Friday, April 24, 2020

వైశాఖ పురాణం 2వ అధ్యాయము వైశాఖ పురాణం రెండవ అధ్యాయము :-

వైశాఖ పురాణం 2వ అధ్యాయము

                               వైశాఖ పురాణం
                          
రెండవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

               వైశాఖమాసమున చేయవలసిన
               వివిధ దానములు వాని ఫలితములు

నారద మహర్షి అంబరీష మహారాజు తో మరల ఇట్లనెను అంబరీష మహారాజా వినుము విష్ణు ప్రీతికరమగుటచే మాధవమాసముని వైశాఖమునందురు. వైశాఖ మాసము తో సమానమైన మాసము లేదు. కృత యుగమంతటి ఉత్తమ యుగము లేదు. జల దానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖము తో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు.

నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి,వ్యవసాయము తో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.

శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు  ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మల నందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువాని ఎన్ని ధర్మకార్యములను చేసినను - వైశాఖమాస వ్రతమును పాటింపనిచో - యివి అన్నియు వ్యర్ధములగుచున్నవి వైశాఖ వ్రతమును పాటించడానికి మాధవార్పితముల గావించి భక్షించే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుజ్యము కలుగును. అధిక ధనవ్యయముచే చేయగల వ్రతములెన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు ఎన్నో ఉన్నవి ఆ వ్రతములెన్నియో ఉన్నవి.ఆ వ్రతములన్నియు - తాత్కాలిక ప్రయోజనములు కలిగించును అంతేకాదు పునర్జన్మను కలిగించును. అనగా ముక్తినీయవు. కనుక నియమపూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము - పునర్జన్మను పోగొట్టును , అనగా ముక్తిని ఇచ్చును.

అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము సర్వతీర్థములందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున - జలదానము చేసినంతనే వచ్చును. జల దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి మరియొకనికి ప్రభోదించిన అట్టివానికి సర్వ సంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునకు - జల దానమును మరొకవైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును.

                         

బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జల దానము చేసినచో వాని కులము లోని వారందరూ పుణ్యలోకములు నందుదురు జలదానము చేసిన వారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము ఏర్పరుచుటచే బాటసారులు ,సర్వ దేవతలు ,పితృదేవతలు ,అందరును సంతృప్తులు ప్రీతి నంది వరములు ఇవ్వును. ఇది నిస్సంశయముగ సత్యము సుమా.దప్పిక గలవాడు నీటిని కోరును. ఎండ బాధ పడిన వాడు నీడను కోరును. చెమట పట్టినవాడు -  విసరుకొనుటకు - విసనకర్రను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును గొడుగులు విసనకర్రలు దానమియ్యవలెను నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై జన్మించును. (చాతకమను పక్షి - భూస్పర్శకల నీటిని త్రాగినా  చనిపోవును కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను - క్రింద పడకుండా - ఆకాశముననే త్రాగి ఉండును . ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు.

దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్య ఫలము కలుగును. ఎండకు అలసిన వానికి / బ్రాహ్మణునకు విసనకర్రతో విసరి ఆదరించినవాడు పక్షరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలము ఈయనివారు -  బహువిధములైన  వాతరోగములంది పీడితులు అగుదురు.ఎండకు అలసిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో - పై బట్ట (ఉత్తరీయము వగైరా) తో విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నొందును .పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నొందును.అలసటను వెంటనే పోగొట్టున్నట్టి విసనకర్రను ఈయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.

                           

గొడుగును దానము చేసినచో - ఆధిభౌతిక ,ఆధిదైవిక, ఆధిఆత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయనివాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను (చెప్పులను) దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇహలోకమున బాధలను పొందడు. సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి ,చెప్పులు లేవని అడిగినవారికి - చెప్పులను దానం చేసిన వాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు -బాటసారులకు ఉపయోగించినట్లుగా - అలసట తీరునట్లుగా మండపము మున్నగునవి నిర్మించినవాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలరు. 

                                      

మధ్యాహ్న కాలమున అతిధిగా వచ్చిన వానిని /బ్రాహ్మణుని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా ! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించే దానములలో అత్యుత్తమము. కావున అన్న దానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలం అడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గల వానికి,భార్య ,సంతానము ,గృహము ,వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టము కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము ఆవశ్యకము.కానీ ఆకలి తీరినచో ఇవి అన్నియు ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా - అన్నము - భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది . అట్టి అన్నదానము అన్ని దానముల కంటె ఉత్తమమైనదని భావము. కావున అన్ని దానముల తో సమానమైన దానమును ఇంతకు ముందు లేదు . ముందు కాలమున కూడా ఉండబోదు . 

వైశాఖ మాసమున అలిసిన బాటసారికి /బ్రాహ్మణునికి - జల దానము, ఛత్రదానము, వ్యజన దానము, పాదుకా దానము, అన్నదానము , మున్నగువానిని చేయనివారు పిశాచమై,ఆహారం దొరకక తన మాంసమును భక్షించునట్టి దురవస్థను పొందుదురు . కావున త్రిలోకవాసులందరును, అన్నదానము మున్నగువానిని యధాశక్తిగా చేయవలయును . రాజా ! అన్నము పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరును, అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు . కానీ అన్న దానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజ మైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు సర్వ ధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున, అన్ని తీర్థములు (వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు (వారిని పూజించిన ఫలము) సర్వ ధర్మములు (అన్ని ధర్మములు నాచరించిన ఫలము) కలుగును భావము.

!!వైశాఖ పురాణం రెండవ అధ్యాయము సంపూర్ణము!!

       🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...