“ధైర్యముంటే నాతో పోరాడు!”
అడవి మొత్తం వినిపించేలా ఒక గాడిద సింహాన్ని సవాలు చేసింది.
అందరూ అనుకున్నారు
ఇక గాడిద పని అయిపోయింది!
కానీ ఆశ్చర్యం…
సింహం ఒక్కసారి దాని వైపు చూసింది.
ఏమీ మాట్లాడలేదు.
కోపపడలేదు.
పంజా ఎత్తలేదు.
మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది!
ఇదంతా గమనించిన నక్క వెంటనే సింహం దగ్గరకు వెళ్లి ఎగతాళిగా అడిగింది
“అడవికి రాజువి నువ్వు!
నీ ఒక్క పంజా దెబ్బకు పడిపోయే గాడిద నిన్ను అంతగా సవాలు చేస్తుంటే…
సమాధానం చెప్పకుండా వచ్చేశావేంటి?
భయపడ్డావా?”
సింహం చిరునవ్వుతో ముందుకు నడిచింది.
కొంతదూరం వెళ్లాక ఒక ఏనుగు ఎదురైంది.
అది కూడా అదే సందేహంతో అడిగింది
“నువ్వు ఆ గాడిదతో పోరాడితే గెలుపు నీదేనని తెలుసు.
మరి ఎందుకు మౌనంగా వచ్చేశావు?”
ఈసారి సింహం ఆగింది.
ప్రశాంతంగా చెప్పింది
“ *నేను దానితో పోరాడి గెలిస్తే…
నా బలం కొత్తగా నిరూపితమవుతుందా* ?”
“లేదు.”
“ఓడిస్తే నా గౌరవం పెరుగుతుందా?”
“లేదు.”
సింహం చిరునవ్వుతో చెప్పింది
“అయితే ఆ పోరాటం నాకు ఎందుకు?”
ఆ మాటతో ఏనుగుకు విషయం అర్థమైంది.
సింహం మరో మాట చెప్పింది
**“ప్రతి సవాలునూ స్వీకరించడం ధైర్యం కాదు మిత్రమా…
ఏ సవాలు మన స్థాయికి తగినదో తెలుసుకోవడం కూడా వివేకమే!”**
మన జీవితంలోనూ కొందరు కావాలనే రెచ్చగొడతారు.
ఒక కామెంట్…
ఒక విమర్శ…
ఒక సోషల్ మీడియా పోస్టు…
ఒక వాట్సాప్ మెసేజ్…
వెంటనే సమాధానం చెప్పాలనిపిస్తుంది.
కానీ ఒక్కసారి ఆలోచించాలి
“నేను స్పందిస్తే సమస్య పరిష్కారమవుతుందా?
లేక నా సమయం, ప్రశాంతత మాత్రమే పోతాయా?”
ప్రతి విమర్శకు వివరణ అవసరం లేదు.
ప్రతి రెచ్చగొట్టే మాటకు ప్రతిస్పందన అవసరం లేదు.
ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం అంతకంటే లేదు.
ఎందుకంటే
మన స్థాయిని నిర్ణయించేది ఎదుటివాడు విసిరిన మాట కాదు…
దానికి మనం ఇచ్చే ప్రతిస్పందన!
చివరిగా ఒక్క మాట..
మౌనం అంటే భయం కాదు.
మౌనం అంటే ఓటమి కాదు.
ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవడం జ్ఞానం…
ఎక్కడ మౌనంగా వెళ్లిపోవాలో తెలుసుకోవడం వివేకం!
కొన్ని యుద్ధాలు గెలవడానికి పోరాడాలి…
కొన్ని యుద్ధాలు గెలవాలంటే
పోరాడకుండా వెళ్లిపోవాలి!