Tuesday, April 28, 2020

భక్తి - భగవంతుడు..

భక్తి  -  భగవంతుడు..

పూర్వం ఒక ఊరిలో అయోద్యుడు అనే బద్దకస్తుడు ఉండేవాడు. ఏపని చేసేవాడు కాదు. తినడం తిరగడం.. ఇంతకుమించి ఏపని రాదు. పైగా అమాయకుడు. ఇంట్లో వారు భరించలేక ఏదన్నా ఆశ్రమం చూసుకొని వెళ్ళమన్నారు. 

సరేనని ఏదన్నా  ఆశ్రమంలో చేరడానికి బయలుదేరి చాలా ఆశ్రమాలు చూశాడు. ఎక్కడా నచ్చలేదు. చివరకు ఓ ఆశ్రమానికి వచ్చాడు. ఆ  ఆశ్రమంలో గురువుగారు కొద్దిగా లావుగా ఉన్నారు. 
ఆహా ఇక్కడ భోజనం బాగాదొరుకుతుందనుకుంటా ..
గురువుగారు బాగా లావుగా ఉన్నారుఅనుకున్నాడు. 

ఇంతలో శిష్యులు వచ్చారు. వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు. అయితే సందేహం లేదు ఇక్కడ చేరితే మూడుపూటల భోజనం దొరుకుతుంది అనుకోని గురువుగారి పాదాల మీద పడి ఇక్కడే ఉండిపోతానన్నాడు. సరే అన్నాడు గురువుగారు. 

అయితే నాకు మూడుపూటల భోజనం కావాలి అన్నాడు అయోద్యుడు.  నాయనా! చక్కగా సేవ చేస్తూ రెండుసార్లు మాత్రమె ఇక్కడ భోజనం తీసుకోవాలి అన్నారు. కాదు గురువుగారు నేను ఆకలికి ఉండలేను అన్నాడు. సరే ఉదయం ప్రసాదం కొద్దిగా ఎక్కువ తిను అంటే సరేనన్నాడు.

ఏదో తెలిసిన సేవ చేస్తూ చాలీచాలని ఆహారం తింటూ ఉండగా  ఒక రోజు ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఉపవాసం ఉండాలి అన్నారు గురువుగారు.  అమ్మో ఉపవాసం నావల్ల కాదు గురువుగారు... ఉండలేను అన్నాడు  ఈ శిష్యుడు. సరే అయితే ఇక్కడికి దూరంగా ఉన్న చెరువు వద్దకి వెళ్లి వండుకుతిను. కావాలంటే సరంజామా నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు గురువుగారు. 

సరేనని సరంజామా తీసుకున్నాడు శిష్యుడు. నాయనా వండిన ఆహారం స్వామికి నైవేద్యం పెట్టి ఆ తరువాతే నువ్వు తినాలి సరేనా. అని గురువుగారు అనగా అలాగే గురువుగారు అని వెళ్లి చెరువు దగ్గర చెట్టు క్రింద వంట చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి..ఇలా పిలిచాడు

రాజా రామ్ ఆయియే, రఘురామ్ ఆయియే.. ముఝే భూక్ లాగాయియే అంటూ పాడడం మొదలు పెట్టాడు. ఎంతకీ స్వామి రాడే.. (ఇతని ఉద్దేశ్యం లో స్వామివారే స్వయంగా వచ్చి తింటారని అనుకుని ఎదురుచూస్తూ ఉన్నాడు. అంతటి అమాయకుడు అయోద్యుడు.. కపటం, కంఫ్యూషన్ లేదు మనస్సులో)  ఎంతకీ రాకపోయేసరికి బాగా ఆలోచించి ఇలా అన్నాడు .
 
"దేవాలయంలో అయితే ప్రసాదాలు, నైవేద్యాలు పెడతారు...ఇక్కడ ఏముంది.. కుదిరి కుదరని వంట తప్ప"  అక్కడైతే బాగా పెడతారని అనుకుంటున్నావేమో స్వామీ.. ఈరోజు ఏకాదశి అక్కడ ఏమి ఉండదు. ఏమి పెట్టరు. ఇక్కడికి కూడా రాలేదనుకో ఇది కూడా ఉండదు..అని మళ్ళీ పాడడం మొదలు పెట్టాడు. ఇది కూడా అయిపోతుందని.. శ్రీరాముడు నవ్వుకుని ఉండబట్టలేక సీతాసమేతంగా వచ్చాడు.

శ్రీరాముడిని చూశాడు సంతోషించాడు. కానీ పక్కనే సీత ఉంది. సీత వంక ప్రసాదం వంక పదేపదే చూస్తూ ఉండగా..  శ్రీరాముడు మేము వచ్చాము సంతోషమేగా అంటే...అయోద్యుడు  సీత వంక చూస్తూ ఆ ఆ సంతోషమే.. నాచేత ఇవాళ  ఏకాదశి ఉపవాసం చేయించాలనుకున్నట్లు ఉన్నారు. రండి కూర్చోండి అని ఇద్దరికి వండిన ఆహారం పెట్టాడు. చక్కగా భోజనం చేసి సీతారాములు వెళ్లిపోయారు. అయోద్యుడు ఆ రోజు ఉపవాసం తోనే ఉండిపోయాడు.

