ఒకప్పుడు వస్తువులను మాత్రమే సూచించిన “సరుకు”, “సామాన్లు” అనే పదాలు.. ఈ రోజు వినగానే ఎందుకు అసహ్యం కలిగిస్తున్నాయి? ఆ పదాల్లో ఏం మారింది? నిజానికి మారింది పదాలా, లేక మన ఆలోచనా? ఎందుకు భాష తన అసలు స్వరూపాన్ని కోల్పోతోంది? ఆ పదాలు బూతుగా ఎందుకు మారాయి?
భాష మనిషి ఆలోచనలకు అద్దం పడుతుంది. సమాజం ఎలా ఆలోచిస్తుందో, ఏ విలువలను గౌరవిస్తుందో, వేటిని తక్కువ చేస్తుందో అన్నీ భాషలోనే ప్రతిబింబిస్తాయి. ఒకప్పుడు సాధారణంగా వినిపించిన “సరుకు”, “సామాన్లు” అనే పదాలు... ఈ రోజు చాలా మందికి అసహ్యంగా, అవమానకరంగా అనిపిస్తున్నాయి. అసలు నిరపరాధమైన ఈ పదాలు బూతుల్లా ఎందుకు మారాయి? వాటి అర్థాలను మార్చిందెవరు? అనే ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం.
అసలు అర్థం ఏమిటంటే?
నిజానికి “సరుకు” అంటే వ్యాపారానికి సంబంధించిన వస్తువులు. “సామాన్లు” అంటే ఇంట్లో ఉపయోగించే వస్తువులు లేదా అవసరమైన వస్తువులు. ఈ పదాలు దశాబ్దాల పాటు ఎలాంటి వివాదం లేకుండా వాడుకలో ఉన్నాయి. మన తాతల కాలంలోనూ, తల్లిదండ్రుల కాలంలోనూ ఈ పదాలు కేవలం వస్తువులనే సూచించాయి. వీటిలో ఎలాంటి చెడు అర్థం లేదు. ఎలాంటి లైంగిక భావన లేదు. కానీ రాను రాను వాటిని ఎలా వాడామన్నదే అసలు సమస్యగా మారింది.
అసభ్య భావాలను చెప్పడానికి..
కొంతమంది వ్యక్తులు మహిళలను వ్యక్తులుగా కాకుండా, వస్తువుల్లా చూడటం వల్ల ఈ మార్పు మొదలైంది అనేది కొందరి వాదన. నేరుగా చెప్పలేని అసభ్య భావాలను చెప్పడానికి కొందరు “కోడ్ లాంగ్వేజ్” ను స్టార్ట్ చేశారు. మహిళల శరీర భాగాలను లేదా వారి రూపాన్ని సూచించడానికి, వస్తువులకు సంబంధించిన పదాలను ఉపమానంగా వాడటం మొదలుపెట్టారు. అలా “సరుకు”, “సామాన్లు” వంటి పదాలు క్రమంగా మహిళల శరీరాన్ని సూచించే మాటలుగా మారాయి
నిజానికి ఈ మార్పు ఒక్క వ్యక్తి వల్ల వచ్చింది కాదు. కొన్ని సినిమాలు, కొన్ని చీప్ కామెడీ సీన్లు, డబుల్ మీనింగ్ జోకులు, సోషల్ మీడియా వంటివి కలిసి చేసిన పని. ఏదో ఒక సినిమాలో నవ్వు తెప్పించడం కోసం వాడిన మాట, బయటి జీవితంలో చాలా సాధారణ మాటగా మారింది. ఆ జోక్ కి జనాలు నవ్వారు, చప్పట్లు కొట్టారు, కానీ ప్రశ్నించలేదు. అలా అలా ఆ పదం వినిపించడం మొదలై, దానికి చెడ్డ అర్థం అతుక్కుపోయింది. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆ నవ్వుల వెనుక ఎవరో ఒకరి గౌరవం నలిగిపోతున్న సంగతి చాలామంది పట్టించుకోవట్లేదు.
మనుషులకు ఆపాదించినప్పుడే..
మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే.. ఎప్పుడూ పదాలకు స్వయంగా చెడు స్వభావం ఉండదు. మనుషులే పదాలకు చెడు అర్థాన్ని అంటిస్తారు. ఒక పదాన్ని ఎలా వాడుతున్నామో.. అదే దాని స్వరూపాన్ని నిర్ణయిస్తుంది. అలాగే “సరుకు”, “సామాన్లు” అనే పదాలు వస్తువులకు సరైనవే, కానీ మనుషులకు వాడినప్పుడు అవి చెడు పదాలుగా మారిపోయాయి.
పదాల అర్థాన్ని మార్చిందెవరు?
ఇటీవల ఈ పదాలపై తీవ్ర స్పందన రావడానికి కారణం కూడా ఇదే. ఒకప్పుడు “జస్ట్ జోక్” అనుకున్న మాటలు, నిజానికి ఎంత లోతైన గాయాలు చేస్తాయో ఇప్పుడు చాలామందికి అర్థమవుతోంది. అయితే, ఈ పదాల అర్థాన్ని మార్చిందెవరు అనే ప్రశ్నకు నిజమైన సమాధానం.. మనమే. మన నవ్వులు, మన మౌనం, మన నిర్లక్ష్యం. తప్పు మాటను తప్పు అని చెప్పకుండా, పక్కన పెట్టిన ప్రతి సందర్భం, ఆ పదానికి చెడ్డ అర్థాన్ని మరింత బలంగా జోడించింది. భాషను చెడగొట్టింది పదాలు కాదు, వాటిని బాధ్యత లేకుండా వాడిన మనుషులే.