మంత్రం ప్రయోజనం ఏమిటి?
(Benefit of Mantra)
మంత్రాలమీద చాలామంది, చాలా రకాలుగా వ్యాఖ్యానించడం వింటూ ఉంటాం. ''దేవుడికి సంస్కృతం మాత్రమే వస్తుందా?'', ''అసల మంత్రాలు సంస్కృతంలో ఎందుకున్నాయి, తెలుగువాళ్ళకి మంత్రాలు రాసే విద్య రాదా?'', ''మనం నోరు తిరక్క తప్పులు చదివితే, దేవుడు చెవులు మూసుకుంటాడా లేక శాపాలు పెట్టేస్తాడా?'' - అంటూ సరదాగా మాట్లాడడమూ వినే ఉంటారు..
మంత్రం విలువ తెలీకనే ఈరకంగా మాట్లాడతారు. ఒకపక్కన మంత్రోచ్ఛారణ చేస్తుంటారు కానీ, ఆ.. వీటిని పఠించడంవల్ల ఏమిటి ప్రయోజనం..'' అనుకుంటారు. అందుకే, మంత్రం గురించి వివరంగా తెలుసుకుందాం.
''మననాత్ త్రాయతే ఇతి మంత్రః'' అన్నారు.
అంటే, మననం చేయడంవల్ల రక్షించేది మంత్రం అని అర్ధం.
''మకారం మన ఇత్యాహుః త్రకారం త్రాణమేవచ
మనఃప్రాణ సమాయుక్తో మంత్రమిత్యభిధీయతే''
మంత్రానికి దేవతలు అధీనులౌతారు. మంత్రం రక్షిస్తుంది. లేనిపోని ఆలోచనలను నియంత్రిస్తుంది. అయితే మంత్రాన్ని స్వచ్చంగా, సుస్పష్టంగా ఉచ్చరించాలి. తప్పులు దొర్లకూడదు. పరిశుభ్రమైన మనసుతో, చాంచల్యం లేని బుద్ధితో మంత్రాన్ని స్మరించాలి.
ఇంతకీ మంత్రాలు సంస్కృతంలో ఎందుకు ఉంటాయంటే... సంస్కృతాన్ని దేవనాగరి అంటారు. ఇది దేవతలా భాష. అదలా ఉంచితే, సంస్కృతంలో ఒక అద్భుతమైన సొగసు ఉంటుంది. సంస్కృత శ్లోకాల్లో లయ ఉంటుంది. ఈ రెండు కారణాలవల్ల మంత్రాన్ని నాలుగుసార్లు జపించేసరికి కంఠతా వస్తుంది. పూర్వకాలంలో ఇప్పటి వసతులు, వెసులుబాట్లు లేవు. కంప్యూటర్లు కాదుకదా, పుస్తకాలు అయినా లేవు. తాళపత్ర గ్రంధాలు ఉన్నప్పటికీ, అని అందరికీ అందుబాటులో ఉండేవి కావు. కనుక, శిష్యులు ఏది నేర్చుకున్నా గురువు చెప్పింది విని నేర్చుకునేవారు. శాస్త్రాలు, ధర్మ గ్రంధాలు మాత్రమే కాదు, స్తోత్రాలు, మంత్రాలు కూడా అంతే. ఒకరి ద్వారా, ఇంకొకరు నేర్చుకునేవారు. అందువల్ల కావ్యాలు, మంత్రాలు ఏవైనా లయబద్ధంగా ఉండేవి.
మంత్రాలు సంస్కృతంలో ఉండటం వల్ల, ఆయా మంత్రాలు నోటికి రావడం ఒక్కటే ప్రయోజనం కాదు. మంత్రోచ్ఛారణవల్ల స్వరపేటిక, నరాలు ఉత్తేజితం అయ్యి, సక్రమంగా పనిచేస్తాయి. అలా ఉత్తేజపరిచే అక్షరాలను ఏర్చికూర్చి రాశారు మహర్షులు. అందుకే మంత్రంలో అపార శక్తి ఉంటుంది.
No comments:
Post a Comment