*గట్టిగా ధైర్యంగా బుద్ధి చెప్పండి*
.................................................
( పూర్తిగా చదవండి )
మార్పు అనేది మనిషిలో వచ్చినంతగా ఇతర జీవులలో రాదు. తన నమ్మకాన్ని విశ్వాసాలను మనిషే మార్చుకోగలడు. ఈ రోజున వైదికమతాన్ని అవలంభించిన వ్యక్తి రేపు బ్రాహ్మణమతాన్ని అవలంభించవచ్చు.
( బ్రాహ్మణ మతమంటే బ్రాహ్మణుల మతమనికాదు వైదికమతంలో ప్రధాన దేవుడు ఇంద్రుడు, ఆ తరువాత వరుణ, వాయుదేవతలు చెప్పుకోదగినవారు. బ్రాహ్మణమతంలో ఇంద్రుడి స్థానాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆక్రమించారు. )
ఆ తరువాత మానవుడు బౌద్ధాన్నో, జైనంనో లేదా సనాతన ధర్మాన్నో అనుసరించవచ్చును. ఇలా మానవులు తమ విశ్వాసాలను నమ్మకాలను ఆచారాలను వ్యవహారాలను మార్చుకొనే సౌలభ్యం కల్పించుకొన్నాడు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే !
హిందూదేవతలు మాంసం తినేవారా ? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం.
ఆ రోజులలో దేవతలేకాదు బ్రాహ్మణులు కూడా మాంసాహారం తినేవారు. అది వారి జీవనవిధానం, ఆహారపుటలవాటు కూడా.
ఉదా॥ భీముడు ఏకచక్రపురంలో వున్నపుడు తనకు ఆతిథ్యమిచ్చిన బ్రాహ్మణుడు అతనికి పెట్టిన భోజనం, మూలసంస్కృత భారతంలోని ఆదిపర్వంలో ఎలావుందంటే..
"పిశితోదన మాజ హ్రు రథా స్మైపురవాసిన:
నఘృతం సోవదశం చ సూపైర్నానా విధైస్సహ
తదా2 శీత్వా భీమసేనో *మాంసాని* వివిధానిచ."
బాగా వండిన అన్నంతోపాటుగా వివిధ రకాలైన భక్ష్యాలు, కూరలు, పెరుగు మొదలైన వాటితో పాటు రకరకాలైన మాంసపుకూరలు భీమసేనుడికి ఆ బ్రాహ్మణుడు పెట్టాడు.
పిల్లలు తిన్న ఆహారం జీర్ణం కావాలంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, మా పాపాయి తిన్న అన్నం జీర్ణమనే సామెత గురించి తెలుసుకొంటే త్రేతాయుగంలో బుుషులలో మాంసాహారం తప్పనిసరని తెలుసుకోవాలి.
వాతాపి, ఇల్వలుడు అనే వారిద్దరు రాక్షసులు, అన్నదమ్ములు. వాతాపికి కామరూపవిద్య తెలుసు, ఇల్వలుడికి సంజీవని విద్య తెలుసు. ఇద్దరు నరమాంస భక్షణ చేయాలనుకొన్నప్పుడు, వాతాపి కామరూప విద్యతో మేకగా మారేవాడు. ఇల్వలుడు అరణ్యంలో వెళుతున్న బ్రాహ్మణులను తమ ఇంట శ్రాద్ధకర్మలు జరుగుతున్నాయి, భోక్తగా రమ్మని వారిని పిలిచేవాడు.
ఆ రోజుల్లో భోక్తకు మాంసాహారం తప్పని సరిగా వడ్డించేవారు. మేకగా మారిన ఇల్వలుడిని వాతాపి వధించి వండి భోక్తకు వడ్డించేవాడు. భోక్త తిన్న తరువాత ఇల్వలుడు తన సంజీవని విద్యచే మరణించిన వాతాపిని బ్రతికించేవాడు.బ్రతికిన వాతాపి భోక్త కడుపు చీల్చుకొని బయటపడేవాడు. బ్రాహ్మణుడు మరణించేవాడు, ఆ నరమాంసాన్ని అన్నదమ్ములు తినేవారు.
