Thursday, April 23, 2020

వ్యాపార రహస్యం: -- చందమామ కథలు(Chandamama Kathalu) ॐ~🚩

వ్యాపార రహస్యం: -- చందమామ కథలు(Chandamama Kathalu) 
         ॐ~🚩

ఒకసారి ప్రసన్నగుప్తుడి కొడుకులు ఇద్దరూ రెండు ఓడలనిండా దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాల వంటి సుగంధ ద్రవ్యాలను నింపుకొని, వ్యాపార నిమిత్తం విదేశాలకు పయనమయ్యారు. తమ వద్దనున్న సరుకులను వివిధ దేశాలలో అమ్ముతూ, ఆయా దేశాలలో చవకగా దొరికే సరుకుల్ని తాము కొంటూ ముందుకు పోయారు. వ్యాపారం యావత్తూ చాలా లాభసాటిగా సాగింది. ఇట్లా రెండేళ్ళు గడిచేసరికి, స్వదేశానికి వస్తూ

సరేనని మన దేశంలో అధిక ధరలకు అమ్ముడుపోయే యంత్ర సామగ్రులను, ఎంపిక చేసిన ఆహారోత్పత్తులను తమ రెండు ఓడలనిండా నింపుకున్నారు వాళ్ళు.

ఆ వ్యాపారులకు సగం డబ్బు చెల్లించి, తమ దేశంలో సరుకు దింపుకోగానే మిగతా సగండబ్బు చెల్లించేట్లు ఒప్పందాలు చేసుకున్నారు. అటుపైన, మరో ఓడను బాడుగకు తీసుకొని, దానిలో తాము ఈ రెండేళ్ల కాలంలోనూ సంపాదించిన నగదు,
బంగారు, వెండి ఆభరణాలను నింపుకొని, మెల్లగా మన దేశానికి పయనం కట్టారు.

రెండు నెలల పాటు వారి ప్రయాణం ఎలాంటి అడ్డంకులూ లేకుండా సాగింది. అయితే ఇంక కొద్ది రోజుల్లో మన దేశం చేరుతారనగా సముద్రపు దొంగలు కొందరు నేరుగా ఆభరణాలు, బంగారం తెస్తున్న ఓడనే చుట్టుముట్టి సంపాదించిన సొమ్మునంతా దోచుకున్నారు! అదృష్ట వశాత్తు సరుకులు తెస్తున్న ఓడలు రెండూ వాళ్ల బారిన పడలేదు, సురక్షితంగా రేవు చేరాయి.

కుమారులు వచ్చినారనే సంతోషంతో ప్రసన్నగుప్తుడు రేవు దగ్గరే వాళ్లకు ఎదురేగాడు. క్షేమ సమాచారాలు అడుగుతూ ఓడపైకి చేరాడు. అయితే కుమారుల ముఖాలు డస్సి, నీరసంగా ఉన్నాయి. ఉత్సాహం, సంతోషం కనబడలేదు. తెలివైన వ్యాపారికి అర్థమైంది: "దురదృష్టకరమైన సంఘటన ఏదో జరిగింది" అని. కొడుకులిద్దరూ కూడా తండ్రిని చేరి, ఏం జరిగిందో చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ తండ్రి కనుసన్నలతోటే వాళ్ళని వారించాడు. సంతోషం నిండిన మొహంతో ఇద్దరినీ పలకరించి పని వాళ్ళందరికీ గబగబా పనులు పురమాయించాక, ఓడదిగి వెళ్ళిపోయాడు.

