శ్రీమద్భగవద్గీత
పదకొండవ అధ్యాయం
విశ్వరూపసందర్శనయోగం
అర్జున ఉవాచ:
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన మోహో௨యం విగతో మమ || 1
అర్జునుడు: నామీద దయతలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాలన్నిటినీ ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది.
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ || 2
కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి అఖండమైన నీ మహాత్మ్యం గురించి నీ నుంచి వివరంగా విన్నాను.
ఏవమేతద్యథాత్థ త్వమ్ ఆత్మానం పరమేశ్వర |
ద్రష్టుమిచ్ఛామి తే రూపమ్ ఐశ్వరం పురుషోత్తమ || 3
పరమేశ్వరా! నిన్ను గురించి నీవు చెప్పిందంతా నిజమే. పురుషోత్తమా! ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష.
మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ || 4
ప్రభూ! యోగీశ్వరా! నీ విశ్వరూపాన్ని సందర్శించడం నాకు సాధ్యమని నీవు భావిస్తే నిత్యమైన నీ స్వరూపం నాకు చూపించు.
శ్రీ భగవానువాచ
పశ్య మే పార్థ రూపాణి శతశో௨థ సహస్రశః |
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ || 5
శ్రీభగవానుడు: పార్థా! అనేక రంగులతో, అనేక ఆకారాలతో ఎన్నో విధాలుగా వందలకొద్ది, వేలకొద్ది వున్న నా దివ్యరూపాలను చూడు.
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రానశ్వినౌ మరుతస్తథా |
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత || 6
అర్జునా ! ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వనీదేవతలను, మరుత్తులను చూడు. అలాగే ఇదివరకు ఎప్పుడూ కనీవినీ ఎరుగని వింతలను వీక్షించు.
ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ |
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్దృష్టుమిచ్ఛసి || 7
అర్జునా! నా శరీరంలో ఒకే భాగంలో వున్న చరాచరాత్మకమైన సకల ప్రపంచాన్నీ సందర్శించు. నీవింకా చూడదలచినదంతా ఈ దేహంలోనే అవలోకించు.
న తు మాం శక్యసే ద్రష్టుమ్ అనేనైవ స్వచక్షుషా |
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ || 8
నీ కళ్ళతో నన్ను నీవు చూడలేవు. నీకు దివ్యదృష్టినిస్తున్నాను; దానితో నా విశ్వరూపం చూడు.
సంజయ ఉవాచ
ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః |
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ || 9
సంజయుడు: ధృతరాష్ట్ర మహారాజా! మహాయోగీశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు అలా చెప్పి అర్జునుడికి శ్రేష్ఠమైన తన విశ్వరూపం చూపించాడు.
అనేకవక్తృనయనమ్ అనేకాద్భుతదర్శనమ్ |
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ || 10
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ |
సర్వాశ్చర్యమయం దేవమ్ అనంతం విశ్వతోముఖమ్ || 11
ఆ రూపం అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుతదృశ్యాలతో, దివ్యాభరణాలతో, ఎక్కుపెట్టిన పెక్కుదివ్యాయుధాలతో, దివ్యపుష్పమాలలతో, దివ్యవస్త్రాలతో, దివ్యగంధాలతో, మహాశ్చర్యకరం, దేదీప్యమానం, అనంతం, విశ్వతోముఖమూ అయి విరాజిల్లుతున్నది.
దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా |
యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః || 12
ఏకకాలంలో ఆకాశంలో వేయిమంది సూర్యులు వెలువడితే కలిగే కాంతి ఆ మహాత్ముడి విశ్వరూపతేజస్సుకు సాటికావచ్చు.
తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా |
అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా || 13
అప్పుడు అర్జునుడు దేవదేవుడి దేహంలో ఒకేచోట, ఎన్నోవిధాలుగా విభజించబడివున్న సమస్త ప్రపంచాన్నీ సందర్శించాడు.
తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః |
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత || 14
అనంతరం అర్జునుడు ఆశ్చర్యచకితుడై శరీరం పులకరించగా భగవంతుడికి తలవంచి నమస్కరించి చేతులు జోడించి ఇలా అన్నాడు.
