Sunday, February 23, 2020

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం.

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం. ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం, శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ పన్నెండురోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు, వివిధదాన్యాలను పండితులకు దానముగా ఇవ్వడం మంచిది. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది. పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వడం మంచిది. అట్లే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనిని డోలోత్సవం అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో డోలాపూర్ణిమ అని అంటారు. నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గున్యాం ప్రయతోభూత్వా గోవిందస్య పురంప్రజేత్‌ ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించిన భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజున రంగుపొడులను, రంగునీళ్ళను చల్లుకోవాలని చెప్పబడింది. ఈ రోజున ఉదయాన్నే నూనెతో తలంటిస్నానం చేసి 'చూత కుసుమ భక్షణం' తప్పక చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజ ప్రకారం, ఇంటిని శుభ్రం చేసి, ఇంటి ప్రాంగణంలో తెల్లనిగుడ్డను ఆసనంగా తూర్పుముఖంగా కూర్చుని, ఒక ముత్తైదువుచే వందన తిలకం, నీరాజనాన్ని పొంది చందనంతో కూడిన మామిడి పువ్వులను తినాలి. చూతమగ్ర్యం వసంతస్య మాకందకుసుమం తద సచందనం పిచామ్యద్య సర్వకామ్యార్థ సిద్దయే అనే శ్లోకంతో మామిడిపూతను స్వీకరించాలి. అనంతరం రంగులను నృత్యగానాదులతో చల్లుకోవాలని చెప్పబడింది. అట్లే, హరిహరసుతుడు అయిన అయ్యప్పస్వామి వారు జన్మించిన దినం కూడా ఈనాడే కనుక వారిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది. ఫాల్గుణమాసంలో పూర్ణిమరోజున హోళీపండుగను నిర్వహిస్తుంటారు. ఈ పూర్ణిమ శక్తితో కూడినది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తరఫల్గుణి కలిసి వస్తే, ఆ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. హోళిరోజూన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సమస్త శుభములు కలుగుతాయని పెద్దలవాక్కు. కొన్ని దక్షిణాది ఆలయాలలో ఫాల్గుణపూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు. ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో, అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి, తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది. ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను, దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...