అగస్త్యమహర్షి ఆ అడవి మార్గంలో ఒక రోజు రావడం జరిగింది. ఎప్పటిలాగే ఇల్వలుడు అగస్త్య మహామునిని తన తండ్రి అబ్ధికంలో భోక్తగా రమ్మని పిలిచాడు. త్రికాలవేదైన ఆ మహామునికి వీరి దుర్మార్గం తెలిసింది. ఎప్పటిలాగే వాతాపి మేకగా మారడం, ఇల్వలుడు ఆ మేకను కోసి కూరగా వండి అగస్త్యునికి వడ్డించడం, తిన్న తరువాత అగస్త్యుడు కడుపు మీద చేయి వేసుకొని నిమురుకొంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే, కడుపులో వాతాపి జీర్ణమైపోయాడు.
సంజీవని విద్య ప్రయోగించి ఇల్వలుడు ఓ వాతాపి బయటకు రా అన్నాడు. ఇంకెక్కడి వాతాపి.విషయం తెలుసుకొన్న ఇల్వలుడు కోపంతో తన భీకర రాక్షసరూపం పొంది అగస్త్యముని మీదకు మింగటానికి రాగా, ఆ మహాముని వాడిని కంటిచూపుతోనే భస్మం చేశాడు.
పై కథనుబట్టి ఆ రోజులలో మాంసాహారమనేది సర్వజనసమ్మతమని, ఎవరిలోనూ నిషిద్ధం కాదని తెలుస్తోంది.
వైదిక బ్రాహ్మణమతకాలాలలో యజ్ఞయాగాదులలో జంతుబలి తప్పనిసరి. జంతుబలి అనంతరం వాటిని రాజులు పురోహితులు వారి ఇతర పరివారం తినేవారు. ఇదే విషయాన్ని మహాకవి ఆరుద్రగారు వ్రాసిన సమగ్ర ఆంధ్రసాహిత్యం మొదటి భాగంలో ఎలా తెలియచేశారో చూద్దాం.
''బుుగ్వేద ఆర్యులు గోమాంసాన్ని, గుర్రం మాంసాన్ని గోర్రెలను, మేకలను వాటితోపాటు తినేవారు.వాటిని ముందుగా యజ్ఞంలో దేవతలకు వాటిని సమర్పించి తరువాత హాయిగా తినేవారు.
మహయజ్ఞాలలో ఏకకాలంలో 500 ఎద్దులు 500 గోవులు 500 దున్నలు 500 మేకలు 500 పొట్టేళ్ళను సేకరించి యూపస్తంభాలకు కట్టి వధించేవారు. రోజుకు అయిదునూర్ల లెక్కన జంతువులను వధించి తినేవారన్నమాట"
సాక్ష్యాత్తు విష్ణువాహనమైన గరుడుడు తన తల్లికి జరిగిన అన్యానికి ప్రతీకారంగా నాగులను చంపితినడం మనకు తెలుసు కదా !
యజ్ఞయాగాదులలోనూ, తన వంటశాలలోనూ రోజు కొన్ని వేల జంతువులు పక్షులు వధించబడటం చూచి మౌర్య అశోకుడు చలించిపోయాడు. అందుకే జీవహింస చేయరాదని, జంతువధ కూడదని అశోకుడు తన శాసనాలలో వ్రాయించి ప్రచారం చేశాడు.
మరి హిందూమతంలో మాంసాహారం నిషేధం ఎలా జరిగింది. దేవతలు, బ్రాహ్మణులు మొదలైనవారు మాంసాహారులు కారని శుద్ధ శాకాహారులని ఎందుకు ప్రచారంలోనికి వచ్చింది. ఇలా మార్పురావటానికి కారణమేమిటి ?
వైదికబ్రాహ్మణ మతాలలో విసృంఖల జంతుబలులను మూఢనమ్మకాలను వర్గవిబేధాలను నిరసిస్తూ పుట్టినవే జైనబౌద్ధమతాలు.