అర్జున ఉవాచ
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ |
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ || 15
అర్జునుడు: దేవా! నీ దేహంలో సమస్త దేవతలనూ, చరాచర జగత్తునూ, కమలాసనంలో వున్న బ్రహ్మనూ, సర్వఋషులనూ దివ్యసర్పాలనూ చూస్తున్నాను.
అనేకబాహూదరవక్తృనేత్రం
పశ్యామి త్వాం సర్వతో௨నంతరూపమ్ |
నాంతం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప || 16
విశ్వేశ్వరా! విశ్వరూపా! ఎన్నో భుజాలు, కడుపులు, ముఖాలు, కళ్ళు కలిగిన నీ అనంతరూపాన్ని అంతటా చూస్తున్నాను. నీ తుదీ, మొదలూ, మధ్యా మాత్రం నాకు కానరావడం లేదు.
కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్ |
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్ || 17
కిరీటం, గద, చక్రం ధరించి దశదిశలా కాంతిపుంజం లాగ వెలుగొందుతూ, చూడడానికి సాధ్యపడకుండా సూర్యాగ్ని కాంతికి సమానంగా ప్రజ్వలిస్తున్న అంతూ దరీ లేని నిన్ను అంతటా చూస్తున్నాను.
త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే || 18
నీవు తెలుసుకోదగ్గ పరబ్రహ్మవనీ, సమస్త జగత్తుకీ ముఖ్యాధారమైన వాడవనీ, నాశనం లేనివాడవనీ, సనాతన ధర్మసంరక్షకుడవనీ, పురాణపురుషుడవనీ నేను భావిస్తున్నాను.
అనాదిమధ్యాంతమనంతవీర్యం
అనంతబాహుం శశిసూర్యనేత్రమ్ |
పశ్యామి త్వాం దీప్తిహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్ || 19
ఆదిమధ్యాంతాలు లేనివాడవు, అపరిమితమైన సామర్థ్యం కలవాడవు, ఎన్నో చేతులు కలిగినవాడవు, చంద్రసూర్యులు కన్నులుగా కలవాడవు, ప్రజ్వలిస్తున్న అగ్నిలాంటి ముఖం కలవాడవు, నీ తేజస్సుతో ఈ జగత్తునంతటినీ తపింపచేస్తున్నవాడవు అయిన నీవు నాకు సాక్షాత్కరిస్తున్నావు.
ద్యావాపృథివ్యోరిదమంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః |
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ || 20
మహాత్మా! భూమికీ ఆకాశానికీ మధ్యవున్న ఈ ప్రదేశమూ, దశదిశలూ నీతో నిండివున్నాయి. అద్భుతం, అతిభయంకరం అయిన నీ ఈ విశ్వరూపం చూసి మూడులోకాలూ గడగడ వణకుతున్నాయి.
అమీ హి త్వాం సురసంఘా విశంతి
కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణంతి |
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః
స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః || 21
ఈ దేవతాసమూహాలు నీలో ప్రవేశిస్తున్నాయి. కొంతమంది భీతితో చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షులు, సిద్ధుల సమూహాలు మంగళవాక్యాలు పలికి సంపూర్ణ స్తోత్రాలతో నిన్ను పొగడుతున్నారు.
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః
విశ్వే௨శ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ |
గంధర్వయక్షాసురసిద్ధసంఘా
వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే || 22
రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వయక్షసిద్ధ అసురసంఘాలు–వీళ్ళంతా నిన్ను విస్మయంతో వీక్షిస్తున్నారు.
రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్ |
బహూదరం బహుదంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ || 23
మహాబాహో ! ఎన్నో ముఖాలు, కళ్ళు, చేతులు, తొడలు, పాదాలు, కడుపులు, కోరలతో భయంకరంగా వున్న నీ రూపం చూసి లోకులంతా ఎంతో భయపడుతున్నారు; అలాగే నేనూ భయపడుతున్నాను.
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాప్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా
ధృతిం న విందామి శమం చ విష్ణో || 24
ఆకాశాన్ని అంటుతూ, అనేకరంగులతో ప్రకాశిస్తూ, నోళ్ళు విప్పి, ఉజ్జ్వల విశాల నేత్రాలతో వున్న నిన్ను చూసి ఎంతో భయపడిపోయిన నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను.
