భగవద్గీత-తాత్పర్యసహితం:మూడవ అధ్యాయం
కర్మయోగం
అర్జున ఉవాచ:
జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన |
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ || 1
అర్జునుడు: జనార్దనా ! కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా ? అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్ధ కర్మకు నన్నెందుకు పురికొల్పుతున్నావు ?
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో௨హమాప్నుయామ్ || 2
అటూయిటూ కాని మాటలతో నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు.
శ్రీ భగవానువాచ:
లోకే௨స్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా௨నఘ |
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ || 3
శ్రీభగవానుడు: అర్జునా ! గతంలో నేను చెప్పిన రెండు మార్గాలూ లోకంలో వున్నాయి. అవి : సాంఖ్యులకు జ్ఞానయోగం, యోగులకు నిష్కామ కర్మయోగం.
న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషో௨శ్నుతే |
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి || 4
కర్మలు చేయనంతమాత్రాన పురుషుడు కర్మబంధాలకు దూరంగా ఉండలేడు. కేవలం కర్మసన్యాసం వల్ల కూడా ఆత్మజ్ఞానం లభించదు.
న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః || 5
కర్మలు చేయకుండా ఎవడూ ఒక్క క్షణం కూడా వుండలేడు. ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనై ప్రతివాళ్ళూ అస్వతంత్రులై కర్మలు చేస్తూనే వున్నారు.
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే || 6
పైకి అన్ని కర్మేంద్రియాలనూ అణచిపెట్టి మనసులో మాత్రం విషయ సౌఖ్యాల గురించి ఆలోచించే అవివేకిని కపటాచారం కలవాడు అంటారు.
యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే௨ర్జున |
కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే || 7
అర్జునా ! మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామకర్మ చేస్తున్నవాడు ఉత్తముడు.
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః || 8
నీ కర్తవ్యకర్మ నీవు ఆచరించవలసిందే. కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే శ్రేయస్కరం. కర్మలు చేయకుండా నీవు జీవయాత్ర కూడ సాగించలేవు.
యజ్ఞార్థాత్ కర్మణో௨న్యత్ర లోకో௨యం కర్మబంధనః |
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర || 9
కుంతీపుత్రా ! యాగసంబంధమైనవి తప్ప తక్కిన కర్మలన్నీ మానవులకు సంసారబంధం కలుగజేస్తాయి. కనుక ఫలాపేక్ష లేకుండా దైవప్రీతి కోసం కర్మలు ఆచరించు.
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేష వో௨స్త్విష్టకామధుక్ || 10
ప్రాచీనకాలంలో ప్రజలనూ యాగాలనూ సృష్టించి ప్రజాపతి ఇలా అన్నాడు: “యజ్ఞం కోర్కెలను నెరవేర్చే కామధేనువు. దీనివల్ల మీరు పురోభివృద్ధి చెందండి.”
దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః |
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ || 11
యజ్ఞయాగాలతో మీరు దేవతలను సంతృప్తి పరచండి. పాడిపంటలు లాంటి సమృద్ధులిచ్చి వారు మీకు సంతోషం కలగజేస్తారు. పరస్పర సద్భావం పరమ శ్రేయస్సు మీకు చేకూర్చుతుంది.
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః || 12
యజ్ఞాలతో తృప్తిపడ్డ దేవతలు మీ వాంఛితాలు నెరవేరుస్తారు. దేవతలిచ్చిన సుఖభోగాలు అనుభవిస్తూ, వారికి మళ్ళీ ఆ సంపదలో కొంత కూడా అర్పించనివాడు దొంగ.
యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః |
భుఞ్జతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ || 13
యజ్ఞాలు చేసి దేవతలకు అర్పించగా మిగిలిన పదార్థాలు భుజించే సజ్జనులు సర్వపాపాలనుంచీ విముక్తులవుతున్నారు. అలా కాకుండా తమ కోసమే వండుకుంటున్నవాళ్ళు పాపమే తింటున్నారు.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || 14
అన్నంవల్ల ప్రాణులన్నీ పుడుతున్నాయి. వర్షం వల్ల అన్నం లభిస్తున్నది. యజ్ఞం మూలంగా వర్షం కలుగుతున్నది. యజ్ఞం సత్కర్మలవల్ల సంభవిస్తున్నది.
