Sunday, February 9, 2020

ఓం కారేశ్వరంసృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు. అందుకే ఆయన ఓంకారేశ్వరుడు అయ్యాడు. నర్మదా నదీమతల్లి ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర క్షేత్రం విరాజిల్లుతోంది.

ఓం కారేశ్వరం

సృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు. అందుకే ఆయన ఓంకారేశ్వరుడు అయ్యాడు. నర్మదా నదీమతల్లి ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర క్షేత్రం విరాజిల్లుతోంది.ఓంకారం పరమేశ్వరుడి ఆత్మస్వరూపం. ఆత్మ, పరమాత్మలకు ప్రతీకగా పరమశివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి ఒకటి ఓంకారేశ్వర్‌ ప్రణవలింగముగా, మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగముగా ఆవిర్భవించింది. ఈ క్షేత్రంలో స్వామివారు రెండు జ్యోతిర్లింగాల రూపంలో పూజలు అందుకోవడం విశేషం.

అతి పురాతన జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం భక్తుల పాలిట ఇలకైలాసంగా చెబుతుంటారు. ఈ ప్రధాన ఆలయంలోని పరిశుద్ధనాథ్‌, వైద్యనాథ్‌, మహాకాళేశ్వర్‌, కేదారీశ్వర్‌, గుప్తనాథ్‌ పేర్లతో వివిధ ముఖాలయాలు ఉన్నాయి. ఈ అయిదు ఆలయాలను పంచలింగ దామాలుగా పిలుస్తారు. నిత్యం నర్మదా నదీ జల ప్రవాహంతో పునీతమయ్యే ఈ దివ్యదామాన్ని ఒక్కసారి దర్శించిన చాలు జన్మ ధన్యమైనట్టే. మొదట ఓంకారేశ్వరుడిని, అనంతరం మమలేశ్వరుడిని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని ప్రాశస్త్యం.

స్థల పురాణం
పూర్వం స్వర్గాన్ని దానవులు ఆక్రమించుకుని దేవతలను హింసలకు గురిచేసిన సమయంలో ఇంద్రుడు పరమేశ్వరున్ని పూజించాడు. జ్యోతిస్వరూపుడైన ఓంకారేశ్వరుడు పాతాళ లోకం నుంచి లింగాకారంలో వెలసి దానవుల బారినుంచి స్వర్గాన్ని రక్షించి తిరిగి దేవతలకు అప్పగిస్తాడు. నర్మదా నదీ తీరాన బ్రహ్మ, విష్ణువులు కూడా కొలువై ఉండటంతో ఈ క్షేత్రాన్ని త్రిపుర క్షేత్రం అంటారు. బ్రహ్మవెలసిన క్షేత్రాన్ని బ్రహ్మపురి, విష్ణువు వెలసిన క్షేత్రాన్ని విష్ణుపురి అంటారు. ఆ పరమేశ్వరుడు వెలసిన క్షేత్రాన్ని రుద్రపురి అని పిలుస్తారు. ఆ రుద్రపురిలోనే మమలేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది.

పురాణ కాలంలో మాంధాతరాజు ఇంద్రుని ఆశీస్సులతో రాజ్యాధికారాలను స్వీకరిస్తాడు. అతను పరమ శివ భక్తుడు. నిత్యం ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ ఉండేవాడు. నర్మదా నదీ పవిత్ర జలాలు పర్వతాలపై నుంచి వెలువడి ఆ ఓంకారేశ్వరున్ని నిత్యం అభిషేకిస్తాయి. తరువాతి కాలంలో మాంధాత ఈ పవిత్ర స్థలాన్ని తన రాజధానిగా ప్రకటించాడు. ఈ ప్రదేశాన్ని ఓంకార మాంధాతగా కూడా పిలుస్తారు. ఓంకారేశ్వరుడు కొలువై ఉన్న ఈ పర్వతంపై అగస్త్యుడు లాంటి గొప్ప మునులెందరో ఈ ప్రదేశంలో తపస్సును ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి.

ఆలయ విశిష్టత
ఓంకారేశ్వర దేవాలయాన్ని మాంధాత నిర్మించగా తరువాతి కాలంలో వివిధ రాజ్యవంశాలు ఆలయాన్ని పునఃనిర్మించారు. రాణి అహల్యాదేవీ హోల్కర్‌ ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయించారు. ఇక్కడి ఆలయ గోపురం ఒక పక్కకు ఒరిగి ఉంటుంది. ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆర్జిత సేవలుగా పరిగణిస్తారు. ఓంకారేశ్వర దర్శనం అనంతరం భక్తులు నర్మదా నది అవతల వైపు ఉన్న మమలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మమలేశ్వర ఆలయంలో సైతం ఉప ఆలయాలు ఉన్నాయి. గర్భాలయంలో మమలేశ్వరుడు జ్యోతిర్లింగం రూపంలో దర్శనం ఇస్తాడు. ఈ స్వామివారినే అమలేశ్వరుడు అనికూడా అంటారు. ఈ రెండు పవిత్ర లింగాలను దర్శించనంతనే తమ జన్మ ధన్యమవుతుందని భక్తులు పరవశులవుతారు.

ఎలా చేరుకోవచ్చు
* మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి ఈ క్షేత్రం 77 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
* ముంబయి, దిల్లీ, గ్వాలియర్‌, భోపాల్‌ నుంచి ఇండోర్‌కు విమాన సర్వీసులను నడుపుతున్నారు.
* ఇండోర్‌ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో రాట్లాం-ఖాండ్వాకు రైలు మార్గం ఉంది. దిల్లీ ముంబయిల నుంచి కూడా రైలు సౌకర్యం ఉంది.
* ఇండోర్‌ నుంచి ఉజ్జయిని, ఖాండ్వాకు బస్సు సర్వీసులను నడుపుతున్నారు. హైదరాబాద్‌ నుంచి అయితే 772 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేరుగా భోపాల్‌ లేదా ఇండోర్‌ వెళ్లి అక్కడి నుంచి ఓంకారేశ్వర్‌కు వెళ్లవచ్చు.

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...