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని |
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస || 25
కోరలతో భయంకరంగా ప్రళయకాలంలోని అగ్నిలాగ కానవస్తున్న నీ ముఖాలు నాకు దిక్కుతోచకుండా చేశాయి. దేవేశా! జగన్నివాసా! దిగులు పడివున్న నన్ను అనుగ్రహించు.
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసంఘైః |
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః || 26
వక్త్రాణి తే త్వరమాణా విశంతి
దంష్ట్రాకరాలాని భయానకాని |
కేచిద్విలగ్నా దశనాంతరేషు
సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః || 27
ఎంతోమంది రాజులతోపాటు ఈ ధృతరాష్ట్రుడి పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అలాగే మనపక్షానికి చెందిన ప్రముఖయోధులూ వాడికోరలతో భయంకరాలైన నీ నోళ్ళలోకి వడివడిగా ప్రవేశిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది నీ పళ్ళసందులో ఇరుక్కుపోయి పొడి అయిపోతున్న తలలతో కనిపిస్తున్నారు.
యథా నదీనాం బహవో௨0బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవంతి |
తథా తవామీ నరలోకవీరాః
విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి || 28
అనేక నదీ ప్రవాహాలు సముద్రంవైపు వేగంగా పరుగెత్తుతున్నట్లే ఈ పరలోక వీరులంతా ప్రజ్వలిస్తున్న నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు.
యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః
విశంతి నాశాయ సమృద్ధవేగాః |
తథైవ నాశాయ విశంతి లోకాః
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః || 29
చావుకోసం మిడతలు మిక్కిలి వేగంగా మండుతున్న అగ్నిలో ప్రవేశించినట్లే నశించడం కోసం మహావేగంగా నీ నోళ్ళలో ఈ ప్రజలంతా ప్రవేశిస్తున్నారు.
లేలిహ్యసే గ్రసమానః సమంతాత్
లోకాన్ సమగ్రాన్‌వదనైర్జ్వలద్భిః |
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో || 30
విష్ణుమూర్తీ! మండుతున్న నీ నోళ్ళతో ఈ సర్వలోకాలనూ మింగుతూ రుచి చూస్తున్నావు. జగత్తునంతటినీ నీ తేజస్సుతో నింపి, తీవ్రమైన కాంతితో దాన్ని తపింపచేస్తున్నావు.
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమో௨స్తు తే దేవవర ప్రసీద |
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ || 31
దేవదేవా! ఉగ్రరూపంలోవున్న నీవెవరవో చెప్పు. నీకు నమస్కారం. నన్ను అనుగ్రహించు. ఆదిపురుషుడవైన నిన్ను గురించి తెలుసుకోదలచాను. నీ ప్రవృత్తి నాకు అర్థం కావడం లేదు.
శ్రీ భగవానువాచ
కాలో௨స్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః |
ఋతే௨పి త్వాం న భవిష్యంతి సర్వే
యే௨వస్థితాః ప్రత్యనీకేషు యోధాః || 32
శ్రీ భగవానుడు: లోకసంహారానికి విజృంభించిన కాలస్వరూపుణ్ణి నేను. ప్రస్తుతం ఈ ప్రపంచంలో ప్రజలను సంహరించడమే నా సంకల్పం. నీవు యుద్ధం చేయకపోయినా శత్రుసైన్యంలోని వీరులంతా వినాశం పొందడం ఖాయం.
తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ |
మయైవేతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ || 33
సవ్యసాచీ! అందువల్ల నీవు యుద్ధానికి సిద్ధమై పేరు ప్రఖ్యాతులు పొందు. శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు. వీళ్ళందరినీ ముందే నేను చంపేశాను. నీవు నిమిత్తమాత్రంగా నిలబడు.
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ |
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ || 34
ఇదివరకే నేను సంహరించిన ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు వంటి వీరులందరినీ నీవు వధించు. భయపడకు. యుద్ధం చెయ్యి. శత్రువులను జయిస్తావు.
సంజయ ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమానః కిరీటీ |
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య || 35
సంజయుడు : శ్రీకృష్ణుడి మాటలు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి, బాగా భయపడిపోయి మళ్ళీ నమస్కారంచేసి గధ్గద స్వరంతో ఇలా అన్నాడు.
