దామోదరుడు
--------------------
తిరుప్పావై ఐదవ పాశురంలో కృష్ణుడు దామోదరుడు గా, దామము ఉదరమునందు కలవాడుగా కీర్తించబడ్డాడు.
త్రాటితో కృష్ణుని అతడు కూర్చొన్న రోలుకు బంధించి వైచినచో రోలును కదల్పలేడుకదా అనుకొని అక్కడవున్న ఒక తాడుని తీసి రోలు కు కట్టుటకు ప్రయత్నించింది యశోద. ఆ తాడు రోలుకు సరిపోదయ్యెను. ఇంకొక తాడు మరియొక తాడు ఎన్నితెచ్చినా రోలుకు కట్టుటకు సాధ్యపడలేదు. యశోద రెండు మూడు తాళ్లు ముడివేసి కూడా కట్టడానికి ప్రయత్నించింది. అయినా బంధించ పోయింది.
పరబ్రహ్మను కట్ట తరమా! విశ్వమంతా నిండియున్నవానిని బంధింప శక్యమా! భక్తుల వశంలో ఉండే బాలగోపాలుడు చివరకు తనను కట్టుటకు తానే అనువు కల్పించు కొన్నాడు. ఎవ్వరు చేయలేని, చివరికి లక్ష్మీదేవికూడా చేయలేని పనిని యశోద సాధించింది.
ఆ గోపాల బాలుడు లక్ష్మీదేవి కౌగిటిలో చిక్కలేదు, సనక సనందనాదుల హృదయములలోను ఒదగలేదు, ఉపనిషత్తులచేతనూ బంధింపబడలేదు, అటువంటివాడు లీలగా, అవలీలగా తల్లి చేతిలో చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు. ఎంత విచిత్రము! యశోదమ్మ దేమి భాగ్యము!
నిత్యమూ శ్రీహరిని ధ్యానించు పరమశివుడు గాని, శ్రీహరి వక్షస్థలమును నివాసస్థానముగా పొందిన లక్ష్మీదేవి గాని, పుత్రుడని చెప్పుకొనే బ్రహ్మదేవుడు గాని శ్రీహరి నుండి యశోద పొందిన అనుగ్రహమును పొందలేకపోయారు.
భక్తికి కట్టుబడిన వాసుదేవుడు, జ్ఞానులకుగాని మహర్షులకుగాని, దానపరులకుగాని, చివరకు యోగీశ్వరులకు కూడా పట్టుబడడు కదా!
🙏
No comments:
Post a Comment