Wednesday, May 13, 2020

వైశాఖ పురాణం 23 వ అధ్యాయము వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయము :-నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||

వైశాఖ పురాణం 23 వ అధ్యాయము

                                  వైశాఖ పురాణం 

ఇరవై మూడవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||

                               కిరాతుని పూర్వజన్మ

నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజునకు శంఖకిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను.

కిరాతుడు శంఖునితో నిట్లనెను. మహామునీ! దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతననుగ్రహింపబడితిని. మహాత్ములు, సజ్జనులు సహజముగనే దయాస్వభావులు కదా! నీచమైన కిరాతకులమున పుట్టినపాపినగు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ది కలుగుటయేమి? ఇట్టి యాశ్చర్యపరిణామమునకు మహాత్ములగు మీయనుగ్రహమే కారణమని యనుకొనుచున్నాను. సజ్జనులను, పాపములను కలిగించు హింసాబుద్ది నాకు మరల కలుగకుండ జూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా! ఉత్తముడా! నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను జూపుము. జ్ఞానీ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పినమాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా! సమచిత్తులు, భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అనుభేదముండదు కదా! ఏకాగ్రతతో చిత్తశుద్దిని పొందుటకై అడిగినవారు పాపాత్ములైనను, దుష్టులైనను చెప్పుదురు కదా!

గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింప జేయు స్వభావము కలవారు కదా! దయాశాలీ! సజ్జనుడా! నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునంది, నీకు విధేయుడనగుటవలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయజూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను.

శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది యంతయును వైశాఖమహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి యిట్లనెను.

కిరాతుడా! నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖధర్మములనాచరింపుము. ఈయెండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు, నీడలేవు. నేనిచటనుండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖమహిమను, నేను చూచిన దానిని, విన్న దానిని నీకు వివరింతును అని పలికెను.

అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామీ! యిచటకు కొలది దూరమున స్వచ్చమైన నీరున్న సరస్సుకలదు. అచట మిగుల మగ్గిన వెలగపండ్లతో నిండిన వెలగ చెట్లు యెన్నియో యున్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగనుండును. అచటకు పోవుదము రమ్మని శంఖుని అచటకు గొనిపోయెను. శంఖుడును కిరాతునితో గలసి వెళ్ళి యచట మనోహరమగు సరస్సును జూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడియుండెను. వెదురుచెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షము లెక్కువగానుండుటచే తుమ్మెదలు వాలి మధురధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడియుండెను. కలువలు, తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై యుండెను. వివిధములగు పక్షులచటవ్రాలి మధురముగ కిలకిలారావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగ నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగ మనోహరములైయుండెను. అడవి జంతువులును అచట స్వేచ్చగ తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైనసరస్సును జూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేదతీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు నా సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగ కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల జూచి యిట్లనెను.

నాయనా! కిరాతా! ధర్మతత్పరా! నీకేధర్మమును చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశసాధ్యములుగ నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వాని నాచరించిన సర్వ ప్రాణులకును ఇహికములు, ఆయుష్మికములునగు శుభలాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలయునో అడుగుమని పలికెను.

అప్పుడు కిరాతుడు స్వామీ! అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మనాకేల కలిగెను? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని యడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై యుంది యిట్లనెను.

ఓయీ! నీవు పూర్వము శాకలనగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు. శ్రీవత్ససగోత్రుడవు. వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు  కాంతిమతి. ఆమె సుందరి, యుత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రునివలె నాచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది.

ఆమె నీకును నీవుంచుకున్న వేశ్యకును అనేకవిధములగు సేవలను ఓర్పుగా శాంతముగ చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రతయగుటచే భర్తకును, భర్తకిష్టురాలగు వేశ్యకును బహువిధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగ చాల కాలము గడచినది.

ఓయీ కిరాతా! ఒకనాడునీవు బ్రాహ్మణులు భుజించునాహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదెపెరుగు ముల్లంగిదుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారమువలన నీకు అనారోగ్యము కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరియొకనితోబోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవచేయుచుండెడిది. నీవును పశ్చాత్తపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమియు చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు పదిజన్మలు నపుంసకుడై పుట్టును సుమా! నీవంటి పతివ్రత నవమానించిన నేను పెక్కు నీచ జన్మలనందుదును. అని యనేక విధములుగ నామెతో బలికితివి. ఆమెయు 'నాధా! నీవు దైన్యము వహింపకుము. చేసినదానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగ బాధించును. వానిని సహించినవారుత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును. దాని ఫలమిదియని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువులనుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగ భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్దలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరిని ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదెపెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. పది శనివారములుపవాసమును చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగ చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను.

ఒకనాడు దేవలుడను ముని సాయంసమయమున నామె యింటికి వచ్చెను. అప్పుడామె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిధిని పూజించినచో నీకు మంచి కలుగునని యామె తలచెను. నీకు ధర్మకార్యములనిన యిష్టము లేకపోవుటచే నామె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీచేత నామె పానకము నిప్పించెను. నీయనుజ్ఞతో దానును యిచ్చెను. మరునాటి యుదయమున దేవలముని తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్యవ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి గాని యిన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్భుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేసెను.

నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత యగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకమునిచ్చుటవలన దేవలుని పాదములను కడుగుట వలన నామెకు శ్రీహరిసాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొనియు పానకమునిచ్చుటచే నిప్పుడు నన్ను వైశాఖ ధర్ములడుగ వలెనను మంచిబుద్ది కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లు కొనుటచే నీకు నాతో నీవిధముగ సాంగత్యము చేయు నవకాశము కలిగినది. కిరాతా! నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలిసికొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖవ్రత నాచరించుట వలన కలిగినది. నీకింకను యేమి తెలిసికొనవలయునని యున్నదో దానినడుగుము చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను.

వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణము

          🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...