అర్జున ఉవాచ
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
సర్వే నమస్యన్తి చ సిద్ధసంఘాః || 36
అర్జునుడు: హృషీకేశా! నీ మహిమను పొగడుతూ జగత్తంతా ఆనందం, అనురాగం పొందుతున్నది. రాక్షసులు భయపడి అన్ని వైపులా పారిపోతున్నారు. సిద్ధులసంఘాలన్నీ నీకు నమస్కరిస్తున్నాయి. నీ విషయంలో ఇదంతా సమంజసమే.
కస్మాచ్చ తే న నమేరన్‌మహాత్మన్
గరీయసే బ్రహ్మణో௨ప్యాదికర్త్రే |
అనంత దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్ || 37
మహాత్మా! నీవు అంతంలేని వాడవు; దేవతలకు దేవుడవు; జగత్తుకంతటికీ ఆధారుడవు; శాశ్వతుడవు; సత్తు అసత్తుల స్వరూపుడవే కాకుండా వాటికి అతీతమైన అక్షరుడవు. అందరికంటే గొప్పవాడవు, బ్రహ్మదేవుడికి కూడా ఆదికారణుడవు అయిన నీకు వాళ్ళెందుకు నమస్కరించరు?
త్వమాదిదేవః పురుషః పురాణః
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనంతరూప || 38
నీవు ఆదిశేషుడవు; పురాణపురుషుడవు; ఈ సమస్తజగత్తుకే ఆధారుడవు; సర్వమూ తెలిసినవాడవు; తెలుసుకోదగ్గవాడవు, అనంతరూపా! ఈ విశ్వమంతా పరంధాముడవైన నీతో నిండివున్నది.
వాయుర్యమో௨గ్నిర్వరుణ శ్శశాంకః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |
నమో నమస్తే௨స్తు సహస్రకృత్వః
పునశ్చ భూయో௨పి నమో నమస్తే || 39
వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు, అతని తండ్రి నీవే. నీకు అనేక వేల నమస్కారాలు. మళ్ళీ మళ్ళీ నమస్కారాలు.
నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమో௨స్తు తే సర్వత ఏవ సర్వ |
అనంతవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతో௨సి సర్వః || 40
నీకు ముందు, వెనుక అన్ని వైపులా నా నమస్కారాలు. సర్వస్వరూపా! అపరిమిత సామర్థ్యమూ, అమితపరాక్రమమూ కలిగిన నీవు సర్వత్రా వ్యాపించివున్నావు. అందువల్ల సర్వమూ నీవే.
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ! హే యాదవ! హే సఖేతి|
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి || 41
యచ్చాపహాసార్థమసత్కృతో௨సి
విహారశయ్యాసనభోజనేషు |
ఏకో௨థ వాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ || 42
అచ్యుతా ! నీ మహిమ తెలుసుకోలేక స్నేహితుడవనే వుద్దేశంతో పొరపాటునో, చనువువల్లనో కృష్ణా! యాదవా ! సఖా ! అని నిన్ను నిర్లక్ష్యంగా పిలిచినందుకూ, కలిసిమెలసి తిరిగేటప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు ఒంటరిగా వున్నప్పుడు, ఇతరులతో వున్నప్పుడు వేళాకోళంగా నిన్ను అవమానించినందుకు అప్రమేయుడవైన నీవు నా తప్పులన్నిటినీ మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
పితా௨సి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ |
న త్వత్సమో௨స్త్యభ్యధికః కుతో௨న్యో
లోకత్రయే௨ప్యప్రతిమప్రభావ || 43
సాటిలేని ప్రభావం కలిగినవాడా ! ఈ చరాచర ప్రపంచమంతటికీ నీవు తండ్రివి; పూజ్యుడవు; గురుడవు; గురువులకు గురుడవు. మూడు లోకాలలో నీతో సమానమైనవాడే లేనప్పుడు నిన్ను మించినవాడెలా వుంటాడు?
తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ |
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ || 44
అందువల్ల ప్రభుడవు, పూజ్యుడవు అయిన నీకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. దేవా! తండ్రి కొడుకునీ, స్నేహితుడు స్నేహితుణ్ణీ, ప్రియుడు ప్రియురాలినీ క్షమించినట్లు నీవు నన్ను మన్నించాలి.
