క్షీరసాగర మధన సంఘటన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
దేవ దానవులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం అనే విషయం మన అందరికీ తెలుసు.మొదట ఈ కథను క్లుప్తంగా చూద్దాం.
ఈ మథనానికి మంధర పర్వతాన్ని కవ్వంగా,వాసుకి అనే పామును తాడుగా ఉపయోగించారు.పర్వతం మునిగిపోకుండా మహావిష్ణువు తాబేలు అవతారం దాల్చి తనపైన మోశాడు.దేవతలు పాము తోకభాగాన్ని,రాక్షసులు తల భాగాన్ని పట్టుకొని చిలకడం ప్రారంభించారు.ఇలా చిలుకుతుండగా చంద్రుడు,ఐరావతము,లక్ష్మీదేవి,కల్పవృక్షము,కామధేనువు,మద్యము,హాలాహలము అనే భయంకర విషము లభించాయి.హాలాహలమును శివుడు త్రాగగా,లక్ష్మీదేవిని విష్ణువు స్వీకరించాడు.మిగిలినవాటిని దేవతలు,రాక్షసులు పంచుకొన్నారు.చివరికి అమృతం లభించింది.ఇదీ సంగ్రహంగా విషయం.
మన ప్రయత్నానికి ప్రతీక పాము. మనం ఏదైనా లక్ష్యం సాధించాలి అనుకొన్నప్పుడు మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.మన లక్ష్యసాధనకు ఉపయోగపడే పరిస్థితులూ,వెనక్కు లాగే పరిస్థితులూ రెండూ ఉంటాయి. ఈ రెండు పరిస్థితులే దేవతలకు,రాక్షసులకు ప్రతినిధులు.అనుకూల పరిస్థితులకన్నా ప్రతికూల పరిస్థితులే ప్రభావం చూపిస్తాయి.కార్యసాధన జరిగేటప్పుడు ఆ సాధన వలన ఏవైనా తక్షణ పరిణామాలు ఎదురైతే వాటిద్వారా మన ప్రతికూలపరిస్థితులు తగ్గాలి.పాము విషం కక్కినప్పుడు రాక్షసులు మరణించడం లాగా అన్నమాట.దీనినే రాక్షసులు పాము తలభాగాన ఉండడము,దేవతలు తోకభాగాన ఉండడానికి ప్రతీకలు.ఈ రెండు పరిస్థితులను ఉపయోగించుకుంటూనే మనం మన లక్ష్యసాధనకు ప్రయత్నించాలి.వెనక్కులాగే పరిస్థితులనుండి మనం పాఠాలు నేర్చుకుంటూ,అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగాలి.లక్ష్యము సాధించాలంటే దృఢమైన పట్టుదల కావాలి.ఈ పట్టుదలే పర్వతానికి ప్రతీక.మన పట్టుదల జారిపోకుండా ఉండడం కోసం మనము మన యుక్తాయుక్త జ్ఞానము ఉపయోగించాలి.ఈ జ్ఞానమే మన పట్టుదలను వీడిపోకుండా భారం వహించే తాబేలు.మన కార్యక్షేత్రమే(సమాజము)పాలసముద్రము.ఈ కార్యక్షేత్రములో మనం పనిచేస్తున్నప్పుడు చిన్నచిన్న సంతోషాలు అనుకోకుండా కలుగుతాయి.అలానే చిన్నచిన్న కష్టాలూ,పెద్ద అవరోధాలూ ఎదురవవచ్చు.ఈ సంతోషాలే పాలసముద్రము చిలకగా వచ్చిన చంద్రుడు,ఐరావతము,కల్పవృక్షము,లక్ష్మీదేవి వంటివాటికి ప్రతీకలు కాగా మద్యం లాంటివి చిన్న కష్టాలకు,ప్రలోభాలకు,హాలాహలం వంటి విషము పెద్ద అవరోధాలకు ప్రతినిధులు గా చెప్పుకోవచ్చు.
చిన్నచిన్న సంతోషాల దగ్గరే ఆగిపోకుండా,అలానే కష్టనష్టాలకు,అవరోధాలకు వెరవకుండా ప్రయత్నం కొనసాగించినప్పుడే లక్ష్యసాధన అనే అమృతం మనకు లభిస్తుంది.
ఇక ఆధ్యాత్మికం గా తీసుకుంటే దేవతలు,రాక్షసులు మంచి,చెడు గుణాలకు ప్రతీకలు.కవ్వమైన పామును సాధనతోనూ,పర్వతాన్ని బుద్ధితోనూ,తాబేలును వివేకంతోనూ,పాలసముద్రాన్ని మనసుతోనూ పోల్చవచ్చు.చిలకగా మొదట వచ్చిన వస్తువులు సిద్ధులకు,అతీతశక్తులకు ప్రతీకలు.హాలాహల విషం మన సాధనను తప్పించడానికి వచ్చే పెద్ద అవరోధముల లాంటిది.వీటి దగ్గరే ఆగిపోతే శాంతి లేక మోక్షమనే అమృతం లభించదు.
No comments:
Post a Comment