Friday, February 7, 2020

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి.

శుభోదయం..

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు చెబుతున్నారు.

జనన వృత్తాంతము :

అదితి , కశ్యప ముని కుమారుడైన సుర్యభగవానునికి ముగ్గురు భార్యలు -- ఉషా(సంజ్ఞా) , చాయ , పద్మిని .

లోకాలన్నటికి వెలుగునిచ్చే సూర్యుడు త్వష్ట ప్రజాపతి "విశ్వకర్మ" కూతురు సంజ్ఞా(ఉమా) దేవిని పెళ్ళిచేసుకున్నాడు . పెళ్ళైన నాటి  నుండే సూర్యకాంతిని , తేజస్సును భరించలేక , చూడలేక విచారము తో ఉన్న ఉమాదేవి ని నారదుడు చూసి , విషయము తెలుసుకొని ... ఈశ్వరుని తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయమార్గము చెప్పెను. 

అప్పటికే తనకి ముగ్గురు పిల్లలు  -మొదటివాడు వైవాస్తవ, రెండవ వాడు యముడు . మూడవది కూతురు యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణము పోసి "చాయాదేవి" గా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయెను.

కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున తండ్రి అనరాని మాటలతో నిందించి తిరిగి సుర్యునివద్దకే వెళ్ళిపొమ్మని చెప్పగా .. గోప్యం గా ఉన్న ఛాయా రహస్యము బయట పడ కూడదనే సదుద్దేశముతో అడవికి పోయి తపస్సు చేయసాగెను.. 

తన అందము , యవ్వనము చూసి ఇతరులబారినుంది తప్పించుకొనుటకు గుఱ్ఱము రూపములో మారిపోయి ఈశ్వరునికి తప్పస్సు చేయసాగెను . సూర్యునికి .. ఛాయాదేవికి "మను (సావర్ణుడు) , శని , తపతి (కూతురు) జన్మిచారు . శని గర్భము లో ఉండగా చాయ ఈశ్వరునికి ఘోర తపస్సు చేసెను . ఉపవాసదీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని , తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని , శని చూపే వినాశకరం గా మారినదని పండితులు అంటారు.

సూర్య తేజస్సు లేని ఈబిడ్డ తనబిడ్డ కాదని చాయని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు . అది విన్న శని తండ్రి అయిన సూర్యున్నే నల్లగా మారిపోవాలని , సూర్యగమనం ఆగిపోవాలని , సూర్య రధం నల్ల రంగు గా అయిపోవాలని శపిస్తాడు . అప్పుడు తన తప్పును తెలుసు కున్న సూర్యుడు ఈశ్వరుని వేడగా ... జరిగిన విషయమంతా సూర్యునకు తెలిజేయగా ఈశ్వరుని కోరిక మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకొని సూర్యున్ని శాపవిముక్తి గావించెను . అంతా సుఖము గా ఉన్నా ... శని సూర్యుని పై పగబూని ఈశ్వరుని తపస్సు జేసి ఎన్నో వరాలు పొందెను.

శని జన్మ నక్షత్రము : శని విభావనామసంవత్సరము , మాఘమాసము ,కృష్ణపక్షము ,చతుర్దశి నాడు , ధనిష్టా నక్షము న జన్మించాడని కొందరంటే .. మార్గశిర మాసము -బహుళ నవమి ,రోహిణీ నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని కొందరు అంటారు . . శనీశ్వరుడు కుడి చేతిలో దండము , ఎడమ చేతిలో కమండలము , sword (ఖడ్గము) arrows and two daggers దరించి ఉంటాడు .
శని పెళ్ళి : లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి(ఈమెనే దరిద్రదేవత అంటారు) శనైశ్చరుడి భార్య. అంటే శనిభగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అన్నమాట., యమధర్మరాజు కి సోదరుడు , గ్రహాలకు యువరాజు .

హరిశ్చంద్రుడు , నలుడు , పురుకుత్సుడు , పురూరవుడు , సగరుడు , కార్తవీర్యార్జునుడు , శని మహిమ వల్ల అనేక కస్టాలు పొంది చివరకి శని కృప వల్లే సర్వ సుఖాలు పొందారు.

శనిదూషణ సర్వదేవతలనూ తిట్టినదాంతో సమానం అని పెద్దలు చెబుతారు. ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనైశ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమత్‌దీక్షలో ఉన్నవారినీ అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులనూ ఆయన బాధించడని నమ్మిక.

శనీశ్వరుడు మరియు హనుమంతుడు:

హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైనా హనుమంతుని ప్రార్ధించినచో, ముఖ్యముగా శనివారాలలో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.

శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు భారీ కాయునిగా అవతరించగా, శని హనుమంతుడు భుజాలు మరియు వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడు. ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుడుని తనను విడిచిపెట్టమని వేడుకుంటూ, ఎవరైనా హనుమంతుడిని ప్రార్థించినచో ఆ వ్యక్తిపై తన(శని) యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్ములింపబడునట్లుగా చేసెదెనని శనిభగవానుడు మాట యిచ్చాడు. ఆ తరువాత హనుమంతుడు శనిని విడిచిపెట్టెను.

శనీశ్వరుడు - శివుడు :

పూర్వము కృతయుగములో కైలాసము లోని పరమశివుని దర్శించవచ్చిన నారదుడు ... ప్రమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాల చెప్పాడు . నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు . ఆ కారణము గా .. ' శని అంతటి శక్తిమంతుదైతే తన ప్రభావాన్ని తనపై (శివునిపై) చూపి , తనను పీడించి శని శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోమను ' అని శివుడు అనగా నారదుడు ఆవిషయము శని తో చెప్పెను.

