Wednesday, February 26, 2020

శ్రీమద్భగవద్గీతపదునైదవ అధ్యాయముపురుషోత్తమప్రాప్తియోగముశ్రీ భగవానువాచఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||

శ్రీమద్భగవద్గీత

పదునైదవ అధ్యాయము

పురుషోత్తమప్రాప్తియోగము

శ్రీ భగవానువాచ

ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||            1

శ్రీ భగవానుడు: వేదాలు ఆకులుగా వేళ్ళు పైకి, కొమ్మలు క్రిందకి వుండే సంసారమనే అశ్వత్థవృక్షం (రావి చెట్టు) నాశం లేనిదని చెబుతారు. ఇది తెలుసుకున్నవాడే వేదార్థం ఎరిగినవాడు.

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః
గుణప్రవృద్ధా విషయప్రవాళాః |
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే ||                    2

ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయసుఖాలే చిగుళ్ళుగా క్రిందకీ మీదకీ విస్తరిస్తాయి. మానవలోకంలో ధర్మాధర్మ కర్మబంధాలవల్ల దానివేళ్ళు దట్టంగా క్రిందకి కూడా వ్యాపిస్తాయి.

న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ||                        3

తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్‌గతా న నివర్తంతి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ||                    4

ఈ సంసారవృక్షం స్వరూపంకాని, ఆదిమధ్యాంతాలుకాని ఈ లోకంలో ఎవరికీ తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్ళతో విలసిల్లుతున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించివేశాక, పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెదకాలి. ఆనాదిగా ఈ సంసారవృక్షం విస్తరించడానికి కారకుడైన ఆదిపురుషుణ్ణి – పరమాత్మను శరణుపొందాలి.

నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ||                5

అభిమానం, అవివేకం లేకుండా, అనురాగదోషాన్ని జయించి, ఆత్మజ్ఞానతత్పరులై, కోరికలన్నిటినీ విడిచిపెట్టి, సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు.

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః |
యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమం మమ ||            6

దాన్ని సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రకాశింపచేయ లేరు. దేనిని పొందితే మళ్ళీ సంసారానికి రానక్కరలేదో అలాంటి పరంధామం నాది.

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః |
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||            7

నాలోని శాశ్వతమైన ఒక అంశమే మానవలోకంలో జీవాత్మగా పరిణమించి ప్రకృతిలోని జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆకర్షిస్తుంది.

శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ ||            8

వాయువు పువ్వులనుంచి వాసనలను తీసుకుపోయేటట్లుగా జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడూ, విడిచిపెట్టేటప్పుడూ ఇంద్రియాలనూ, మనస్సునూ వెంటబెట్టుకు పోతాడు.

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ||                9

ఈ జీవుడు చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆశ్రయించి శబ్దాది విషయాలను అనుభవిస్తాడు.

ఉత్క్రామంతం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః ||        10

మరో శరీరాన్ని పొందుతున్నప్పుడూ, శరీరంలో వున్నప్పుడూ, విషయాలను అనుభవిస్తున్నప్పుడూ, గుణాలతోకూడి వున్నప్పుడూ కూడా ఈ జీవాత్మను మూఢులు చూడలేరు. జ్ఞానదృష్టి కలిగినవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు.

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ |
యతంతో௨ప్యకృతాత్మనో నైనం పశ్యంత్యచేతసః ||            11

ప్రయత్నం సాగించే యోగులు తమలోని పరమాత్మను దర్శిస్తారు. ఆత్మసంస్కారంలేని అవివేకులు ప్రయత్నించినా ఈ జీవాత్మను తిలకించలేరు.

యదాదిత్యగతం తేజో జగద్భాసయతే௨ఖిలమ్ |
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ||            12

సూర్యుడిలో వుండి జగత్తునంతటినీ ప్రకాశింపచేసే తేజస్సూ, చంద్రుడిలో, అగ్నిలోవుండే తేజస్సూ నాదే అని తెలుసుకో.

గామావిశ్య చ భుతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషదీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ||    13

నేను భూమిలో ప్రవేశించి నా ప్రభావంతో సర్వభూతాలనూ ధరిస్తున్నాను. అమృతమయుడైన చంద్రుడిగా సమస్త సస్యాలనూ పోషిస్తున్నాను.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||        14

“ వైశ్వానరుడు”  అనే జఠరాగ్నిరూపంతో సకలప్రాణుల శరీరాలలోనూ వుండి ప్రాణాపానవాయువులతో కలసి, నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను.

సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ||                    15

సర్వప్రాణుల హృదయాలలో వున్న నా వల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరపు కలుగుతాయి. వేదాలన్నిటివల్ల తెలుసుకోవలసిన వాణ్ణి నేనే. వేదాంతాలకు కర్తనూ, వేదాలను ఎరిగినవాణ్ణీ నేనే.

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ |
క్షరః సర్వాణి భుతాని కూటస్థో௨క్షర ఉచ్యతే ||            16

ఈ లోకంలో క్షరుడనీ, అక్షరుడనీ ఇద్దరు పురుషులున్నారు. నశించే సమస్తప్రాణుల సముదాయాన్ని క్షరుడనీ మార్పులేని జీవుణ్ణి అక్షరుడనీ అంటారు.

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః |
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ||                17

ఈ వుభయులకంటే ఉత్తముడు నాశనంలేని ఈశ్వరుడిగా మూడు లోకాలలోనూ వ్యాపించి, వాటిని పాలిస్తున్న పరమాత్మ.

యస్మాత్ క్షరమతీతో௨హమక్షరాదపి చోత్తమః |
అతో௨స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ||            18

నేను క్షరుడిని మించినవాడినీ, అక్షరుడికంటే ఉత్తముడినీ కావడం వల్ల లోకంలోనూ, వేదాలలోనూ పురుషోత్తముడిగా ప్రసిద్ధి పొందాను.

యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ||                19

అర్జునా! అజ్ఞానం లేకుండా అలా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడై అన్నివిధాల నన్నే ఆరాధిస్తాడు.

ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ |
ఏతద్‌బుద్ధ్వా బుద్ధిమాన్‌స్యాత్ కృతకృత్యశ్చ భారత ||        20

అర్జునా! అతిరహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను. దీన్ని బాగా తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడూ, కృతార్థుడూ అవుతాడు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "పురుషోత్తమప్రాప్తియోగము" అనే పదునైదవ అధ్యాయం సమాప్తం.

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...