🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏
*🌸దేహాలయం*🌸
మనిషి ఎల్లప్పుడూ మూడు ‘ద’ కారాలను దృష్టిలో పెట్టుకుని జీవించాలంటారు ప్రవచనకర్తలు. మొదటి ‘ద’ దేహభక్తిని సూచిస్తుంది. రెండో ‘ద’ దైవభక్తికి సంకేతం. మూడో ‘ద’ దేశభక్తికి ప్రతీక. ఈ మూడింటి లోనూ మొదటిది దేహభక్తి. అంటే శరీరారోగ్యం పట్ల నిరంతరం శ్రద్ధ వహించడం. ఏ ధర్మకార్యం నిర్వర్తించాలన్నా మొదట శరీరం స్వస్థతగా ఉండాలి కదా! ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసూ ఉంటుంది. జపానికైనా, తపానికైనా, ప్రాణాయామం, యోగ, వ్యాయామం, వ్రతం, ఉద్యోగం... ఏది చేయాలన్నా ముందు దేహం చురుగ్గా పరిశుద్ధంగా ఉండాలి.
అతి నిద్ర, అతి ఆహారం, అతిగా మాట్లాడటం, అవసరాన్ని మించి సంచరించడం... ఇవన్నీ శరీరారోగ్యానికి హాని చేకూర్చేవే! మనసుకే కాదు, దేహానికీ క్రమశిక్షణ అవసరం. స్వచ్ఛమైన, విశుద్ధమైన దేహం మాత్రమే దైవానికి మందిర మవుతుంది. కలుషిత శరీరంలో పరమాత్మ క్షణమైనా నిలవడు. ఆరోగ్యవంతమైన శరీరం కలవాడి మనసులోనే, మెదడులోనే పరమాత్మ నిశ్చలంగా ఉంటాడు. ఈ శరీరమే ‘నేను’ అనే వ్యామోహం దరికి రానంతవరకు- దేహం పట్ల మనిషి మంచి ఎరుక కలిగి ఉంటాడు.
శరీరంలోని ప్రతి అవయవమూ తన ధర్మాన్ని పవిత్రంగా నిర్వర్తించినంత కాలం మనిషి చిత్తం, మస్తిష్కం అధీనంలోనే ఉంటాయి. మంచిని ఆలోచించడం, మంచిని మాట్లాడటం, మంచి చేయడం... స్వస్థ శరీరుడి లక్షణాలు. మంచి మాటలనే వింటూంటే చెవులు అనారోగ్యంపాలు కావు. మంచి ప్రదేశాల్లోనే సంచరించే పాదాలు అపరిశుభ్రం కావు.
అశాశ్వతమైన దేహపోషణకు అవసరాన్ని మించి సమయాన్ని వెచ్చించడమూ వాంఛనీయం కాదు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమంటే ఆడంబర సూచక వస్త్రాలను, ఆభరణాలను ధరించి కృత్రిమాలంకరణ చేసుకోవడం కాదు. శరీరానికి జలస్నానం, ఆత్మకు జపస్నానం- రెండూ ప్రధానమైనవే. సంధ్యావందనంలో చేసే ప్రతి మంత్ర పఠనానికీ ముద్రలంటూ ఉన్నాయి. ఆ ముద్రలన్నీ, ఆ భంగిమలన్నీ శరీరంలోని నాడులను స్పందింపజేసేవే. మంచి రక్తప్రసరణ కలిగించేవే. సూర్యనమస్కారాలూ సంధ్యావందనంలోని భాగం. సర్వరోగాలను నిర్మూలించి, దేహాన్ని చైతన్యవంతం చేస్తాయి బాలభానుడి లేతకిరణాలు.
శ్రవణం కన్న బోధన గొప్పది. బోధన కన్న సాధన గొప్పది. ఆ సాధనకు ఉండవలసిందే ఆరోగ్యవంతమైన శరీరం. హితంగా, మితంగా మాట్లాడటం, మౌనవ్రతం ఆచరించడం వల్ల శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. అష్టాంగం, పంచాంగం, త్రయ్యంగం, ఏకాంగం అనే నాలుగు రకాలైన నమస్కారాలు కూడా మనిషి ఆరోగ్యం కోసమే నిర్దేశితమైనాయి. రుషులు, మునులు, సిద్ధులు అడవులలో తపస్సు చేస్తున్నప్పుడు మంచి పోషక విలువలున్న కంద మూలాలే భుజించేవారు. నిర్మలంగా గలగలా పారే సెలయేళ్ల నీరు తాగేవారు. ధ్యానం శరీరానికి ఎంతో దృఢత్వం కలగజేస్తుంది. పాండవులు అరణ్యవాసంలో కందమూలాలు, సాత్విక ఆహారమే స్వీకరించి, శక్తిని పుంజుకోగలిగారు. తపస్సులన్నింటిలోనూ ‘ఏకాగ్రత’ అనేది గొప్ప తపస్సు. ఇది శరీరాన్ని శక్తిమంతం చేస్తుంది. మన శరీరాన్ని మనం కాపాడుకోవడం స్వార్థం కాదు. పైగా పరోపకారం కూడా. కోరికలతో కూడిన దేహం దుఃఖాలయం, జ్ఞానాన్ని నింపుకొన్న దేహం దేవాలయం. తనది కాని దేహాన్ని తనది అనుకోవడం అహంకారం. ‘దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, సనాతనుడు’ అంటుంది అద్వైత ధర్మం!
No comments:
Post a Comment