Thursday, April 23, 2020

భేతాళ కథలు**స్వార్థపరుడు

*భేతాళ కథలు*

*స్వార్థపరుడు*

*పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రివేళ ఎన్నో ఇక్కట్లకోర్చిన తర్వాత, నీ ప్రయత్నం ఫలించినా, నువ్వెవరికోసమైతే ఇన్ని కఠోర శ్రమలకోర్చావో, ఆ వ్వక్తి కేవలం స్వార్థపరుడూ, భోగలాలసుడూ అని తెలుసుకుని నువ్వు నిరాశకు గురయ్యే అవకాశం వుంది. ఇందుకు ఉదాహారణగా, సుఖభోగాలకు అలవాటుపడి స్వార్థపరుడుగా మారిపోయిన స్పందనదాసు అనే ఒక కవి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను," అంటూ ఇలా చెప్పసాగాడు:*

*దుర్గాపురం అనే గ్రామంలో స్పందనదాసు అనే ఒక యువకుడుండేవాడు. అతడు చెట్టూ పుట్టా, రాయీ రప్పా, మనిషీ-మృగం-ఒకటేమిటి, దేనిమీదనైనాసరే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటంత వీనులవిందుగా గొప్ప కవిత్వం చెప్పేవాడు.*

*దుర్గాపురంలో పేదా గొప్పా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కడూ స్పందనదాసు కవిత్వాన్ని ఆనందంతో తన్మయులౌతూ వినేవారు. తృణమో పణమో కానుకగా ఇచ్చేవారు. ఆ కారణంగా అతడికి రోజులు సుఖంగా గడిచిపోతున్నవి. ఇప్పుడతడికి గ్రామంలో పెద్ద ఇల్లు, నాలుగెకరాల పొలం, పదివేల వరహాల నగదు ఉన్నాయి. ఇక పెళ్ళి చేసుకుందామని అతడు ఆలోచిస్తూండగా, గ్రామానికి పెద్ద కరువొచ్చింది. ఆ గ్రామ పరిసరప్రాంతాల్లో వరసగా రెండేళ్ళు వానలు లేవు. ఉన్నవాళ్ళు తమ నిల్వధనంతో సుఖంగానే ఉన్నారు. దినదిన గండంగా రోజులు వెళ్ళబుచ్చుతున్నా ఏమి లేని పేదలు గ్రామం వదిలి వలసపోదామనుకున్నారు. వాళ్ళను ఒక త్రాటిమీద నడిపించే బాబులు అనేవాడు, దూరంగా వున్న కొన్ని ప్రాంతాలు తిరిగివచ్చి, సివంగిపట్నం తమకు అనుకూలంగా వుంటుందని తెలుసుకున్నాడు. అయితే పేదవాళ్ళెవరూ ఈ వార్తవిని సంతోషించలేదు.*

*"మాకేవూరైనా ఒకటే. కానీ రోజూ కాసేపైనా స్పందనదాసు కవిత్వం వినకుండా వుండలేం. అతణ్ణి కూడా మనతో రావడానికి ఎలాగైనా ఒప్పించు," అన్నారు పేదవాళ్ళు, బాబులుతో.బాబులు, స్పందనదాసును కలుసుకుని సంగతిచెప్పి, "నువ్వూ మాతోపాటు సివంగిపట్నం, "నువ్వూ మాతోపాటు సివంగిపట్నం వచ్చి వుండు," అని కోరాడు.*

*ఇది విని స్పందనదాసు చలించిపోయి, గ్రామపెద్ద రాజయ్యను కలుసుకున్నాడు. ఆయన విచారంగా," మన కష్టాలు గురించి రాజుగారిని ఎంతగానో విన్నవించాను. అయినా చిన్నమెత్తు ప్రయోజనం కలగలేదు. వలస పోయేవాళ్ళను పోనివ్వడమే తప్ప చేయగలిగిందేమీ లేదు," అన్నడు. స్పందనదాసు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతడు బాబులు వద్దకు వెళ్ళి, "మీరు మొత్తం రెండు వందల మంది ఉన్నారు. మీ తిండికి రోజుకు మనిషికి వరహాచోప్పున రెండు వందల వరహాలవుతుంది.ఆ వ్యయం నేను భరిస్తాను. వలస పోవద్దు, ఇక్కడే వుండండి," అని చెప్పాడు.*