పరమశివుని మాటలకు శనికి అవేశము , పట్టుదల ప్రేరేపించాయి . తను శివుని ఒక క్షణము పట్టి పీడిస్తానని ... ఆ విషయము తెలియజేయమని నారదునిచే వార్త పంపెను . ఈ విధముగా నారదుడు శివ , శని ల మద్య తగాదా సృష్టించాడు .
నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శనిప్రభావాన పడకుండా జాగ్రత్తపడమని చెప్పి వెళ్ళిపోయెను . 

" శని తనను ఎలా పీడించగలడో చూస్తాను ' అనుకుంటూ కైలాసము నుంచి మాయమై దండకారణ్యము దారిపట్టాడు శివుడు . ఎవరి ద్రుష్టికీ ఊహకు రాని చోటుకోసం ఆలోచించి అడవిలోని ఒక పెద్ద రావి చెట్టు తొర్ర లో దాగున్నాడు. (ఆ అడవి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి  అనే గ్రామం నందు  కల ఒక పెద్ద రావిచెట్టు తొర్ర అని, అందులో ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి.) మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు.

 అప్పుడు " ఏ మయింది నీ శపథం " అని ప్రశ్నించాడు ఈశ్వరుడు . ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ " పరమశివుడంతటివాడు దేవతలకు , ఋషులకు , మరి ఎందరికో ఆరాధ్యదైవం ,  చల్లని ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడివలె చెట్టు తొర్రలో దాగుకోవడమంటే ... ఆ క్షణము శని పట్టినట్లు కాదా ! "అని అడిగాడు..శని నెమ్మదిగా వినయం గా.. 

శని సమయస్పూర్తికి , వినయానికి ఆయన ప్రభావానికి , పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు . . తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనేశబ్దము సార్ధకం కాగలదని మానవులు శని ని శనీశ్వరా అని పూజిస్తే .. శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరము ఇచ్చెను . అలా శనిగ్రహం శనీశ్వరడు అయ్యాడు .

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది :

సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడు.. నేనే  శని ప్రభావమునకు లోనయ్యాను.. మరి సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించిన ఈశ్వరుడు , శనితో  " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. 

ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .

శనీశ్వరుడు మరియు రోమపాద మహారాజు..

తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా భాద్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను". ఋష్యశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివశిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని చెప్పెను. శని భగవానుని దీవెనలు అందుకున్న తరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తెగా చెప్పబడే 'శాంత'ను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు.

శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.
1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు [నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం] అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.{జపంచేయటానికి కూడా సమయము వెచ్చించలేనివారి కోసము మేమేమీ చేయలేము}
6. ఆరోజు [కుంటివాళ్ళు,వికలాంగులకు] ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం.
7. ఎవరి వద్దనుండి అయినాఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి. 

ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :-

1 మయూరి నీలం ధరించుట
2 శని జపం ప్రతి రోజు జపించుట.
3 శని కి తిలభిషేకం చేయించుట.
4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి శనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రాహ్మణునుకి దానం చేయుట.
5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట.
6 ప్రతి రోజు నువ్వుండలుకాకులకు పెట్టుట.
7 శని వారం రోజు రొట్టి పై నువ్వుల నూనే వేసి కుక్కలకు పెట్టుట.
8 హనుమంతుని పూజ చేయుట..
9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువుట..
10 కాలవలో కానీ, నది లో కానీ..బొగ్గులు, నల్ల నువ్వులు,మేకు కలపటం వలన..
11 శని ఏకాదశ నామాలు చదువుట వలన.. ( శనేశ్వర ,కోణ, పింగళ , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర )  అని ప్రతి రోజు చదవటం వలన..
12 బియ్యపు  రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టుట వలన..
13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన..
14 ప్రతి శని వారం రావి చెట్టుకు ప్రదషణం మరియు నల్ల నువ్వులు,మినుములు కలిపిన నీటిని రావి చెట్టు కు పోయటం వలన..
15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన..
16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన..
17  బ్రాహ్మణునికి నల్ల వంకాయలు, నల్ల నువ్వులు, మేకు , నల్లని దుప్పటి దానం చేయుట వలన..
18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహాలయం ముందు బిచ్చ గాళ్ళకు ఆహరం పెట్టుట వలన, నల్లని దుప్పటి దానం చేయటం వలన..
19 అయ్యప్ప మాల ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన, శ్రీ వెంకటేశ్వర స్వామి మాల ధరించుట వలన, 20  శని వారములు వెంకటేశ్వర స్వామి దర్శనం,  శివాలయం లో శివుని దర్శనం ,హనుమంతుని దర్శనం, కాల భైరవ స్వామి దర్శనం, మరియు పూజ వలన శని గ్రహ దోషం పోవును.

న్యాయాధికారి..

మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గ నరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. 

శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మందపల్లి మందుడు..

తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. పూర్వం అశ్వత్ధ´, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో వెురపెట్టుకున్నారట. వారి వెురను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. అప్పట్నుంచి ఆ ఆలయం శనైశ్చర క్షేత్రంగా పేరుపొందింది. 

శత్రుబాధ, రుణబాధ, రోగపీడతోనూ... ఏలినాటిశని, అర్ధాష్టమశనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఏటా శ్రావణమాసంలోనూ శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.

ఇంకా... మహారాష్ట్రలోని శనిసింగణాపూర్‌ ప్రపంచ ప్రసిద్ధ శనైశ్చరాలయం. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని (23 అడుగులు) ఆవిష్కరించారు.

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...