కొన్ని రోజులు గడిచాక మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు అయోద్యుడికి   మొన్న ఇచ్చినట్లే ఈసారి కూడా కిలో బియ్యం పప్పులు దినుసులు ఇచ్చారు. అప్పుడు.. గురువుగారు ఇవి సరిపోవడం లేదండి... ఇద్దరొచ్చారు ఇంకాస్త కావాలి అంటే.. వీడికి సరిపోతున్నట్లు లేదు ఇంకో కేజీ ఇచ్చి పంపండి అని శిష్యులతో  గురువుగారు చెప్పారు.   యధావిధిగా  అయోద్యుడు అక్కడకు  వెళ్లి వంట చేసి.. నైవేద్యం పెట్టి,.. మొన్న ఇద్దరు వచ్చారు కదా.. అందుకని ఇలా పిలిచాడు.

రాజారామ్ అయియే, సీతారాం ఆయియే మేరా భోజన్ కో భోగ్ ధరాయియే అంటూ పాడాడు. ఈసారి సీతారాముల తో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. ఈసారి లక్ష్మణుడు వంక ..భోజనం వంక.. చూస్తూ ఉండగా.. శ్రీరాముడు.. మేము వచ్చాము నీకు సంతోషమేగా అంటే లక్ష్మణుడి వంక.. భోజనం వంక..చూస్తూ ఆ సంతోషమే స్వామి అంటూ ఈ వారం కూడా నాకు ఉపవాసమే  అనుకుంటూ... రండి కూర్చోండి అన్నాడు. భోజనం పెట్టాడు .వారు ముగ్గురు తిన్నారు వెళ్లారు. 

మళ్ళీ ఏకాదశి వచ్చింది. అయోద్యుడు  గురువుగారితో ఇది కూడా సరిపోదండి ముగ్గురు వచ్చారు అన్నాడు. వీడు రాత్రికి  కూడా తింటున్నాడేమో అనుకోని మరో కేజీ   అదనంగా  ఇచ్చి పంపారు. మళ్ళీ వండాడు. ఈ సారి పాట మార్చి పాడాడు.. రాజారామ్ ఆయిఏ, సీతారాం అయిఏ, లక్ష్మణ్ సాత్ అయిఏ మేరా భోజన్ కో భోగ్ ధరాయిఏ..అంటూ పిలిచాడు

ఈ సారి సీతారాములు, లక్ష్మణుడు వచ్చారు. వీళ్ళతోపాటుగా హనుమాన్ వచ్చాడు. మేము వచ్చాము. నీకు ఆనందమేగా అని అడిగారు. ఆ..ఆ.. ఆనందమే కానీ అంటూ హనుమాన్ వంక..భోజనం వంక ..చూసిఈఏకాదశికి కూడా నాకు ఉపవాసమే...
అనుకుంటూ  రండి కూర్చోండి అని వడ్డించాడు. 

అందరూ కూర్చొని తృప్తిగా తినేసి వెళ్లిపోతూ ఉండగా స్వామి ఏమనుకోనంటే ఒకమాట అడగవచ్చా? ఈసారి ఎంతమంది వస్తారు? నేను వంట చేయటానికి అని అనగా శ్రీరాముడు నవ్వి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు..

మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు..ఈసారి రవ్వ 10కిలో, బియ్యం పదికిలో, పచారి పదికిలో కావాలి అన్నాడు అయోద్యుడు. గురువుగారికి వీడేమైనా అమ్ముకుంటున్నాడా అనే సందేహం వచ్చినా..వాడు అడిగింది ఇచ్చి తరువాత చుద్దాం ఏమి చేస్తున్నాడో అని శిష్యులతో వాడు ఆడిగినవి ఇచ్చి పంపండి  అన్నాడు. 

అలాగే గురువుగారి ఆజ్ఞప్రకారం  అన్నీ  పది కిలోల చొప్పున ఇచ్చి పంపి ..గురువుగారి దగ్గరికి వచ్చారు శిష్యులు. వీడు అమ్ముకుంటున్నట్లు ఉన్నాడు.. ఎక్కడ అమ్ముతున్నాడు? ఏదుకాణంలో అమ్ముతున్నాడు...?చుద్దాం పదండి అని గురువుగారి తో  సహా 
శిష్యులు అయోద్యుడికి   వెనుక బయలుదేరారు.

