Thursday, April 23, 2020

ఇంతకి రాక్షసులంటే ఎవరు?

ఇంతకి రాక్షసులంటే ఎవరు? 

ఒకప్పుడు రాక్షసులంటే ప్రత్యేకంగా కొమ్ములు, కోరలతో భయంకరంగా ఉండేవారని మనకు తెలుసు. వాళ్ళను చూస్తేనే జనం హడలి చచ్చేవాళ్ళు. ఇప్పుడు యుగాలు మారాయి, కనుక వారు కూడా రూపాంతరం చెందారు. అసలు రాక్షసుల లక్షణాలు ఎలా ఉంటాయో, ఈ కాలంలో ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో పరిశీలిద్దాము. ఇవన్నీ మన శ్రీ మద్భాగవతం మొదలైన పురాణాల్లో చెప్పబడిన విషయాలు.

1) సాధారణ జనులు త్రాగే నీటి వనరులైన నదులను, చెఱువులను, కాలువలను విషతుల్యం చేసి, అవి వినియోగానికి పనిరాకుండా చేసేవారు. విషతుల్యమైన వనరులను ఉపయోగించిన అమాయకులు మరణించేవారు. ఆ విధంగా హింసించి ఆనందించేవారు. 

2) ఆహార పంటలను ధ్వంసం చేసేవారు. ఆహారన్ని విషతుల్యం చేసేవారు. భూమి వ్యవవసాయానికి పనిరాకుండా చేసేవారు.

3) గాలిలోకి విషవాయువులను పంపించి, జనుల మృతికి కారణమయ్యేవారు.

4) ప్రకృతిని కలుషితం చేసేవారు. అడవులను నరికి, ఉద్యానవనాలను నాశనం చేసి నిప్పు పెట్టేవారు. హిరణ్యకశిపుడు ఈ విధంగానే చేశాడని శ్రీ మద్భాగవతం చెబుతోంది.

5) జీవహింస చేసేవారు. లక్షల సంఖ్యలో గోవులు మరియు సకల జీవరాశి యొక్క మృతికి కారణమయ్యేవారు.

6) అవసరమైన దానికంటే అధిక సంఖ్యలో వనరులను వినియోగించి, భూమిని పీల్చి, పిప్పి చేసి, గుల్ల చేసేవారు. హిరణ్యాక్షుడు చేసిందాంట్లో ఇది కూడా ఉంది.

7) జనులను మానసికంగా, శారీరింగా హింసించేవారు, భయభ్రాంతులకు గురి చేసేవారు. రావణుడికి ఆ పేరు రావడానికి కారణం ఇదే. అనసవరంగా జనాల్లో భయం కలిగించేవాడు.

8) యజ్ఞయాగాదులను విమర్శించేవాళ్ళు, వాటి మధ్యలోనే ఆపివేయడానికి విఘ్నాలు కలిగించేవారు, వాటిని భగ్నం చేసేవారు. సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేసేవారు. మంచి పనులు చెద్దామనుకున్నవారికి ఆటంకాలు కలిగించేవారు.

9) తమ ఆలోచనతో అంగీకరించనివారిని హింసించి చంపేవారు. అందరూ తమవలె ఆలోచించాలని, తమనే దైవంగా పూజించాలని బలవంతపెట్టేవారు.   

10) కొందరు రాక్షసులు దేవుడిని నమ్మేవారు, కొందరు దేవుడిని నమ్మేవారు కాదు, కొందరేమో తామే దేవుడని ప్రచారం చేసుకునేవారు.

ఇప్పుడు పైన చెప్పిన లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయో చూడండి. బాంబులు వేసి జనాల మృతికి కారణమయ్యేవాడు ఉగ్రవాది అయితే, భూసారం క్షీణించడానికి, నదులు కలుషితమై జనులు అనారోగ్యం పాలవడానికి కారకులయ్యేవారు ఉగ్రవాదులు కారా? తేడా ఒకటే, ఒకరు హింసతో అధికారం చెలాయించాలని చూస్తుంటే, వెరొకరు వ్యాపారం పేరుతో అధికారం చెలాయిస్తూ విధ్వంసం చేస్తున్నారు, మిగితావారు నిర్లక్ష్యంతో చేస్తున్నారు. ప్రపంచ జనాభాకు రెండింతల ఆహారం భూమి ద్వారా లభిస్తుంటే, ఆ మొత్తాన్ని జంతువులకు పెట్టి, ఆ జంతువులను తింటున్నారు మనుష్యులు, వెరొకరి ఆకలి చావుకు కారణమవుతున్నారు. భూమిని పిండి మొత్తం వనరులు ఒక తరంలోనే ఖాళీ చేసేస్తున్నారు.

ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చూడండి. మానవుల కార్యకలాపాలన్నీ స్థంభించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రకృతి ఊపిరి పీల్చుకుంటోంది. ప్రకృతి తిరిగి తన పూర్వస్థితికి వస్తోంది. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, కాలుష్యం తగ్గింది. మనుషులంతా ఈ విపత్తు తొలగించమని దేవుడిని వేడుకుంటుంటే, ప్రకృతి ఇదే బాగుందని ఆనందిస్తోంది. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్ధన వినాలి ?  (ఈ విపత్తు తొలగిపోతుంది, అయినప్పటికీ ఒకసారి ఆలోచన చేయండి) దీనిబట్టి ఇన్నాళ్ళు ప్రకృతిని హింసించిన రాక్షసులు ఎవరో చెప్పకనే చెబుతోంది ప్రకృతి. ఆత్మవిమర్శ (Self-introspection) చేసుకుని ప్రకృతి హిత జీవనానికి బాటలు వేయడానికి ఇదే సరైన సమయం. బహుసా! మనకు భగవంతుడు చెబుతున్నది కూడా అదేనేమో ! మనం వింటున్నామా ?! మనం మారతామా ? ప్రభుత్వాలు ప్రకృతి హితమైన అభివృద్ధి దిశగా బాటలు వేస్తాయా ? ఇప్పుడున్న విధానాలు మారుతాయా ?  సామాన్యులు సైతం ఈ దిశగా తమ జీవితాలను రూపుదిద్దుకుంటారా?

మనం దైవీ లక్షణాలను ప్రదర్శించనవసరంలేదు. రాక్షసగుణాలు వదిలి, మనుష్యులుగా బ్రతకడం నేర్చుకుంటే చాలు. అందుకే వేదం 'మనుర్భవ' - ముందు మనుష్యులుగా మారండి అని సందేశం ఇచ్చింది. కనీసం ఇప్పుడైనా వింటామా ?

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...