Sunday, February 16, 2020

శివారాధన శివ శబ్దానికి ఎన్నో అర్థాలు. కలగబోయే శ్రేయస్సు, అరిష్టనాశం, సుఖాన్ని కలిగించేది, శుభాలను అందించేది, ధన్యతను ప్రసాదించేది, కోరికలను తీర్చేది, పుట్టుకకు కారణమైంది, కుత్సితాలను పోగొట్టేది, అశుభాలను తరిమికొట్టేది, మంచితనంతో కూడి ఉండేది... ఇలా ఎన్నో ఈ పేరులో ఇమిడి ఉన్నాయి. ఇన్ని శివగుణాలు కలవాడు శివుడు. ఆయనను ఆరాధిస్తే ఆరాధకుడికి ఆ గుణాలే అలవడతాయి.

శివారాధన 

శివ శబ్దానికి ఎన్నో అర్థాలు. కలగబోయే శ్రేయస్సు, అరిష్టనాశం, సుఖాన్ని కలిగించేది, శుభాలను అందించేది, ధన్యతను ప్రసాదించేది, కోరికలను తీర్చేది, పుట్టుకకు కారణమైంది, కుత్సితాలను పోగొట్టేది, అశుభాలను తరిమికొట్టేది, మంచితనంతో కూడి ఉండేది... ఇలా ఎన్నో ఈ పేరులో ఇమిడి ఉన్నాయి. ఇన్ని శివగుణాలు కలవాడు శివుడు. ఆయనను ఆరాధిస్తే ఆరాధకుడికి ఆ గుణాలే అలవడతాయి.

రుద్రుడు అంటే రోదనాన్ని పోగొట్టేవాడు. రోదనం అంటే దుఃఖమే. దుఃఖం మనిషికి పుట్టుకతోనే వస్తుంది. అది పుడమి గర్భంలో మనిషి కలిసిపోయేదాకా ఉంటుంది. దుఃఖం లేని మనిషి, అలలులేని సాగరం ఉండనే ఉండవు. సముద్రజలాలను అలలు ఎలా కల్లోలం చేస్తుంటాయో జీవన సాగరంలోనూ దుఃఖాల కెరటాలు మనిషిని పడదోస్తుంటాయి. దుఃఖించే మనిషికి ఓదార్పు కావాలి. చేయూత కావాలి.

ఇలాంటి మానవ స్వభావ నేపథ్యంలో మనిషికిగల ఏకైకగమ్యం శివారాధన. శివుడు ఇలాంటి ఒడుదొడుకులేవీ లేనివాడు. నిశ్చలుడు. అందుకే అతడికి స్థాణువు అనే పేరుంది. స్థాణువు అంటే రాయి కాదు. మానసిక స్థైర్యం. అది పరమేశ్వరుడి సహజగుణం. ఎంతటి ప్రళయంలోనైనా చెక్కుచెదరని స్థిరత్వం. ప్రపంచాన్నే భస్మంచేయగల హాలాహల విషాన్నీ కంఠంలో దిగమింగే ధీరత్వం. అది మనిషికి కావాలి. ఎలాంటి దుర్భర పరిస్థితిలోనైనా నిలబడే ఆత్మశక్తి రావాలి. జీవితమంతా విజయసోపానం కావాలి. అందుకు శివారాధనే శరణ్యం.

మనిషిని అధఃపాతాళానికి పడదోసేది కామం. కామం అంటే వస్తువుమీద కోరిక కావచ్చు. మనిషిమీద కోరిక కావచ్చు. దీనికి ఒక హద్దు ఉంది. దీనికి ఒక నియమం ఉంది. దీనికి ఒక పద్ధతి ఉంది. అది లేకుండా మనిషి విచ్చలవిడిగా చెలరేగితే సమాజం అంగీకరించదు. శివుడికి ఏ కోరికలూ లేవు. వాటికోసం పరుగులు తీయాలనే తలపు లేదు. ఆయన కోరిక అంతా విశ్వశ్రేయస్సే. అందరూ బాగుండాలనే అభిమతమే! శివుడి స్థిరత్వాన్ని భంగం చేయడానికి మన్మథుడు ప్రయత్నించాడు. నిశ్చలచిత్తుడైన పరమేశ్వరుడిపైనే పూలబాణాలు కురిపించబోయాడు. శివుడి మనసును కోరికలతో మలినం చేయాలని భావించాడు. సంయమి అయిన శివుడి ముందు అతడి ఆటలు సాగలేదు. తన నిశ్చలత్వాన్ని నాశనం చేయజూసిన మన్మథుడిపై మూడోకన్ను తెరచి, భస్మం చేశాడు. అతణ్ని అనంగుడిగా (శరీరం లేనివాడిగా) మార్చివేశాడు. మనిషి కూడా శివుడిలా ఉండాలి. ప్రపంచంలో తన చుట్టూ ఎన్నో ప్రలోభాలు ఉసిగొల్పుతున్నా సంయమనాన్ని కోల్పోరాదు. ఎందరు ఎన్ని ఆశలు పెట్టినా మోసపోరాదు. అన్నింటిలోనూ యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండాలి. ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే చేయాలి. తాత్కాలిక లాభాలకోసం బంగారు భవిష్యత్తును పణంగా పెట్టరాదు. శివుడిలా వీరుడిలా, ధీరుడిలా నిలవాలి. ఇదే శివారాధనలోని ఆంతర్యం.

భార్యను అర్ధాంగిగా మార్చిన ఘనత శివుడిదే. వివాహం చేసుకున్న తరవాత పార్వతికి తనలో సగభాగం కల్పించిన ఉత్తమగుణం శివుడిదే. అందుకే పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులయ్యారు. అన్యోన్య ప్రేమానురాగాలకు దృష్టాంతాలుగా మారిపోయారు. మనిషి ఇలాంటి ఉన్నతస్థితిని చేరుకోవాలి.

ఈ ప్రపంచంలో అంతా శివభావనామయం. పంచభూతాల్లో శివుడున్నాడు. సూర్యచంద్ర నక్షత్రరాశుల్లో శివుడున్నాడు. శివుడు లేనిదెక్కడ? అణువణువూ శివుడే. అడుగడుగునా శివుడే. సకల బ్రహ్మాండ భాండమే శివమయం అని రుద్రాధ్యాయం చెబుతోంది. మనిషి ఎల్లవేళలా శివభావనలో లీనం కావాలి. తన జీవితాన్ని శివానందపూరితంగా మార్చుకోవాలి!

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...