Friday, April 24, 2020

అక్షయ తృతీయ రోజున గోమాతను పూజిస్తే.. ఎంత మేలో తెలుసా?...@ॐ~

అక్షయ తృతీయ రోజున గోమాతను పూజిస్తే.. ఎంత మేలో తెలుసా?...@ॐ~🚩🚩

అక్షయ తృతీయ తెల్లవారు జామున గోమాతను పూజ చేయడం విశేషం. గోమాతు గోధుమలు, పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున పసుపు, కుంకుమలు ఇతరులకు ఇవ్వడం మంచిది. 

అన్నదానం చేయడం ద్వారా దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. ఈ రోజున పేదలకు కావాల్సిన వస్తువులను దానం చేస్తే రాజయోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

వస్త్రాలు దానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. రోగాలు దరిచేరవు. మజ్జిగ లేదా నీటిని దానం చేస్తే విద్య ప్రాప్తిస్తుంది. పెరుగుదానం చేస్తే పాప విమోచనం లభిస్తుంది. ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు, అకాల మరణాలు వంటివి దూరమవుతాయి.

గోమాతలో దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటిపండు ఇవ్వడం మంచిది. ఆకలితో అలమటించేవారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుందట. వారికి మరో జన్మ ఉండదట. నేరుగా శివసాన్నిధ్యం చేరుకుంటారట. అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడట. దీంతో పాటు బెల్లం, నెయ్యి, పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుందట.

అక్షయతృతీయ రోజున నీటిని నువ్వులతో కలిపి దానం ఇస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని పద్మపురాణంలో వుంది. అనుకోకుండా, తెలియకుండాచేసిన తప్పులకు మాత్రమే ఇలా పరిహారం అవుతుందట. కనుక అలాంటి తప్పులు చేసినవారు అక్షయ తృతీయ ఆ దానం ఇచ్చి చూస్తే ఫలితం కనబడుతుంది.

అక్షయ తృతీయ రోజున అవసరం వున్నవారికి ఔషధాలను దానం ఇస్తే ఆయురారోగ్యాలు కలిగి, అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు చెబుతున్నాయి. బియ్యం, వెండి, పంచదార దానం చేయడంవల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది.

ఈ దానాల వలన మీ జాతకంలో వున్న చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు. సకల శుభాలు కలిగేలా అనుగ్రహిస్తాడట. మామిడి పండ్లు, విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది..@ॐ~🚩వేదమయీ🚩
[4/24, 10:15] +91 94902 41020: వైశాఖ పురాణం 3 వ అధ్యాయము
                    
                                  వైశాఖ పురాణం

మూడవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

వివిధ దానములు - వాని మహత్మ్యములు

నారదమహర్షి మాటలను వినిన అంబరీష మాహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా? మరి యింకనూ ఉన్నవా? అవి యేవి? వాని ఫలితములను గూడ దయయుంచి వివరింపుమని కోరెను.

అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును(మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండ జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండ సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు యెండలకు బాధపడినవారికి/బ్రాహ్మణశ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చి యిహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు/సద్బ్రాహ్మణుడు ఆశయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖమాసమున కశిపును(పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై/చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక, మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును యిచ్చుటచే ఆ దాత అందరకు అన్నివిధముల ఉపకారము చేయువాడై ప్రతిజన్మయందును, సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు యేడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును. తనతోబాటు నేడు తరములవారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్ణ, ఉన్ని, గొఱ్ఱె బొచ్చు నీటియందు పడినను తడవకనుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసినవారు. సంసారసముద్రములోనున్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేనివారు కట(చాప) దానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట/శయ్యాదానము చేసినవారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ, దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా! వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును.

ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు, మనుమలు మున్నగువారితో సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర, తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును. దుఃఖములు, పాపములు లేకుండ జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధద్రవ్యముల నిచ్చినచో నెట్టి బాధలు లేకుండ జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవిమల్లెల మాలనుగాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి, మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును. పోక చెక్కలను, సుగంధద్రవ్యమును, కొబ్బరి కాయలను దానమిచ్చినచో నేడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు, ధనవంతుడై యుండి యేడు తరములవారితో గలసి ముక్తినందును.

సద్బ్రాహ్మణుని యింటిలో విశ్రాంతి మండపమును కట్టించి యిచ్చినచో వాని పుణ్యము యింతయని చెప్పుటకు మాటలకందనిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోనున్న యిసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు, జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు.

మార్గమున తోట, చెరువు, నూయి, మండపము, వీనిని నిర్మింపజేసినవానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము,పరులకుపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు యివియేడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే యొకటి చేయకున్నను మానవునకు పుణ్యలోకప్రాప్తి లేదు.

సచ్చాస్త్రశ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వర్థరోపణము(రావి చెట్టును నాటుట) పుత్రుడు అను నేడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. వందలకొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోకప్రాప్తి లేకుండుటచే నతడు పైన చెప్పిన యేడు సంతానములలో యధాశక్తిగ వేనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును. పుణ్యపాప వివేకములేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోకప్రాప్తినందవు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులి సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును.

ఉత్తమములైన పోకచెక్కలు, కర్పూరము మున్నగు సుగంధద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నియు పోవును. తాంబూల దాత కీర్తిని ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయము, రోగియైనవాడు తాంబూల దానము నిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైసాఖమాసమున తాపహారకమైన తక్రమును(మజ్జిగ) దానమిచ్చినవాదు విద్యావంతుడు, ధనవంతుడు నగును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగయైన దప్పిక కలవానికి హితకరముగ నుండును. వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు/సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దాన మిచ్చినవారు పూర్ణాయుర్దాయమును, అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమునుపొందును. తేజోరూపమైన గోఘ్ర్తమును(ఆవునేయి) సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదురు.

విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి యెండకు అలసినవానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమనంతము. వైశాఖమాసమున సాయంకాలమున యెండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల యాశీస్సులు లభించును. వైశాఖమాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును. పుణ్యలోకప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మున్నగువానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను.

వైశాఖ పురాణం మూడవ అధ్యాయము సంపూర్ణము

      🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...