*భేతాళ కథలు*
*మౌన యోగి*
*పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపైనుంచి శవాన్నిదించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఈ అర్ధరాత్రి వేళ, భయంగొలిపే ఈ శ్మశానంలో ఏ కార్యార్ధివై ఇన్ని ఇక్కట్లకు ఓర్చి శ్రమిస్తున్నావో తెలియదు. కానీ, నువ్వు మహాత్ముడు, మహా యోగి అని ఎవరినైనా నమ్మి వాళ్ళ కోసం ఇన్ని బాధలకు లోనవుతుంటే మాత్రం తగు హెచ్చరికలో వుండడం అవసరం. ఎందుకంటే, అలాంటివాళ్ళల్లో చాలామంది రాజాశ్రయంలో సుఖభోగాలు అనుభవించ వచ్చునన్న తాపత్రయంలో ఉంటారు. ఇందుకు ఉదాహారణగా, మౌనయోగి రాజు కనకసేనుడు అనే వాళ్ళ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను," అంటూ ఇలా చెప్పసాగాడు:*
*మమతాపురి అనే నగరం శివార్లలోని కరుణానది తీరంలో ఒక పెద్ద మర్రిచెట్టు వుండేది. ఆ చెట్టు కింద ఒక యోగి ఉండేవాడు. అతణ్ణి చూసిన జనం మొదట అతడొక పిచ్చివాడు అనుకున్నారు. కానీ, అతడిలో ఎలాంటి మతిభ్రమణ లక్షణాలూ కనిపించలేదు. అతడి వళ్ళ ఎవరికీ ఎన్నడూ ఎటువంటి కష్టమూ కలగలేదు. అందువల్ల అతడు ఎవరో యోగి అయివుంటాడని భావించారు.*
*ఆ యోగి దగ్గరకు ఎవరు వెళ్ళి ఏమి అడిగినా మాట్లాడేవాడు కాదు. వాళ్ళు ఏమైనా కాయలూ, పండ్లూ తెచ్చిపెడితే మాత్రం తినేవాడు. కొందరు అతణ్ణి చెవిటి, మూగ యోగి అని కూడా పిలిచేవారు.
ఒక రోజున ఆ ప్రాంతంలోని ఆబోతు ఒకటి చెలరేగి, కనిపించినవారిని తన కొమ్ములతో కుమ్మి పొడుస్తూ నానా రభస చేయసాగింది. జనం దాన్నిపట్టి బంధించాలని వెంటబడ్డారు. అది రంకెలు వేస్తూ చెవిటి మూగయోగి కూర్చునివున్న మర్రిచెట్టుకేసి వచ్చింది. జనం కంగారుగా," యోగి, లేచి పారిపో! లేకపోతే ఆబోతు వచ్చి మీద పడుతుంది, "అని అరవసాగారు.*
*కాని, యోగిలో చలనం లేదు. ఆబోతు అలసిపోయి నోటివెంట నురుగులు కక్కుతూ యోగి దాపులకు వచ్చి ఒకటి రెండు క్షణాలు నిలబడి, చప్పున అతడి ముందు పడుకుని సేద తీరసాగింది. ఆబోతు ఇలా ప్రవర్తించడంలో యోగి ప్రమేయం ఏమీలేదు. అలా జరగడం పూర్తిగా కాకతాళీయం. అయితే, ఈ జరిగినదానికి అక్కడ గుమిగూడిన జనం రకరకాలుగా అర్ధాలు చెప్పుకున్నారు.*
*"ఈ యోగి చెవిటి మూగేకాదు; చూపు కూడా లేనివాడు. అలాకాకపోతే, ఆబోతు మీదకి వస్తున్నా ఎందుకు పారిపోడు!" అన్నారు జనంలో కొందరు. "అలా అనడం మహాపచారం. ఈయన ఒక మహాయోగి. అందువల్లనే అంతగా రెచ్చిపోయిన ఆబోతు, ఆయన ముందు సాధువుగా మారిపోయింది. ఈయన దగ్గర అధ్భుతశక్తులున్నాయి. ఈ మహాయోగి ఇక్కడ వుండడం మన నగరానికి ఎంతో మేలు!" అంటూ కొందరు ప్రచారం ప్రారంభించారు.*
*ఆ రోజు నుంచి యోగి దగ్గరకు వచ్చే జనం పెరిగిపోయారు. అలా వచ్చిన వాళ్ళు తమకు తోచిన కానుకలుగా కాయో, ఫలమో, తమ పొలంలో పండిన పంటో భక్తితో తెచ్చిఇచ్చేవారు. ఆ కానుకలను యోగి తన దగ్గరకు వచ్చే ఇతర భక్తులకు ఇచ్చేవాడు. అందరూ యోగి త్యాగగుణాన్ని గొప్పగా పొగుడుతూ చెప్పుకునేవారు. కొందరు యోగికి తమకెదురైన సమస్యల గురించి చెప్పి,ఆయన సలహా అడిగేవారు. యోగి ఏమీ మాట్లాడేవాడు కాదు. తమ సమస్యలకు పరిష్కారం అడిగిన వాళ్ళే ఏదో తమకు తోచినది చెప్పి," ఇలా చెయ్యమంటారా, స్వామీ? ఇలా చేస్తే మాకు మంచి జరుగుతుంది కదా!" అని అడిగేవారు.
