శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు..?ఆంతర్యం ఏంటి..?
ఆంద్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలసింది. ఇక్కడికి స్వామి వారి సేవకై భక్తులు ప్రతిరోజూ తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. కొందరు వారి వారి మొక్కులు తీర్చికోవడానికి తిరుపతికి కాలినడకన వస్తుంటారు. గోవిందా గోవిందా అనే నామంతో పరమ పవిత్రం అయింది తిరుపతి. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంధాలైనా చాలవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం మీకు తెలుసా. ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని ఉందా... ఆలస్యం చేయకుండా చదివేయండి.
శ్రీవారి భక్తులలో అగ్రగణుడు అనంతాళ్వారు. ఆ శ్రీవారికి సేవచేస్తూ తరించిన బక్తుడు శ్రీ అనంతాళ్వార్. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు. పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని, మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు.
ఆమె మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయం అయిపోతాడు.
ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారు కు చెప్తారు. దాంతో కంగారు గా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధనుండి ఉపసమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటినుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని చూడాలి అనికుంటే మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
No comments:
Post a Comment