కొడుకులిద్దరూ బిక్కమొహాలు వేసుకొని ఇల్లు చేరాక, వాళ్లను ప్రక్కకు పిలిచి, సంగతేంటో అడిగి కనుక్కున్నాడు. ఆపైన వాళ్లతో "నాయనలారా! మిమ్మల్ని చూడగానే ఏదో దుస్సంఘటన జరిగిందని నాకు అర్థమైంది. అయితే ఏ విషయమైనా సరే, మాట్లాడేందుకు సమయం, సందర్భం అనేవి ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా తొందరపాటుతో చేసే పనులు నష్టాన్నే తెచ్చిపెడతాయి. అందువల్ల ఏం జరిగినా చిన్నపోరాదు, ప్రతి సమస్యనూ తెలివిగా, ఓర్పు నేర్పులతో పరిష్కరించుకోవాలి" అని చెప్పి, "సరుకు దింపుకోవడానికి మనకు ఎంత కాలముంది?" అని అడిగాడు.

"ఒక నెల సమయం ఉంది" "మేము ఆ సరుకు వెలలో సగం డబ్బు ముందుగానే చెల్లించాము. ఇక మిగతా సగం చెల్లించాలంటే ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు" అని చెప్పి తల దించుకున్నారు.

ప్రసన్నగుప్తుడు వాళ్లని ఓదారుస్తూ "ఏమీ పర్లేదు నాయనలారా! ఇప్పుడు మనం ఇంకా చెల్లించాల్సిన మొత్తానికి సరిపడా సరుకులు ఓడలో ఉన్నాయి కదా?!" అని అడిగాడు.

"ఓఁ దానికేమీ ఢోకా లేదు. మనం చెల్లించాల్సినదానికి రెట్టింపు విలువ చేసే సరుకులు అందులో ఉన్నాయి. సమస్యల్లా మనం సరుకునంతటినీ ఈ కొద్ది రోజుల్లో ఎలా అమ్ముతాం అనేదే!" అన్నారు కొడుకులు.

"నేను అమ్మించి పెడతాను. మీరు నేను చెప్పినట్లు చేయండి చాలు" అని చెప్పి, తండ్రి అక్కడి నుండి బయటకు వచ్చాడు. కొద్ది సేపు ఆలోచన చేసాక, అతను పట్టణంలోకెల్లా ధనవంతుడైన వ్యాపారిని ఒకడిని తన ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించాడు. తన కుమారులు ఎన్నేళ్ళ పాటు ఏ ఏ దేశాలు తిరిగి వ్యాపారం చేసిందీ, ఎన్నెన్ని వింతలు చూసిందీ అద్భుతాలుగా వర్ణిస్తూ చెప్పాడు అతనికి.

ఆలోగా అతని కొడుకులు ఇద్దరూ రెండు పెట్టెలలో ఏవో సరుకులు ఉంచి, వాటి పైవరసలో మటుకు ఇంట్లో ఉన్న అభరణాలు పేర్చారు. అతిథికి కనబడేట్లుగా ఆజమాయిషీ చేస్తూ, ఆ రెండు పెట్టెలనూ నేలమాళిగలోకి తీసుకొని పోయారు. అతిధి దృష్టి వాళ్ళ మీదికి మరలటం చూసి ప్రసన్నగుప్తుడు నవ్వు ముఖంతో కొడుకుల్ని అడిగాడు "ఆభరణాల పెట్టెలు ఇంకా ఎన్ని ఉన్నాయి నాయనా?!" అని.

"ఇంకా ఎనిమిది ఉన్నాయి. వాటిని ఓడనుండి రేపు తెస్తామండి నాన్నగారు!" వినయంగా చెప్పారు కుమారులు.

వచ్చిన ధనవంతుడి ముఖం వికసించింది: "సరుకు ఓడ నుండి దింపకనే ఇంత విలువైన వెండి, బంగారం వచ్చాయే, ఇంకా ఓడలు దిగని ఎనిమిది పెట్టెలలో ఎంత విలువైన ఆభరణాలు ఉన్నాయో!" అని ఉత్సాహపడి, అతను ఈ సంగతిని ఊళ్ళో అందరికీ చెప్పేందుకు త్వరత్వరగా పోయాడు.