యోగి వాళ్ళ మాటలు వినీవిననట్టు వుండేవాడు. ఏదో ఒకదానికి సరేనన్నట్టు సంకేతంగా తల ఊపేవాడు. కొన్నింటికి కాదన్నట్టు తల అడ్డంగా ఊపేవాడు. ఇప్పుడు యోగిని, జనం సంకేతయోగి అని కూడా పిలవసాగారు. క్రమంగా, యోగి గురించి మమతాపురి నగరంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విపరీతమైన ప్రచారం జరిగింది. దాంతో ఆయన దగ్గరకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో పాటు, వాళ్ళు ఇచ్చే కానుకల విలువ కూడా పెరిగింది. ఆ ప్రాంతంలో లౌక్యం తెలిసిన కొందరు వంచకులు, యోగి వున్న మర్రిచెట్టు చుట్టూ ఒక దడి కట్టి, ఆయనను దర్శించడానికి వచ్చినవాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేయడం ప్రారంభించారు. తాము యోగిబాబా అనుమతితోనే అక్కడ ఒక ఆశ్రమం కట్టేందుకు చందాలు వసూలు చేస్తున్నామని అనేవారు. కానీ ఆ ధనాన్ని వాళ్ళే తలాకాస్త పంచుకుని తినేసేవాళ్ళు. అంతేకాక యోగికి తిండిపెట్టే విషయంలో కూడా ఆవంచకులు లాభాలు చేసుకోవడం ప్రారంభించారు. యోగికి రాత్రివేళ తినేందుకు ఒకటి రెండు ఎండు రొట్టెలు మాత్రమే ఆహారంగా పెట్టేవారు. అయినా యోగి ఎన్నడూ ఎవర్నీ ఏమీ అనేవాడు కాదు. ఎప్పటిలాగే రోజులు గడుస్తున్నాయి.*
*ఇలా వుండగా, ఒకసారి ఆ యోగి గురించి ఆ దేశం రాజు కనకసేనుడికి తెలిసింది. చెవిటి, మూగ, కంటి చూపు కూడా లేని ఆ యోగి, జనానికి మౌనంగా తల ఊపుతూ మేలు కలిగేలా సేవచేయడం గురించి విన్నాక, రాజుకు యోగిని చూడాలనిపించింది. ఒక నాటి రాత్రి భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత, రాజు మారువేషంలో యోగి దగ్గరకు వచ్చాడు. యోగి ముందున్న ఆకులో రెండు ఎండురొట్టెలు వున్నాయి. కాస్త దూరంలో ఒక కాగడా మాత్రం వెలుగుతున్నది. యోగి కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరుగుతూ వున్నాయి. ఆయన గత జీవితంలో ఏదో ఒక విషాద కథ వుండ వచ్చని రాజుకు అనిపించింది. "స్వామీ! నేను ఈ దేశం రాజును. మీరు జనానికి గుడ్డి, మూగ, చెవిటి యోగి కావచ్చు.*
*కానీ మమ్ములను సరిగా అర్ధం చేసుకోలేక, మీకు ఈ పేర్లు పెట్టినవాళ్ళే ఒక రకంగా వికలాంగులు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడవలసిన తరుణం వచ్చిందని, నాకు తోస్తున్నది. దయచేసి, నాకు మీ గురించి చెప్పండి!" అని రాజు కనకసేనుడు, యోగిని వేడుకున్నాడు. "మహారాజా, మీ మాటలు విన్నాక ఇక ఈ మౌనవ్రతం చాలించాలని నిర్ణయించుకున్నాను. మీరు చెప్పకముందే మీరెవరో గొప్ప వ్యక్తి అని నేను గ్రహించాను. నిజం ఎన్నడూ నిజంగానే ఉంటుంది. దాని మహాశక్తి ముందు ఎలాంటి మౌనం లేని అబద్ధం నిజం ముసుగువేసుకు నిలవలేదు!" అని యోగి ఒక్క క్షణం మౌనం వహించాడు. మాట్లాడడం ప్రారంభిస్తూనే తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన యోగి మీద రాజుకు అపారమైన ఆదరభావం కలిగింది.*