నాటి సమాజంలో అసమానతలతో హెచ్చు తగ్గులతో బాధలుపడుతున్న సామాన్య ప్రజలు జైనబౌద్ధాలపట్ల అకర్షితులైనారు. జైనం, బుద్ధమతం ప్రజలలో వెళ్ళునూకుపోయింది.
జైనబౌద్ధాలలోని దేవతారాధనకు ఆడంబరాలు, ఆర్భాటాలు అవసరంలేదని, దొంగతనం చేయరాదు, అబద్ధాలు చెప్పరాదు, జీవహింస చేయరాదనే నైతిక సూత్రాలు ప్రజలను ఆలోచింపచేశాయి.
బౌద్ధజైనాల పట్ల సామాన్య ప్రజల ఆదరణను చూచి వైదిక బ్రాహ్మణమతాలు ఆలోచనలో పడ్డాయి. వైదిక బ్రాహ్మణ మతస్తులు తమమతాన్ని రక్షించుకోటానికి సంస్కరణల బాటను పట్టించారు. తమమతం కూడా జీవహింసకు వ్యతిరేకమేనని నైతికవిలువలతో కూడిన పూజావిధానాలు ఇక్కడ కూడా అనుసరణీయమని చెప్పారు.
అందుకే తదనంతర కాలంలో సనాతన ధర్మంలో జంతుబలులు మాంసాహారం నిషేధించబడ్డాయి. ఇలాంటి సంస్కరణలలో భాగంగానే
మూలభారతంలో మాంసాహారం తిన్న పాండవద్వితీయుడు భీమసేనుడు ఫక్తు శాకాహారాన్ని తిన్నట్లుగా నన్నయ భారతాంధ్రీకరణలో
"పలుతెరంగుల పిండివంటలుబప్పుగూడును నేతికుం
డలుగుడంబులు దధి ప్రపూర్ణ ఘటంబులుం గొని వచ్చియిన్ "
అంటూ వ్రాసి భీముడు శాకాహారిగా మార్చి పలురకాలైన పిండివంటలు, పప్పుకూడులు, నేతితో నింపిన బెల్లపుపూర్ణాలు పెరుగుమొదలైనవి తినిపించాడు.
జైనబౌద్ధమతాల ప్రేరణతో మార్పులు దిద్దుకొన్న సనాతన ధర్మంలో ఇంకా మాంసాహారం ఉండిపోవటానికి అనేక కారణాలున్నాయి. జైనబౌద్ధమతాల పతనం తరువాత వచ్చిన రాజులందరూ వర్ణసంరక్షణ చేపట్టారు.వర్ణ సంకరాన్ని నిషేధించారు.కొందరు యజ్ఞ యాగాదులు మరలా మొదలుపెట్టారు. అటవికులు, మారుమూల ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోలేదు.
ఈ సువిశాలదేశంలో ప్రజలందర జైనబౌద్ధమతాల పట్ల ఆకర్షితులు కాలేదు. వారందరూ మాంసాహరులే. ఇంకా విదేశీదండయాత్రల వలన ఈ సువిశాల హిందూదేశంలో స్థిరపడిన విదేశీయుల ప్రధానఆహారం మాంసమే. సమాజంలో సాంఘికజీవనంలో ఒకరికొకరు మమేకమై సంస్కృతి సాంప్రదాయాలకు ఆహారపుటలవాట్లకు, ఇంకా అనేక మార్పుకులోనైనారు.
మాంసభక్షణ అనేది మనిషి పుట్టినప్పటి నుండేవుంది. పాతరాతి యుగానికంటే ముందుగా మానవుడు పచ్చి మాంసానినే భుజించాడు కదా !
*ఎవరైనా హిందూదేవతలు కూడా మాంసభక్షకులేనని విమర్శిస్తే, ఇబ్బంది పడవద్దు, జంకవద్దు,అవును ఒకపుడు అది సాధ్యమైంది, ఇపుడు సంస్కరణలలో భాగంగా ఈ మార్పు అవసరమైందని గట్టిగా ధైర్యంగా బుద్ధిచెప్పండి.*