*అధోదృష్టితో అధఃపతనం*
విపరీతమైన స్వార్థం, లోభం మానవ మనస్తత్వాలనే కలుషితం చేస్తున్నాయి. పుట్టింది ఈ పొట్ట నింపుకోవటానికే అన్న పోకడతో మనం భౌతిక ప్రపంచానికే పరిమితమౌతున్నాం. అత్యాశ ఆధ్యాత్మిక పరిణతికి అవరోధం.
కాలం ఎంత విపరీతంగా మారిపోయింది? అందరి దృష్టీ నిమ్న వస్తువుల మీదే లగ్నమై ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ ఉదరపోషణార్ధమే చింతన చేస్తున్నారు. ప్రతి వ్యక్తి మనస్సూ కామినీ కాంచనాలలో లీనమై ఉంది. ఏదో ఒకరిద్దరు మాత్రమే ఊర్ధ్వదృష్టి కలిగి, మనస్సును భగవంతుని మీద నిలిపినవారుగా కనిపిస్తున్నారు.
మరోవైపు మనకు పరంపరగా వస్తున్న శాస్త్ర మార్గాలనూ, మార్గదర్శక సూత్రాలనూ తృణీకరించడం వల్ల, మనస్సును అంతర్ముఖం గావించే సాధనలను విస్మరించడం వల్ల మనుషులు ఇంతగా బాహ్యప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు. పైగా అహంకారంతో, మిడిమిడి జ్ఞానంతో సనాతన ధర్మాన్నీ, ధార్మికవేత్తలనూ పరిహాసమాడుతూ, తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటున్నారు.
ఈ విపరీత వర్తమాన సమాజం ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మూల్యం చెల్లిస్తూనే ఉంది. ఈ అనుభవాలతోనైనా మనం మేల్కొని పొరపాట్లను సవరించుకోకపోతే, భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవలేక, అపఖ్యాతి పాలు కావాల్సి ఉంటుంది.
******************************
No comments:
Post a Comment