Friday, February 5, 2021

భగవంతునికి సమర్పించవలసినది*...మనకు ఏది లభించినది అంతా భగవదనుగ్రహ ఫలితమే. మనం నిజానికి భగవంతుడికి ఏమీ ఇవ్వవలసిన పని లేదు

*భగవంతునికి సమర్పించవలసినది*...


మనకు ఏది లభించినది అంతా భగవదనుగ్రహ ఫలితమే. మనం నిజానికి భగవంతుడికి ఏమీ ఇవ్వవలసిన పని లేదు.

 భగవంతునికి మనం పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో , సమర్పించడమన్నది మనం భగవంతుని యందు చూపించే 
కృతజ్ఞత మాత్రమే.  

 మనకు ఈ దేహాన్నిచ్చి,  సంపదలిచ్చి, పుత్ర పౌత్రాదులనిచ్చి కాపాడుతున్న పరమాత్మకు మనం సమర్పించే వస్తువులన్నీ ఆయనకు మనం కృతజ్ఞతను వెల్లడించడానికే, నిజానికి ఆయనకు కావలసిన దేమీ లేదు.  

 ఆయన సర్వ సంపూర్ణుడు. అయితే భగవంతునికి ఏమి యివ్వాలి అన్న విషయంలో భగవద్గీత ఇలా చెప్పింది.           

" పత్రం పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః "

నిర్మల బుద్ధితో, నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గానీ, పుష్పమునుగానీ, ఫలమునుగానీ, జలమును గానీ  నేను ప్రత్యక్షంగా, స్వయంగా ప్రీతితో ఆరగిస్తాను.

 పై శ్లోకంలోని పత్రపుష్పఫలతోయ శబ్దాలలోని అంతరార్థం

💐 1.  పత్రం :  "పతతీతి పత్రం". పడిపోయేది పత్రం. మనిషిని పడవేసేది  మనస్సు. కాబట్టి పత్రాన్ని సమర్పించాలీ అంటే మనమనస్సును
దైవాంకితం చేయాలని దాని అంతరార్థం.

💐 2.  పుష్పం:  "పుష్యతీతి పుష్పం". వికసించేది పుష్పం, మనిషిలో వికసించేది బుద్ధి   కాబట్టి మన బుద్ధి ని దేవునిపై లగ్నం చేయాలని దీని 
అంతరార్థం.

💐 3.  ఫలం  :  "విశీర్యతే ప్రహారైరితి ఫలం" ప్రహారైః   అనగా దెబ్బలచే విశీర్యతే అనగా పగిలేది ఫలము.   జ్ఞాన బోధము అనే దెబ్బలచే  పగిలేది మనస్సులోని అహంకారం. కాబట్టి ఫలాన్ని అనగా అహంకారాన్ని మనం దైవానికి సమర్పించాలని అంతరార్థం.

💐 4.  తోయం:  "తాయతే_పాయతీతి". అనగా రక్షించునది కనుక తోయము. సోహం భావంతో ఉన్నప్పుడు, ధ్యేయాన్ని గుర్తుంచుకొని , రక్షించేది  చిత్తము. కాబట్టి తోయము అంటే చిత్తము అని అంతరార్థం.  అంటే మన చిత్తాన్ని భగవంతునికి సమర్పించాలని భావము.

మనస్సు మన పతనానికి మూలకారణము. అందుకే దాన్ని మనం ముందుగా భగవంతు నికి సమర్పించాలి. 


 శంకరులు తమ శివానందలహరి లో  "భవతు భవదర్థం మమ మనః " ..అంటారు..

అనగా ఈశ్వరా ! నా మనస్సు నీ స్వాధీనం అగు గాక " అని కోరుకున్నారు...............

🙏🙏

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...