*బాబులు తెల్లబోయి, "అయ్యా!! నీ ధర్మగుణం గొప్పది. కానీ ఇలా నువ్వు మమ్మల్నెంతకాలం పోషించగలవు?" అన్నాడు. "నేను రెండు రోజులపాటు గ్రామం నలుమూలలూ తిరిగి అందరి కష్టాలూ తెలుసుకుని, ఆ కష్టాలమీద కవిత్వం రాస్తాను. మహారాజును కలుసుకుని, ఆ కవిత్వం వినిపిస్తాను. అది విని గుండె కరిగి ఆయన మనకు సాయం చెయ్యకపోతే, నా కవిత్వం వృధా. నేను మళ్ళీ కవిత్వం చెప్పను. గ్రామానికి తిరిగి రాను," అన్నాడు స్పందనదాసు.*

*ఆ విధంగా స్పందనదాసు రెండు రోజుల పాటు గ్రామమంతా తిరిగాడు. ప్రజల దారుణ పరిస్థితులు కలిగించిన స్పందనతో, అతడి నోట ఆసువుగా కవిత్వం వెలువడింది. ఎప్పటికప్పుడు అతడు దాన్ని తాళపత్రాల మీద రాసుకున్నాడు. వాటిని తీసుకుని రాజధానికి ప్రయాణమయ్యాడు. ఆ ప్రయాణంలో అతడు ఎన్నో సుందర దృశ్యాలనూ, హృదయవిదారక విశేషాలనూ చూసి, తనలో వచ్చిన కవితావేశాన్ని తాళపత్రాల మీద పొందుపరిచాడు.*

*స్పందనదాసు రాజధాని చేరుకున్నాక, అతడు రాజు కొలువుకు వెళ్ళబోతే కాపలా భటులు అడ్డగించారు. అప్పుడతడు, "నేను విష్ణుభక్తుణ్ణి. రాజంటే సాక్షాత్తూ మహావిష్ణువు. మీరు జయ విజయుల్లా అడ్డు పడ్డారు. నా శాపం మీకు తగుల్తుంది. రాక్షస జన్మకు సిద్దమవుతారో, రాజుకు నా గురించి విన్నవిస్తారో-అది మీ ఇష్టం!" అంటూ ఒక పద్యం చెప్పి హుంకరించాడు. కాపలా భటులు, స్పందనదాసు గొప్ప తనాన్ని అర్థం చేసుకుని, వెంటనే లోపలకు వెళ్ళి రాజుకు విషయం విన్నవించారు. జరిగిందానికి రాజు అబ్బురపడి, స్పందనదాసును సగౌరవంగా లోపలికి తీసుకురమ్మన్నాడు.*

*స్పందనదాసు కొలువులో ప్రవేశించి, తన్ను తానే పరిచయం చేసుకుని, దుర్గాపుర గ్రామస్థుల కష్టాల గురించి తను రాసిన కవిత్వాన్ని వినిపించాడు. అది విన్న రాజుతో పాటు కొలువులోనివారందరూ కంట నీరు పెట్టారు. కోద్ది సేపు తర్వాత రాజు తేరుకుని, మంత్రి వంక తిరిగి, "దుర్గాపురానికి, మంత్రి తగిన సాయం అందే ఏర్పాట్లు వెంటనే చేయండి," అని ఆజ్ఞాపించాడు.తర్వాత స్పందనదాసుతో, "కవివర్య! నీ కవిత్వం మా మనసులను కలచివేసింది. మీ దుర్గాపురానికే కాదు, ఇబ్బందులకు గురైన ప్రతి గ్రామానికీ వెంటనే తగిన సాయం జరిగే ఏర్పట్లు చేస్తాను," అన్నాడు.*

*ఈ మాటలు వింటూనే స్పందనదాసుకు ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. అతడు తన ప్రయాణంలో చూసిన సుందర దృశ్యాలపై కావ్యగానం చేశాడు. రాజధాని వైబోగాన్నీ, రాజు గొప్పతనాన్నీ, ధర్మపాలననూ వర్ణిస్తూ కూడా అతడు కొన్ని పద్యాలు చెప్పగా, కొలువులోవున్న వారందరూ ఉత్సాహ భరితులై హర్షధ్వానాలు చేశారు.*

