*గురు శిష్యుల సంబంధం*
గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధం అత్యంత ఉత్కృష్టమైంది. జ్ఞానవ్యాప్తికి సంబంధించినంత వరకు దానికే ప్రధాన పాత్ర.
*ఓం సహనావవతు సహనౌ భునక్తు*
*సహవీర్యం కరవావహై తేజస్వి*
*నావధీత మస్తు మావిద్విషావహై*
*ఓం శాంతి శాంతి శాంతిః.*
"బ్రహ్మ మన ఇరువురినీ రక్షించుగాక, మన ఇరువురను పోషించుగాక, ఇరువురం శక్తిమంతులు అవుదుము గాక, మన ఇరువురికి తేజస్సు కలుగుగాక, పరస్పర ద్వేషం లేకుండా ఉండెదం గాక" అని గురువు శాంతి ప్రార్థన చేస్తాడు. శిష్యుడి చేత చేయిస్తాడు.
ఇక్కడ ఇరువురి మధ్య సమభావం, సమరసభావం ప్రస్ఫుటంగా వ్యక్తమవుతున్నాయి. గురువులో నేర్పుతున్నాననే ఆధిక్యభావం, శిష్యుడిలో నేర్చుకుంటున్నాననే కృతజ్ఞతా భావం ఉంటే సరిపోదు.
గురుశిష్యుల మధ్య అనుబంధం, అనుసంధానం లేనట్లయితే ఒకరి మనోభావన, అవతలి వారి హృదయాన్ని స్పృశించదు. పాఠం చెప్పటమంటే దాని అర్థాన్ని, తత్పర్యాన్ని చెప్పటం కాదు. తత్వాన్ని బోధించటం. అదీ భావ ప్రధానంగా.
శిష్యుడి సమస్థాయికి దిగివచ్చి అతనిలో మేథానుసంధానం జరిపి, ఆత్మ వికసన ధ్యేయంగా జ్ఞానం అందించాలి. అప్పుడే ఒక దీపం నుంచి మరో దీపం వెలిగినట్లు జ్యోతిర్మయం చేస్తుంది.
గురువు శిష్యుడికి జ్ఞానఫలాన్ని అందిస్తే దాన్ని ప్రసాదంగా ప్రపంచానికి వితరణ చేస్తాడు శిష్యుడు.
*శుభంభూయాత్*
No comments:
Post a Comment