*తథాస్తు దేవతలు*
వేదాలలో *అనుమతి* అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగా సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో *తథాస్తు దేవతలు* అంటారు.
సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వరూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించటం మూలంగా వీరు జన్మించారు. మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తారని పురాణోక్తి.
ఏం మాట్లాడినా *తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త* అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్ఛరించకూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు.
వీరినే *తథాస్తు దేవతలు* అంటారు.
==============================
No comments:
Post a Comment