*దారి తప్పిన ధర్మనిరతి*
మనిషి తన సహజమైన ప్రవృత్తిని విడిచి, కేవలం ఉదరపోషణార్ధనకే పరిమితమై, ఉన్నత జీవనానికి ప్రయత్నించడకపోవడం వలన సంభవిస్తున్న దుష్పరిణామాలివి.
భగవంతుడి స్థానంలో భౌతికవాదం వచ్చి చేరడం వల్ల, నైతిక నియమాలు ఒక్కటొక్కటిగా సమాజం నుంచి కనుమరుగవుతూ ఉన్నాయి.
ముఖ్యంగా నిత్యజీవితంలో అవకాశవాదులుగా మారిపోయి, పరిస్థితుల పేరుతో మనకు మనమే విలువల్ని సడలించుకుంటూ, సవరించుకుంటూ దిగజారిపోతూ ఉన్నాం.
ఇలా స్వార్థం వల్ల లోభం పెరిగింది. లోభం వల్ల మోసం పెచ్చుమీరింది. ఇలా ద్రోహం, క్రోధం, క్రౌర్యం ఒక్కటొక్కటిగా మన మనస్సుల్లో వ్యాపిస్తున్నాయి.
అయితే స్వార్థాన్ని బీజదశలోనే నివారించుకోవాలన్న వివేకం మనలో కొరవడుతోంది. తత్ఫలితంగానే అది మనోక్షేత్రంలో విషయవాసనల విషవృక్షంగా వేళ్ళునుకుంటోంది. చివరకు అది మన జీవితాన్ని మనకు తెలియకుండానే నరకకూపంగా మార్చేస్తుంది.
అందుకే శ్రీకృష్ణభగవానుడు *భగవద్గీత* లో....
*కామక్రోధలోభాలు నరకానికి మూడు ద్వారాలు. అవి ఆత్మవినాశ కారకాలు. వివేకవంతులు ఈ మూడింటినీ త్యజించవలెను* అని హితవు పలికాడు.
అయితే మన జీవనయానానికి ధర్మాన్నీ, న్యాయాన్నీ జత చేసినప్పుడు క్రోధం, లోభం వాటంతట అవే వీడిపోతాయి.
ఈ రోజు మనం పడుతున్న సంఘర్షణలన్నిటికీ ప్రధాన కారణం అన్నింటినీ అధర్మమార్గంలో స్వంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండడమే.
అయితే ధర్మం దారి తప్పితే అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
******************************
No comments:
Post a Comment