*యోగి ఇలా చెప్పడం ప్రారంభించాడు: "మహారాజా! నిజమైన చక్షువులు మన మనో నేత్రాలే కదా! ఈ బాహ్య నేత్రాలు చూసే వన్నీ నిజాలవవు కదా? నిజాలని నమ్మించడానికి, అబద్ధాలను నిజాలుగా చూపితే, అవి అబద్ధాలని గుర్తించడానికి, మనకు ఈ మనో నేత్రాలే కదా శరణం. అందుకే నిజాన్ని చూడలేని ఈ కళ్ళతో చూడడం ఎందుకని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచీ నేను, ఈ కళ్ళతో చూడడం మానేశాను. ఆనాటి నుంచీ ఈ కళ్ళతో నేను చూసేది ఏదీ నా మనసును తాకదు. తాకినా దానిని నా మనసు స్వీకరించదు. అలా బాహ్యనేత్రాల దృష్ట్యా నేనొక గుడ్డివాడినయ్యాను!" అని అడిగాడు.*
*"మహాత్మ! జనం మిమ్మల్ని గుడ్డివారనే కాదు, మూగ, చెవిటి అనికూడా అనుకుంటున్నారు. మీరిలా ప్రవర్తించడానికి ఏదైనా బలమైన కారణం వున్నదా?" అని అడిగాడు రాజు. "ఉన్నది, మహారాజా,వినండి! నా భార్యకు ఒకే ఒక్క తమ్ముడు. వాడంటే ఆమెకు ఎక్కడలేని ప్రేమా, ఆదరణా. వాడు చేస్తున్న వ్యాపారంలో బాగా నష్టపోయి అప్పులవాళ్ళ బాధలో వుండగా, నా భార్య కళ్ళ నీళ్ళ పర్యంతమై కోరిన మీదట, నాకున్న ఐదెకరాల పొలంలో మూడెకరాలు గ్రామంలో వున్న వడ్డీ వ్యాపారికి తాకట్టు పెట్టి, వాడికి డబ్బు సర్ధాను. నగరంలో లాభసాటిగా వ్యాపారం చేస్తున్న తన మిత్రుడితో కలిసి వ్యాపారం చేసి, సంవత్సరం లోపల నా డబ్బు తిరిగి ఇచ్చి తాకట్టు విడిపిస్తానని మాట ఇచ్చాడు. కానీ సంవత్సరం గడిచినా వాడి నుంచి డబ్బు రాకపోగా, మనిషి ఏమయ్యడో కూడా తెలియలేదు. ఈ లోపల వడ్డీ వ్యాపారి నుంచి వత్తిడి ఎక్కువైంది. ఇది పని కాదని, నేను దూర గ్రామంలో వున్న బంధువొకాయన దగ్గరకు డబ్బు కోసం వెళ్ళాను, ఫలితం కలగలేదు. నేను వారం రోజుల తర్వాత మా గ్రామానికి తిరిగి వస్తుండగా, గ్రామ రచ్చబండ దగ్గరర కూర్చుని వున్న వడ్డీ వ్యాపారీ, గ్రామాధికారీ, మరిద్దరు పెద్దలు నేను బాకీ వడ్డీతో సహా పక్షం రోజుల్లో తీర్చక పోతే పొలంతో ఇల్లుకూడా వదులుకో వలిసి వస్తుందని గట్టిగా హెచ్చరించారు."మహారాజా! కుటుంబ గౌరవం, ప్రతిష్ఠా అనేవి రాజుకైనా, సామాన్య గృహస్థుకై నా ప్రాణప్రదమైనవి. నేను గడప దాటి ఇంటిలో అడుగుపెట్టగానే, నా భార్య నవ్వుతూ ఎదురు పడి ఏదో చెప్పబోయింది. అయితే రచ్చబండ దగ్గర జరిగిన అవమానంతో మితిమీరిన కోపంలో ఉన్న నేను, ఆమెనూ, ఆమె తమ్ముణ్ణీ మొత్తం వాళ్ళ వంశాన్ని నానా దుర్భాషలాడడం ప్రారంభించాను. అంతే! ఆమె పెద్దగా శోకం పెడుతూ పెరటిలోకి పరిగెత్తింది. నేనేంపట్టించుకోలేదు. ఆ తర్వాత కొంత సేపటికి పక్క గదిలోకి వెళ్ళగా, వారం రోజుల్లో డబ్బుతో తాను వస్తున్నట్టు, ఆమె తమ్ముడు రాసిన ఉత్తరం కనిపించింది," అని యోగి కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఆగాడు.*
