Thursday, April 23, 2020

వైశాఖ పురాణం 1వ అధ్యాయము

వైశాఖ పురాణం 1వ అధ్యాయము

                
మొదటి అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


వైశాఖమాస ప్రశంస


సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. 


🔷 వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి?


🔷 ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి?


🔷 మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? 


🔷 వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? 


మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.

                 

నారదుడును రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. 


💠 విద్యలలో వేదవిద్యవలె, 

💠 మంత్రములలో ఓంకారమువలె, 

💠 వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, 

💠 ధేనువులలో కామధేనువువలె, 

💠 సర్వసర్పములలో శేషునివలె, 

💠 పక్షులలో గరుత్మంతునివలె, 

💠 దేవతలలో శ్రీమహావిష్ణువువలె, 

💠 చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె 

💠 యిష్టమైన వానిలో ప్రాణమువలె, 

💠 సౌహార్దములు కలవారిలో భార్యవలె, 

💠 నదులలో గంగానది వలె, 

💠 కాంతి కలవారిలో సూర్యుని వలె, 

💠 ఆయుధములలో చక్రమువలె, 

💠 ధాతువులలో సువర్ణమువలె, 

💠 విష్ణుభక్తులలో రుద్రునివలె, 

💠 రత్నములలో కౌస్తుభమువలె, 

💠 ధర్మహేతువులగు మాసములలో     వైశాఖమాసముత్తమమైనది.



విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును
    

అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.

వైశాఖ పురాణం మొదటి అధ్యాయము సంపూర్ణము 



     🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...