ఎప్పటిలానే అయోద్యుడు చెరువు దగ్గరకు వెళ్లి సామాను అంత అక్కడ పడేసి చెట్టుక్రింద కూర్చొని రాజారామ్ అయిఏ, సీతారాం ఆయిఏ, లక్ష్మణ్ సాత్ అయిఏ, హనుమాన్ సాత్ ఆయిఏ మేరా భోజన్ కో భోగ్ ధరాయిఏ.. అని పాట పాడాడు. 

ఈసారి సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్,భరత శత్రుఘ్నులు, కౌశల్య సుమిత్ర కైకేయి సపరివారమంతా వచ్చేశారు. అయోధ్యా మేమొచ్చేశాం సంతోషమేగా.. ప్రసాదం ఏది ఎక్కడుంది? అని అడిగాడు శ్రీరాముడు. 

అప్పుడు అయోద్యుడు.. ఎప్పుడూ నేను వండితే మీరు తినేసి వెళ్లిపోతున్నారు. కొద్దిగా కూడా ఉంచడం లేదు. నాచేత నాలుగు ఏకాదశి ఉపవాసాలు చేయించారు. ఈసారి మీరే వండండి.. సామానంత అక్కడే ఉంది అన్నాడు... శ్రీరాముడు నవ్వి సరేనని.. శ్రీరాముడు కూరగాయలు కొస్తూ ఉన్నాడు. సీతమ్మ పొయ్యి దగ్గరకి వెళ్ళింది. లక్ష్మణుడు హనుమంతుడు కట్టెలు తెచ్చారు. ఇలా అందరూ తలా ఓపని చేస్తూ ఉండగా.. సీతమ్మ వంట వండుతుందని తెలుసుకొని దేవతలు, ఋషులు, గంధర్వులు వరసగా వస్తూ ఉంటారు. కోలాహలంగా తయారయింది ఆ ప్రదేశం అంతా.. 

ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చి. అక్కడి సన్నివేశం చూస్తే సామాను పక్కన పడేసి అయోద్యుడు చెట్టుకింద పడుకొని కనబడతాడు. వెంటనే గురువుగారు వచ్చి " అయోధ్యా! ఏంటి సామానంత అక్కడ పడేసి చెట్టుక్రింద పడుకున్నావ్" అనగానే.. అదేంటి గురువుగారు సీతారాములు, లక్ష్మణుడు హనుమంతుడు కౌశల్య సుమిత్ర కైకేయి అందరూ కలిసి వంట చేస్తున్నారుగా అంటే ఆశ్చర్యంతో ఎక్కడ ..నాకేం కనబడడం లేదు అన్నారు గురువుగారు.

అయోద్యుడు శ్రీరాముడిని చూసి మీరు మాగురువుగారికి కనబడడం లేదట కనిపించండి. లేదంటే నామీద సందేహం వస్తుంది అనగా శ్రీరాముడు అలానే అని సపరివారసమేతంగా గురువుగారి కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు. గురువుగారు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉండగా అయోద్యుడ్ని కౌగలించుకొని ఎన్నో ఏళ్లుగా పూజలు చేస్తున్న నాకు దర్శన భాగ్యం కలుగలేదు.

 నీవు  అమాయకంగా, నీ మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండబట్టి ఆ భగవంతుడు సాక్షాత్కరించాడు. నీవల్ల మేము ధన్యులమయ్యాం అన్నాడు.. 

భగవంతుడు రాడేమో అని, పూజలు ఎలా చేయాలి ?ఎన్ని వత్తులు వేయాలి? అంటూ, కొన్నాళ్ళు.. విపరీత భక్తితో, కొన్నాళ్ళు విరక్తితో, మరొకొన్నాళ్లు చిరాకుతో ఏదో ఇష్టం వచ్చినట్లు కంఫ్యూషన్ మైండ్ తో, గందరగోళంగా పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. చేయాలా వద్దా! ఎలా చేయాలి.. ఈరోజు పనులున్నాయి. ఈరోజు మనసు బాగోలేదు. ఇలా ఏదో వంకతో సాకుతో పూజలు ఎగ్గొట్టేస్తూ ఉంటారు కొందరు.

ఇలాంటివారికి జీవితాంతం గందరగోళం తప్ప భగవంతుడి సాక్షాత్కారం కలుగదు. పూజ గాని, జపం గాని, తపస్సు గాని, ధ్యానం యాగాదులు ఏదైనా సరే నిలకడ లేకుండా జీవితకాలం చేసినా ఏమాత్రం ఉపయోగం ఉండదు. స్వచ్ఛమైన, నిర్మలమైన మనస్సుతో చేస్తే తక్షణం పరమాత్ముడు దర్శనం ఇస్తాడు. ఏ మాత్రం సందేహం లేదు. 

అయోద్యుడు, భక్తకన్నప్ప, భక్తతుకారాం ఈ కోవకి చెందినవారే. ఏమి పెట్టినా, ఎలా పెట్టినా మారుమాట్లాడకుండా స్వచ్ఛమైన నిర్మలమైన భక్తికి వశమైపోయాడు.

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...