*"తమ భార్య పెరట్లోవున్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది! అంతే గదా, మహాత్మ?" అన్నాడు రాజు. "జరిగిందిదే, మహారాజా! నేను ఇంటి తలుపులు కూడా మాయకుండా, అప్పటి కప్పుడు బయల్దేరి దేశదిమ్మరినై కొన్నాళ్ళకు నదీతీరంలో ఈ మర్రి చెట్టు కిందికి చేరాను. ఆ క్షణం నుంచీ నేను అంధుణ్ణీ, మూగ, చెవిటి వాణ్ణి," అన్నాడు. "మరి మీ గురించి ప్రచారంలో వున్న అద్భుత శక్తులమాటేమిటి, మహాత్మా!" అని ప్రశ్నించాడు రాజు. "నాలో ఏవో అద్భుత శక్తులున్నవి పని గట్టుకు ప్రచారం చేస్తూ, లాభపడుతున్న వంచకుల గురించి నాకు సర్వం తెలుసు. రాత్రింబవళ్ళు నన్ను కలవరపరుస్తున్న సమస్య అదొక్కటే. కానీ, నేను నిస్సహాయుణ్ణి!" అన్నాడు యోగి. మరుసటి రోజు మౌనయోగిని దర్శించు కుందామని వచ్చిన భక్తులకు పెద్ద నిరాశ ఎదురయింది. అక్కడ ఆయన లేడు. ఆ తర్వాత కూడా ఆయన ఎవరికీ కనిపించ లేదు. మహారాజు అంతరంగిక సలహాదారులలో కొత్తగా చేరిన వయోవృద్ధుడే, ఆ మౌన యోగి అని కనకసేన మహారాజు ఒక్కడికి మాత్రమే తెలుసు.*
*బేతాలుడు ఈ కథ చెప్పి, "రాజా, ఇన్నేళ్ళుగా గుడ్డి, చెవిటి, మూగగా కాలం గడిపిన యోగి, రాజును చూసి ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నాడు? తాను యోగిగా వుంటూ ప్రజలకు చేసే సేవకంటే, రాజుకు ఆంతరంగిక సలహాదారుగా వుండడం గొప్ప ప్రజాసేవ ఎలా అవుతుంది? యోగిగా జీవించడం పట్ల కలిగిన విసుగుతో, రాజు దగ్గర లభ్యమయ్యే సుఖభోగాల పట్ల కాంక్ష కలిగి, అతడు రాజాశ్రయాన్ని కోరినట్టు స్పష్టంగా అర్ధమవుతున్నది గదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో, నీ తలపగిలిపోతుంది," అన్నాడు.*
దానికి విక్రమార్కుడు, "రాజు కనక సేనుడు తనను అడిగిన ప్రశ్నలు వింటూనే, యోగికి ఆయన విజ్ఞవంతుడనీ, జిజ్ఞాసువు అని అర్ధమైంది. తాను స్వయంగా తనకు ఆపాదించుకున్న మూగ, గుడ్డి, చెవిటితనంతో, తనొక చెడుకు సాధనం కారాదని ఆయన నిర్ణయించుకున్నాడు. తన పంచన చేరి, తన మౌన వృతాన్ని స్వలాభానికి ఉపయోగించుకుంటున్న వంచకుల మోసం చూడలేక ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. అది చూసి రాజు, యోగికి మనశ్శాంతి అవసరమని గుర్తించాడు. కానీ, సమస్యకు అది పూర్తి పరిష్కారం కాదు. ఎందుకంటే, మరొక తరహా వంచకుల యోగి చుట్టూ చేరే ప్రమాదమున్నది. అందుకే, రాజాయనను ఎవరికీ తెలియకుండా తీసుకుపోయి, తన సలహాదారుగా గౌరవించాడు. ఈ జరిగిన దానిలో, యోగి రాజు దగ్గర లభ్యమయ్యే సుఖభోగాలకు ప్రలోభపడడం అన్న ప్రసక్తే లేదు," అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.*
No comments:
Post a Comment