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ |
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ || 15
కర్మ వేదంనుంచి పుట్టింది. పరమాత్మవల్ల వేదం వెలసినది. అంతటా వ్యాపించిన పరమాత్మ అందువల్లనే యజ్ఞంలో ఎప్పుడూ వుంటాడు.
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః |
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి || 16
పార్థా ! ఇలా తిరుగుతున్న జగత్ చక్రాన్ని అనుసరించనివాడు పాపి; ఇంద్రియలోలుడు. అలాంటివాడి జీవితం వ్యర్థం.
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః |
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే || 17
ఆత్మలోనే ఆసక్తి, సంతృప్తి, సంతోషం పొందేవాడికి విద్యుక్తకర్మలేవీ వుండవు.
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన |
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః || 18
అలాంటి ఆత్మజ్ఞానికి ఈ లోకంలో కర్మలు చేయడంవల్ల కాని, మానడం వల్ల కాని ప్రయోజనం లేదు. స్వార్థదృష్టితో సృష్టిలో దేనినీ అతను ఆశ్రయించడు.
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః || 19
అందువల్ల నిరంతరం నిష్కామంగా కర్మలు ఆచరించు. అలా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేవాళ్ళకు మోక్షం కలుగుతుంది.
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవా௨పి సంపశ్యన్ కర్తుమర్హసి || 20
జనకుడు మొదలైనవారు నిష్కామకర్మతోనే మోక్షం పొందారు. లోకక్షేమం కోసమైనా నీవు సత్కర్మలు చేయాలి.
యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః |
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే || 21
ఉత్తముడు చేసిన పనినే ఇతరులు కూడా అనుకరిస్తారు. అతను నెలకొల్పిన ప్రమాణాలనే లోకం అనుసరిస్తుంది.
న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి || 22
పార్థా ! ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమీ లేదు. నాకు లేనిదికాని, కావలసింది కాని ఏమీ లేకపోయినప్పటికీ లోకవ్యవహారాలు నిత్యమూ నిర్వర్తిస్తూనే వున్నాను.
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || 23
అర్జునా ! ఏమాత్రమూ ఏమరుపాటు లేకుండా నేను నిరంతరం కర్మలు చేయకపోతే, ప్రజలంతా అలాగే ప్రవర్తిస్తారు.
ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః || 24
నేను కర్మలు ఆపివేస్తే ప్రజలంతా భ్రష్టులైపోతారు. రకరకాల సంకరాలకూ, ప్రజలనాశానికి నేనే కర్తనవుతాను.
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత |
కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ || 25
అర్జునా ! అజ్ఞానులు ఫలితాలు ఆశించి కర్మలు చేసినట్లే ఆత్మజ్ఞానులు ఫలాపేక్ష లేకుండా లోకకల్యాణం కోసం కర్తవ్యకర్మలు ఆచరించాలి.
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్ |
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ || 26
ఫలం కోరి కర్మలు చేసే పామరుల బుద్ధిని విజ్ఞులు వికలం చేయకూడదు. జ్ఞాని యోగిగా సమస్తకర్మలూ చక్కగా ఆచరిస్తూ ఇతరులు చేతకూడా చేయించాలి.
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః |
అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే || 27
ప్రకృతిగుణాలవల్ల సర్వకర్మలూ సాగుతుండగా, అజ్ఞాని అహంకారంతో, కర్మలను తానే చేస్తున్నానని తలుస్తాడు.
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః |
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే || 28
గుణాలు, కర్మల నిజస్వరూపం తెలిసిన తత్వవేత్త ఇంద్రియరూపాలైన గుణాలు విషయరూపాలైన గుణాలమీదే నిలిచి వున్నాయని గ్రహించి వాటి దరికి చేరడు.
ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు |
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ || 29
ప్రకృతి గుణాలతో ముగ్ధులైన మూఢులు గుణకర్మలలోనే ఆసక్తి చూపుతారు. అయితే అల్పులూ, మందబుద్ధులూ అయినవాళ్ళ మనస్సులను జ్ఞానులు చలింపచేయకూడదు.
మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా |
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః || 30
నీవు చేసే సమస్త కర్మలూ నాకు సమర్పించి, వివేకంతో ఆశామమకారాలు విడిచిపెట్టి నిశ్చింతగా యుద్ధం చెయ్యి.
యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః |
శ్రద్ధావంతో௨నసూయంతో ముచ్యంతే తే௨పి కర్మభిః || 31
అసూయలేకుండా శ్రద్ధాభక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారం ప్రవర్తించే మానవులు కర్మబంధాలనుంచి విముక్తులవుతారు.
యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ |
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః || 32
నేను ఉపదేశించిన ఈ నిష్కామకర్మయోగ విధానాన్ని నిందించి ఆచరించనివాళ్ళు అవివేకులూ, అజ్ఞానులూ, అన్నివిధాల చెడిపోయినవాళ్ళూ అని తెలుసుకో.
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి |
ప్రకృతం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి || 33
పండితుడు కూడా తన సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమ తమ ప్రకృతినే అనుసరిస్తాయి. అలాంటప్పుడు నిగ్రహం ఏం చేస్తుంది?
ఇంద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ || 34
ఇంద్రియాలన్నిటికీ తమతమ విషయాలపట్ల అనురాగం, ద్వేషం వున్నాయి. ఎవరూ వాటికి వశులు కాకూడదు. అవి మానవులకు బద్ధశత్రువులు.
శ్రేయాన్‌స్వధర్మో విగుణః పరధర్మాత్‌స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || 35
ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడంకంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వల్ల స్వధర్మాచరణలో మరణమైనా మంచెదే.
అర్జున ఉవాచ:
అథ కేన ప్రయుక్తో௨యం పాపం చరతి పూరుషః |
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః || 36
అర్జునుడు: కృష్ణా ! తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతంవల్ల పాపాలు చేస్తున్నాడు?
శ్రీ భగవానువాచ:
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః |
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ || 37
శ్రీ భగవానుడు: రజోగుణంవల్ల కలిగిన కామక్రోధాలు అన్ని పాపాలకూ మూలకారణాలు. ఎంత అనుభవించినా తనివితీరని కామమూ, మహాపాతకాలకు దారితీసే క్రోధమూ ఈ లోకంలో మనవుడికి మహాశత్రువులు.
ధూమేనావ్రియతే వహ్నిః యథా௨దర్శో మలేన చ |
యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతమ్ || 38
పొగ అగ్నినీ, మురికి అద్దాన్నీ, మావి గర్భంలోని శిశువునూ కప్పివేసినట్లు కామం ఆత్మజ్ఞానాన్ని ఆవరించింది.
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ || 39
అర్జునా ! ఎంతకీ తృప్తి ఎరుగని అగ్నిలాంటి కామం జ్ఞానులకు నిత్య శత్రువు. ఆత్మజ్ఞానాన్ని అలాంటి కామం కప్పివేసింది.
ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే |
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ || 40
ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఆశ్రయాలని చెబుతారు. ఇది వీటిద్వారా జ్ఞానాన్ని ఆవరించి దేహధారులకు మోహం కలగజేస్తున్నది.
తస్మాత్‌త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ || 41
అర్జునా ! అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పుచేతల్లో వుంచుకుని, జ్ఞానవిజ్ఞానాలను నాశనం చేసే కామమనే పాపిని పారద్రోలు.
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః |
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః || 42
దేహంకంటే ఇంద్రియాలు గొప్పవి. మనస్సు ఇంద్రియాలకంటే శ్రేష్ఠం. బుద్ధి మనస్సు కంటే అధికం. అయితే బుద్ధిని అధిగమించింది ఆత్మ.
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా |
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ || 43
అర్జునా ! ఇలా బుద్ధికంటే ఆత్మ గొప్పదని గుర్తించి, బుద్ధితోనే మనస్సు నిలకడ చేసుకుని, కామరూపంలో వున్న జయించరాని శత్రువును రూపుమాపు.
ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "కర్మయోగం" అనే మూడవ అధ్యాయం సమాప్తం.
No comments:
Post a Comment