Sunday, February 16, 2020

శ్రీమద్భగవద్గీతతొమ్మిదవ అధ్యాయంరాజవిద్యారాజగుహ్యయోగంశ్రీ భగవానువాచ:ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |జ్ఞానం విజ్ఞానసహితం యద్‌జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ ||

శ్రీమద్భగవద్గీత

తొమ్మిదవ అధ్యాయం

రాజవిద్యారాజగుహ్యయోగం

శ్రీ భగవానువాచ:

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం యద్‌జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ || 1

శ్రీ భగవానుడు: అశుభకరమైన సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతిరహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని అసూయలేని నీకు ఉపదేశిస్తున్నాను.

రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ || 2

విద్యలలో ఉత్తమం, పరమరహస్యం, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మజ్ఞానం ప్రత్యక్షానుభవంవల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం సులభసాధ్యం.

అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప |
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని || 3

అర్జునా ! ఈ ధర్మంపట్ల శ్రద్ధలేని పురుషులు నన్ను పొందకుండా మరణరూపమైన సంసారపథంలో పరిభ్రమిస్తారు.

మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్‌స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః || 4

ఇంద్రియాలకు కనుపించని నా రూపం ఈ విశ్వమంతా వ్యాపించి వున్నది. సకలజీవులూ నాలో వున్నాయి; నేను మాత్రం వాటిలో లేను.

న చ మత్‌స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః || 5

ఈశ్వర సంబంధమైన నా యోగశక్తిని చూడు. భూతాలు నాలో లేవు. నా ఆత్మ సమస్త భూతాలనూ సృష్టించి, పోషిస్తున్నప్పటికీ వాటిలో వుండదు.

యథా௨௨కాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని మత్‌స్థానీత్యుపధారయ || 6

సర్వత్రా సంచరించే మహావాయువు ఆకాశంలో నిరంతరం నిలిచి వున్నట్లే సర్వభూతాలూ నాలో వున్నాయని తెలుసుకో.

సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ || 7

కౌంతేయా ! ప్రళయకాలంలో ప్రాణికోటులన్నీ నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. సృష్టికాలంలో వాటిని మళ్ళీ నేను సృజిస్తున్నాను.

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ || 8

ప్రకృతికి అధీనమై, అస్వతంత్రమైన సకల భూతసంఘాన్నీ స్వాధీనంలో వుంచుకున్న నా ప్రకృతితో మళ్ళీ మళ్ళీ సృష్టిస్తుంటాను.

న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు || 9

అయినప్పటికీ అర్జునా ! వాటిపై ఆసక్తిలేని తటస్థుణ్ణి కావడం వల్ల ఈ కర్మలు నన్ను బంధించలేవు.

మయా௨ధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ |
హేతునా௨నేన కౌంతేయ జగద్విపరివర్తతే || 10

కౌంతేయా ! ప్రకృతి నా పర్యవేక్షణలో ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. అందువల్లనే అవిచ్ఛిన్నంగా జగన్నాటకం జరుగుతున్నది.

అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11

సమస్త ప్రాణికోటికీ ప్రభువునైన నా పరమాత్మతత్త్వం తెలియని మూఢులు మానవరూపంలో వున్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు.

మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12

అలాంటి మూఢులు పనికిమాలిన కాంక్షలూ, కర్మలూ, జ్ఞానమూ కలిగి వివేకం కోల్పోయి రాక్షసుల స్వభావాన్ని ఆశ్రయిస్తారు.

మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః |
భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ || 13

పార్థా ! సాత్వికస్వభావం కలిగిన మహాత్ములు సర్వభూతాలకూ ఆదికారణమైనవాడిగా, నాశనంలేనివాడిగా నన్ను తెలుసుకుని ఏకాగ్రచిత్తంతో సేవిస్తారు.

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14

వాళ్ళలో కొంతమంది నిరంతరం నన్ను కీర్తిస్తూ, దృఢవ్రతంతో ప్రయత్నిస్తూ భక్తితో నాకే నమస్కరిస్తూ మనస్సు నామీదే నిలిపి నన్ను ఉపాసిస్తారు.

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ || 15

మరికొంతమంది మహాత్ములు విశ్వరూపంతో వున్న నన్ను జ్ఞానయజ్ఞంతో సేవిస్తారు. అనేక భావాలతో—నేను ఒక్కడినే అనీ, వేరే వ్యక్తిననీ, బహురూపాలు కలిగినవాడిననీ భజిస్తారు.

అహం క్రతురహం యజ్ఞః స్వధా௨హమహమౌషధమ్ |
మంత్రో௨హమహమేవా௨జ్యమహమగ్నిరహం హుతమ్ || 16

క్రతువూ, యజ్ఞమూ, పితృదేవతలకు అర్పించే అన్నమూ, ఔషధమూ, మంత్రమూ, నేయీ, నిప్పూ, హోమమూ నేనే.

పితా௨హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ || 17

ఈ జగత్తుకు తండ్రి, తల్లి, కర్మఫలదాత, తెలుసుకోదగ్గవస్తువు నేనే. ఓంకారం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనే.

గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ |
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ || 18

ఈ జగత్తుకు గతి, పతి, ప్రభువు, సాక్షి, నివాసస్థానం, ఆశ్రయం, ఆప్తుడు, సృష్టికర్త, సంహారకుడు, ఆధారం, ప్రళయం, స్థానం, శాశ్వతబీజం నేనే.

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున || 19

అర్జునా ! నేనే వేడి కలుగజేస్తున్నాను. వర్షాన్ని నిలుపుతున్నాను; కురిపిస్తున్నాను. అమృతమూ, మృత్యువూ నేనే. శాశ్వతమైన సత్తూ, అశాశ్వతమైన అసత్తూ నేనే.

త్రైవిద్యా మాం సోమపాః పూత పాపా
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |
తే పుణ్యమాసాద్యసురేంద్రలోకం
అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ || 20

మూడు వేదాలు చదివినవారు యజ్ఞాలతో నన్ను పూజించి, సోమపానంచేసి, పాపాలు పోగొట్టుకుని స్వర్గం కోరతారు. అలాంటివాళ్ళు పుణ్యఫలమైన దేవేంద్రలోకాన్ని పొంది, దివ్యభోగాలు అనుభవిస్తుంటారు.

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నాః
గతాగతం కామకామా లభంతే || 21

వాళ్ళు విశాలమైన స్వర్గలోకంలో సుఖాలు అనుభవించి, పుణ్యం క్షీణించిపోగానే మానవలోకంలో మళ్ళీ ప్రవేశిస్తారు. ఇలా వేదంలోని కర్మకాండను పాటించే భోగపరాయణులు జననమరణాలు పొందుతుంటారు.

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || 22

ఏకాగ్రచిత్తంతో నిరంతరం నన్నే స్మరిస్తూ సేవించేవాళ్ళ యోగక్షేమాలు నేనే చుస్తాను.

యే௨ప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః |
తే௨పి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ || 23

కౌంతేయా ! ఇతర దేవతలను భక్తి శ్రద్ధలతో భజించేవాళ్ళు కూడా నన్నే పూజిస్తున్నారు. అయితే వాళ్ళ ఆరాధన శాస్త్రసమ్మతం కాదు.

అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్వేనా௨తశ్చ్యవంతి తే || 24

సర్వయజ్ఞాలలో భోక్త, ప్రభువు నేనే. ఇతర దేవతల భక్తులు ఈ వాస్తవాన్ని గ్రహించలేక మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు.

యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినో௨పి మామ్ || 25

దేవతలను సేవించేవాళ్ళు దేవతలనూ, పితృదేవతలను ఆరాధించేవాళ్ళు పితృదేవతలనూ, భూతాలను అర్చించేవాళ్ళు భూతాలనూ పొందుతారు. నన్ను పూజించేవాళ్ళు నన్నే పొందుతారు.

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః || 26

పరిశుద్ధమైన మనస్సు కలిగినవాడు భక్తితో నాకు ఆకుకాని, పువ్వుకాని, పండుకాని, నీరుకాని సమర్పిస్తే సాదరంగా స్వీకరిస్తాను.

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ || 27

కౌంతేయా ! నీవు ఏంచేసినా—భోజనం చేసినా, హోమం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, నాకు ఆ సర్వం సమర్పించు.

శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి || 28

శుభాశుభఫలాలు కలగజేసే కర్మబంధాలనుంచి నీవు అలా విముక్తి పొందుతావు. సన్యాసయోగం అవలంబిస్తే జీవించి వుండగానే ముక్తిపొంది, మరణానంతరం నన్ను చేరుతావు.

సమో௨హం సర్వభూతేషు న మే ద్వేష్యో௨స్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ || 29

సమస్తప్రాణులపట్ల సమభావం కలిగిన నాకు విరోధికాని, ఇష్టుడుకాని లేడు. నన్ను భక్తితో భజించేవాళ్ళు నాలోనూ, నేను వాళ్ళలోనూ వుంటాము.

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః || 30

ఎంతటి పాపి అయినప్పటికీ ఏకాగ్రచిత్తంతో నన్ను సేవించేవాణ్ణి సాధువుగానే భావించాలి. ఎందువల్లనంటే అతని సంకల్పం మంచిది.

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి || 31

అలాంటివాడు అచిరకాలంలోనే ధర్మాత్ముడై, శాశ్వతశాంతి పొందుతాడు. కౌంతేయా ! నా భక్తుడెప్పుడూ చెడిపోడని ఘంటాపథంగా శపథం చేసి మరీ చెప్పు.

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే௨పి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తే௨పి యాంతి పరాం గతిమ్ || 32

పార్థా ! నన్ను ఆశ్రయించినవాళ్ళు ఎవరైనా సరే—పాపజన్ములు కాని, స్త్రీలుకాని, వైశ్యులుకాని, శూద్రులు కాని—పరమశాంతిపదం పొందుతారు.

కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ || 33

ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షులగురించి వేరే చెప్పాలా? సుఖంలేని అశాశ్వతమైన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః || 34

నామీదే మనస్సూ, భక్తీ కలిగి నన్నే పూజించు. నాకే నమస్కరించు. ఇలా నన్ను ఆశ్రయించి, నామీదే మనస్సు నిలిపితే నన్నే పొందుతావు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " రాజవిద్యారాజగుహ్యయోగం" అనే తొమ్మిదవ అధ్యాయం సమాప్తం.

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...