిని భుజించినను నూరు మార్లు నీచ జన్మమునందును. తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహములేదు.
ఈ విధముగ శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖమాసమంతయు వ్రతము నాచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యధాశక్తి వైభవముగా బ్రాహ్మణునకీయవలెను. వైశాఖ బహుళ ద్వాదశినాడు పెరుగు కలిపిన అన్నమును, జలకలశమును తాంబూల దక్షిణలను యిచ్చిన యమ ధర్మరాజు సంతసించెను.
శ్లో|| వైశాఖేసితద్వాదశ్యాం దద్యాద్దద్ధ్యన్నమంజసా |
సోదకుంభంసతాంబూలం సఫలంచసదక్షిణం |
దదామి ధర్మరాజాయ తేవప్రీణాతువైయమః ||
పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి యిచ్చిన పితృదేవతలు సంతసింతురు.
శ్లో|| శీతలోదకదధ్యన్నం కాంస్యపాత్రస్థముత్తమం |
సదక్షిణంసతాంబూలం సభక్ష్యంచ ఫలాన్వితం ||
తదామివిష్ణవేతుభ్యం విష్ణులోక జిగిషయా |
ఇతిదత్వాయధాశక్త్యాగాంచదద్యాత్కుటుంబినే ||
చల్లని యుదకమును పెరుగు కలిపిన అన్నమును, కంచుపాత్రలోనుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు నుంచి పిల్లలుగలవానికి/బ్రాహ్మణునకు యిచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండ వైశాఖ మాస వ్రతము నాచరించినచో వాని సర్వపాపములును పోవుటయేకాక, వాని వంశమున నూరుతరములవారు పుణ్యలోకములనందుదురు. వైశాఖవ్రతము నాచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును, శ్రీహరిలోకమును చేరుదురు.
అని శంఖముని కిరాతునకు వైశాఖధర్మములను వివరించుచుండగా అయిదు కొమ్మలు గల మఱ్ఱిచెట్టు నేలపై బడెను అందరు ఆశ్చర్యపడిరి. ఆ చెట్టుతొఱ్ఱలో నుండి పెద్దశరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను.
అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.
వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము
🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏
No comments:
Post a Comment