అదృష్టపూర్వం హృషితో௨స్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే |
తదేవ మే దర్శయ దేవరూపం
ప్రసీద దేవేశ జగన్నివాస || 45
దేవా ! ఎప్పుడూ చూడని ఈ విశ్వరూపాన్ని చూసి ఆనందించాను. అయితే నా మనసు భయంతో ఎంతో బాధపడుతున్నది. దేవదేవా! జగన్నివాసా! దయవుంచి నీ పూర్వరూపాన్నే చూపించు, అనుగ్రహించు.
కిరీటినం గదినం చక్రహస్తమ్
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ |
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో! భవ విశ్వమూర్తే! || 46
మునుపటిలాగే కిరీటం, గద, చక్రం ధరించిన నిన్ను చూడదలచాను. వేయిచేతులు కలిగిన విశ్వమూర్తీ ! నాలుగు భుజాలతో పూర్వరూపంలోనే నాకు సాక్షాత్కరించు.
శ్రీ భగవానువాచ
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్ |
తేజోమయం విశ్వమనంతమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ || 47
శ్రీ భగవానుడు : అర్జునా ! నీ మీద దయతలచి నా యోగమహిమతో తేజోమయమూ, సర్వోత్తమమూ, సనాతనమూ, అనంతమూ అయిన నా విశ్వరూపం నీకు చూపించాను. నీవు తప్ప ఎవడూ ఎప్పుడూ ఈ రూపాన్ని చూడలేదు.
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః |
ఏవంరూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర || 48
కురువీరా! నీవు తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరూ కూడా వేదాలు చదవడం వల్లకాని, యజ్ఞాలు, దానాలు, కర్మలు, ఘోరతపస్సులు చేయడం వల్ల కాని ఈ విశ్వరూపాన్ని సందర్శించడం సాధ్యపడదు.
మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ |
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య || 49
ఘోరమైన నా యీ విశ్వరూపం చూసి భయపడకు; భ్రాంతి చెందకు. నీవు నిర్భయంగా, సంతోషంగా నా పూర్వరూపాన్ని మళ్ళీ చూడు.
సంజయ ఉవాచ
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః |
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా || 50
సంజయుడు: అలా అర్జునుడితో చెప్పి శ్రీ కృష్ణుడు మళ్ళీ తన పూర్వరూపం చూపించాడు. ఆ మహాత్ముడు తన శాంతమైన శరీరం ధరించి భయభీతుడైన అర్జునుణ్ణి ఓదార్చాడు.
అర్జున ఉవాచ
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన |
ఇదానీమస్మి సంవృత్తస్సచేతాః ప్రకృతిం గతః || 51
అర్జునుడు: జనార్దనా! ప్రశాంతమైన నీ మానవరూపం చూశాక నా మనసు కుదుటపడింది; నాకు స్వస్థత ఏర్పడింది.
శ్రీ భగవానువాచ
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మయ |
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః || 52
శ్రీ భగవానుడు : నీవు వీక్షించిన నా విశ్వరూపాన్ని ఇతరులు చూడటం అతి దుర్లభం. దేవతలు కూడా ఈ రూపాన్ని దర్శించాలని నిత్యమూ కోరుతుంటారు.
నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా || 53
నీకు ప్రాప్తించిన ఈ విశ్వరూపసందర్శనం వేదాలవల్లకాని, తపస్సులవల్ల కాని, దానాలవల్లకాని, యజ్ఞాలవల్ల కాని లభించదు.
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధో௨ర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప || 54
పరంతపా! విశ్వరూపుడనైన నన్ను నిజంగా తెలుసుకోవడానికి, చూడాడానికి, చేరడానికి సాటిలేని భక్తితోనే సాధ్యపడుతుంది.
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తస్సంగవర్జితః |
నిర్వైరస్సర్వభూతేషు యస్స మామేతి పాండవ || 55
అర్జునా! నా కోసమే కర్మలు చేస్తూ, నన్నే పరమగతిగా భావించి, నా మీదే భక్తికలిగి, దేనిమీదా ఆసక్తి లేకుండా సమస్త ప్రాణులపట్ల శత్రుభావంలేనివాడు నన్ను పొందుతాడు.
ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "విశ్వరూపసందర్శనయోగం" అనే పదకొండవ అధ్యాయం సమాప్తం.