*రాజు, స్పందనదాసును తన ఆస్థానకవిగా వుండమని కోరాడు. అయితే, అతడు తన గ్రామం వారిని సంప్రదించాలన్నాడు. ఈలోగా, రాజాస్థానంలో స్పందన దాసుకు జరిగిన గౌరవసత్కారాలను గురించి విన్న బాబులు, దుర్గాపురం నుంచి వచ్చి, రాజును దర్శించి, "ప్రభూ! స్పందన దాసు కవిత్వం కోసం మా గ్రామ పేదలు పస్తులైనా వుండాలనుకున్నారు. అలాంటివాడిని మాకు దూరం చేయడం తమకు న్యాయం కాదు. స్పందనదాసును దుర్గా పురానికి పెద్దను చెయ్యండి. ఆ విధంగా అతడు మాతోనే వుంటాడు. మా బాగోగులు చూసుకుంటాడు," అన్నాడు.*

*అయితే, స్పందనదాసు, బాబులు మాటలకు ఒప్పుకోక, "నేను అక్కడ లేనప్పుడూ దుర్గాపురం లోని పౌరులు సుఖంగా, సంతోషంగా వున్నారు.నేను శాశ్వతం కాదు! నన్ను రాజాస్థానంలోనే వుండనివ్వు. అప్పుడప్పుడూ నేను దుర్గాపురం వచ్చి, మీ యోగక్షేమాలు తెలుసుకుని, మీకు నా కవిత్వం వినిపిస్తూఉంటాను.నాకంటే, నాకవిత్వం కంటే మీకు తిండి, బట్ట, నిద్ర ముఖ్యం," అని చెప్పి బాబులును పంపేశాడు.*

*బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, దుర్గాపుర గ్రామస్థులు స్పందనదాసు పట్ల ఎంతో ఆప్యాయతా గౌరవాలు కలవాళ్ళు. కఠినమైన కాటక పరిస్థితుల్లో కూడా, అతడూ తమతోపాటు గ్రామం విడిచి వలసకు రాకపోతే, తాము గ్రామం నుంచి కదలమని పట్టుబట్టారు. స్పందనదాసు వాళ్ళు దుర్బరస్థితిని తన కవితా శక్తితో రాజుకు వినిపించి, ఆయన ద్వారా గ్రామనికి మేలు కలిగించాడు; అంతవరకూ బాగానే వున్నది. కానీ, గ్రామప్రజల ప్రతినిధిగా బాబులు వచ్చి, రాజాస్థానకవి పదవిని వదలి తిరిగి స్వగ్రామానికి రావలసిందిగా కోరినప్పుడు, అతడన్న మాటలు కేవలం స్వార్ధ చింతనతో కూడినవిగా లేవా? స్పందనదాసు ఆస్థానకవిగా రాజ భోగాల కోసం, తను పుట్టి పెరిగిన గ్రామాన్నీ, అక్కడి ప్రజల ప్రేమాదరాలనూ అతి సులువుగా తిరస్కరించినట్టు కనబడడం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో, నీతల పగిలిపోతుంది," అన్నాడు.*

*దానికి విక్రమార్కుడు, "సాధారణంగా కవులైన వాళ్ళు ఊహాలోకాల్లో విహరిస్తూంటారు. వాళ్ళ కవిత్వ ఫలితం విన్నవాళ్ళమీద ఆధారపడి వుంటుంది. స్పందనదాసు కవిత్వం విని అతడి గ్రామస్థులు పరవశించారు. అంతకు మించి జరిగిందేమీ లేదు! అదే కవిత్వాన్ని రాజు విన్నప్పుడు, ఆయన వల్ల స్పందనదాసు గ్రామస్థులకే కాక, రాజ్యంలో కరువు కాటకాలకు గురైన అనేక గ్రామాలవాళ్ళకు మేలు జరిగింది. ఇది తెలుసుకున్నాక స్పందనదాసు,తన కవిత్వంతో తన గ్రామం వాళ్ళను సంతోషపరుస్తూ అక్కడ ఉండిపోవడంకన్న, రాజాస్థానంలో వుండి రాజుకు తన కవిత్వం వినిపిస్తూ, మొత్తం రాజ్య పౌరులందరికీ అంతో ఇంతో మేలు కలిగించవచ్చని భావించాడు. ఆ కారణంవల్లనే, అతడు రాజాస్థానంలో వుండిపోవడానికి నిర్ణయించుకున్నాడు. అంతే గాని స్వార్థం కొద్దీ అక్కడ లభించే రాజభోగాల కోసం మాత్రం కాదు, " అన్నాడు.*

*రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...