"ప్రసన్నగుప్తుడి ఇంట్లోకి లెక్క లేనన్ని బంగారు రాసులు చేరుకున్నాయి" అన్న విషయం నగరమంతటా రెండురోజుల్లో వర్షమై కురిసి వాగై ప్రవహించింది. అందరూ అనుకున్నారు: "పట్టణంలో వాళ్లని మించిన ధనవంతులు లేరు" అని.

ఆ తర్వాతి రోజున కుమారులు తండ్రి చెప్పిన వ్యాపారుల ఇళ్ళకు వెళ్ళారు: "సరుకు దించిన వెంటనే ఒక్క వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాం; ప్రస్తుతానికి కొంత డబ్బు ఏమైనా సర్దుబాటు చేయగలరేమో చూడండి" అంటూ.

"ఇంత ధనవంతులు మనల్ని అడగటమే ఎక్కువ" అనుకొని, వాళ్ళంతా లేదనకుండా అడిగినంత ఇచ్చారు. చూస్తూండగానే సరుకులకు చెల్లించాల్సినంత డబ్బు జమ అయ్యింది. కొడుకులు ఆ డబ్బులు చెల్లించి సరుకు మొత్తం దించుకున్నారు.

మరుసటి రోజున "మా ఇంట్లో‌ ఈ సరుకునంతా ఉంచుకునేందుకు స్థలం ఎక్కడుంది?!" అంటూ ఆ సరుకునంతటిని ఓడరేవులోనే తగిన రేటుకు అమ్మేసి, సొమ్ము చేసుకున్నారు పిల్లలు. "ఆలస్యమైతే సరుకు ఉండదట" అంటూ ఊళ్ళోని వ్యాపారులంతా రేవు దగ్గరే ఎగబడి సరుకునంతా కొనేసుకున్నారు! దాంతో ప్రసన్నగుప్తుడి కొడుకుల దగ్గర వాళ్ళు ఊహించినదానికంటే ఎక్కువ మొత్తం చేరింది.

వెంటనే తాము తీసుకున్న అప్పులన్నీ తీర్చేసారు వాళ్ళు! "మాట నిలబెట్టుకున్నారు" అని ఆ అప్పిచ్చిన వాళ్లందరికీ చాలా సంతోమైంది.
ఊళ్ళో వ్యాపారులందరికీ ప్రసన్న గుప్తుడిమీద, అతని కుమారులమీద చాలా గౌరవం ఏర్పడింది.

విదేశీ వ్యాపారం వల్ల కొడుకులకు ఏమంత మిగులుబాటు కాకున్నా, పట్టణంలో మటుకు తమ మీద నమ్మకం బాగా నిలిచిందని సంతోషించిన ప్రసన్నగుప్తుడు కుమారులతో అన్నాడు "నాయనలారా! ఇచ్చిన మాట పోతే, కొనుగోలుదారులకు వ్యాపారిపైన నమ్మకం పోతుంది. అట్లాపోతే ఇక సమయానికి మనకు ఎవ్వరూ సహాయం చేయరు. 'నమ్మకం' అనేది డబ్బు కంటే విలువైనది. అంతేకాదు! ఒక్కోసారి మన రహస్యాలు బట్టబయలు చేయకుండా, సమయస్ఫూర్తితో గంభీరంగా ఉంటేనే మన పనులు సజావుగా సాగుతాయి. ఏ విషయానికైనా సంయమనం అవసరం"అని.

"తండ్రి ముసలివాడు, చేతగాని వాడు" అంటూ అతన్ని దూరం పెట్టాలనుకున్న కొడుకులు "ఈనాడు ఆయనే లేకుంటే మన గతి ఏమయ్యేది?" అని సిగ్గు పడ్డారు. వాళ్లకు ఆయన పట్ల గౌరవం పెరిగింది. అహంకారం తగ్గింది. పెద్దవాళ్ల జీవనానుభవం తమకు ఎంత అవసరమో అర్థమైంది.
                 ॐ

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...