Sunday, February 16, 2020

ఆన్లైన్ లో ఎదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి పాయింట్స్ చూసి వివాహం అనుకూలం అని మీకు మీరే ఓకే అనేసుకొని చివరి నిమిషం లో గురువుగారు దగ్గరకు వెళ్లి వివాహ ముహర్తం పెట్టమని సదరు గురువు గారు జాతకం కుదరలేదు వివాహం కుదరదు అంటే మరొక గురువు ను కలిసి ముందుకు వెళుతున్నారా ?

ఆన్లైన్  లో  ఎదో  ఒక  వెబ్సైట్  ఓపెన్  చేసి  పాయింట్స్  చూసి  వివాహం  అనుకూలం  అని  మీకు  మీరే  ఓకే  అనేసుకొని  చివరి  నిమిషం  లో  గురువుగారు  దగ్గరకు  వెళ్లి  వివాహ  ముహర్తం   పెట్టమని  సదరు  గురువు గారు  జాతకం  కుదరలేదు   వివాహం  కుదరదు  అంటే మరొక గురువు ను  కలిసి  ముందుకు  వెళుతున్నారా ?   కాస్త  ఆగండి  మరి ...  మీ   వేదమయీ  వారి  మాట...  చదవండి తర్వాత  మీ ఇష్టం 

చాలా మంది ఆన్లైన్ పంచాంగంలో పాయింట్లు చూసి 18 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాతకాలు కుదిరాయనుకుంటారు.ఈ నిర్ణయం చాలా తప్పు .అష్టకూటములలో సంతానం,వైదవ్యం,ద్వికళత్రయోగం లాంటివి తెలుసుకోవటానికి అవకాశం లేదు.ఉదా:-సప్తమస్ధానంలో కుజ,శుక్రుల సంయోగం ఉండి పాప వీక్షణ ఉన్న దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి.పంచమ స్ధానంలో రాహు,కేతువులు ,కుజుడు,శని గాని ఉండి పాప వీక్షణ ఉన్న సంతాన నష్టం,మృతశిశువు,గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ.ఇవి ఏవి అష్టకూటముల ద్వారా నిర్ణయించలేము.పాయింట్లు బాగున్నాయని వివాహం చేసుకోవచ్చని వివాహ నిర్ణయం చేయరాదు.36 పాయింట్లకు 34 వచ్చిన జాతక చక్రంలో అనుకూలంగా లేకపోతే ఉపయోగంలేదు.
ఇటువంటి  విషయాలు  ఆన్లైన్  లో  అందుబాటులో  ఉండవు  ఉన్న  చూసి  అర్ధం  చేసుకొనే  స్థాయి  అందరికీ  ఉండదు 

కాబట్టి   చెప్పొచ్చేదేంటంటే   ఆన్లైన్  బేస్డ్  పాయింట్స్  నమ్మదండోయ్ .  మంచి  గురువుగారును  తెలుసుకొని  చక్కగా  ముందు  జాతకాలు  కలిసాయి  లేదా  చూసుకొని  తర్వాత  ముందుకు  వెళితే  బాగుంటుంది  లేదు  జాతకాలు   మాకు 
 పట్టింపులేదు  అనుకొంటే  అది వేరే  విషయం   జాతకాలు 
 మీద    నమ్మకం  ఉంటె   తప్పని  సరిగా  గురువు  గారు ను  జాతక  విషయం  లో  కలిసి న   తరవాత  ముందుకు   వెళ్ళండి

శ్రీమద్భగవద్గీతపదవ అధ్యాయం విభూతియోగంశ్రీ భగవానువాచ:భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః |యత్తే௨హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా |

శ్రీమద్భగవద్గీత

పదవ అధ్యాయం

విభూతియోగం

శ్రీ భగవానువాచ:

భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః |
యత్తే௨హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా || 1

శ్రీభగవానుడు: నా మాటలు విని ఆనందిస్తున్నావు. కనుక నీ శ్రేయస్సుకోరి శ్రేష్ఠమైన వాక్యం మళ్ళీ చెబుతున్నాను విను.

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః |
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః || 2.

దేవగణాలకుకాని, మహాఋషులకుకాని నా పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. దేవతలకూ, మహర్షులకూ అన్నివిధాల ఆదిపురుషుణ్ణి నేనేకావడం దీనికి కారణం.

యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే || 3

పుట్టుక, ఆది లేనివాడననీ, సమస్త లోకాలకూ ప్రభువుననీ నన్ను తెలుసుకున్నవాడు మనుషులలో వివేకవంతుడై, పాపాలన్నిటినుంచి విముక్తి పొందుతాడు.

బుద్ధిర్‌జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దుఃఖం భవో௨భావో భయం చాభయమేవ చ || 4

అహింసా సమతా తుష్టిః తపో దానం యశో௨యశః |
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః || 5

బుద్ధి, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం, దుఃఖం, జననం, మరణం, భయం, నిర్భయం, అహింస, సమదృష్టి, సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి వంటి వివిధ భావాలు ప్రాణులకు వాటివాటి కర్మానుసారం నా వల్లనే కలుగుతున్నాయి.

మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః || 6

సప్తమహర్షులూ, సనకసనందనాది నలుగురు ప్రాచీనమునులూ, మనువులూ నా సంకల్పబలం వల్లనే నా మానస పుత్రులుగా పుట్టారు. వాళ్ళనుంచే ప్రపంచంలోని ఈ ప్రజలంతా జన్మించారు.

ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |
సో௨వికంపేన యోగేన యుజ్యతే నా௨త్ర సంశయః || 7

నా సృష్టి మహిమనూ, యోగశక్తినీ యథార్థంగా ఎరిగినవాడికి నిశ్చయంగా నిశ్చలమైన యోగసిద్ధి కలుగుతుంది.

అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః || 8

సర్వజగత్తుకూ నేనే మూలకారణమనీ, నా వల్లనే సమస్తం నడుస్తున్నదనీ గ్రహించే బుద్ధిమంతులు నన్ను భక్తిభావంతో భజిస్తారు.

మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ |
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ || 9

అలాంటి భక్తులు మనసులూ, ప్రాణాలూ నాకే అర్పించి నిరంతరం నన్ను గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ సంతోషం, పరమానందం పొందుతారు.

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే || 10

నామీదే మనసు నిత్యం నిలిపి ప్రేమపూర్వకంగా నన్ను సేవించే వాళ్ళకు బుద్ధియోగం ప్రసాదిస్తాను. ఆ జ్ఞానంతో వాళ్ళు నన్ను చేరగలుగుతారు.

తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః |
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా || 11

ఆ భక్తులను అనుగ్రహించడం కోసమే నేను వాళ్ళ హృదయాలలో వుండి, అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని, ప్రకాశిస్తున్న జ్ఞానమనే దీపంతో రూపుమాపుతాను.

అర్జున ఉవాచ:

పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ || 12

ఆహుస్త్వామ్ ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే || 13

అర్జునుడు: నీవు పరబ్రహ్మవనీ, పరంధాముడవనీ, పరమపవిత్రుడవనీ, శాశ్వతుడవనీ, దివ్యపురుషుడవనీ, ఆదిదేవుడవనీ, జన్మలేనివాడవనీ, అంతటా వ్యాపించినవాడవనీ సకల ఋషులూ, దేవర్షి అయిన నారదుడూ, అసితుడూ, దేవలుడూ, వ్యాసుడూ చెబుతున్నారు. స్వయంగా నీవూ నాకు అలాగే చెబుతున్నావు.

సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః || 14

కేశవా ! నీవు నాకు చెప్పిందంతా సత్యమని నా సంపూర్ణవిశ్వాసం. దేవతలూ, దానవులూ కూడా నీ నిజస్వరూపం ఎరుగరు.

స్వయమేవాత్మనా௨త్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే || 15

పురుషోత్తమా ! నీవు సమస్త భూతాలకూ మూలకారణుడవు; అధిపతివి; దేవతలందరకూ దేవుడవు; జగత్తుకంతటికీ నాథుడవు. నిన్ను గురించి నీవే స్వయంగా తెలుసుకుంటున్నావు.

వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి || 16

ఏ మహిమలవల్ల నీవు సకలలోకాలలో వ్యాపించివున్నావో ఆ దివ్య మహిమలన్నిటిగురించీ చెప్పడానికి నీవే తగినవాడవు.

కథం విద్యామహం యోగిన్, త్వాం సదా పరిచింతయన్ |
కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా || 17

యోగీశ్వరా ! నిరంతరం స్మరిస్తూ నిన్నెలా నేను తెలుసుకోవాలి? ప్రభూ ! నిన్ను ఏయే భావాలతో నేను ధ్యానించాలి?

విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన |
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే௨మృతమ్ || 18

జనార్దనా ! నీ యోగమహిమ గురించీ, లీలావిభూతిగురించీ వివరంగా నాకు మళ్ళీ చెప్పు. నీ అమృత వాక్యాలను వినేకొద్దీ తనివి తీరడం లేదు.

శ్రీ భగవానువాచ:

హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే || 19

శ్రీ భగవానుడు: అర్జునా ! నా దివ్య వైభవాలను గురించి అలాగే చెబుతాను. నా విభూతులకు అంతం లేనందువల్ల ముఖ్యమైన వాటినే వివరిస్తాను.

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ || 20

అర్జునా ! సమస్తజీవుల హృదయాలలో వుండే ఆత్మను నేనే. సర్వ భూతాల ఉత్పత్తి, స్థితి, ప్రళయకారణమూ నేనే.

ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ || 21

నేను ఆదిత్యులలో విష్ణువును; జ్యోతులలో కిరణాలు కలిగిన సూర్యుణ్ణి; మరుత్తులనే దేవతలలో మరీచి అనే వాయువును; నక్షత్రాలలో చంద్రుణ్ణి.

వేదానాం సామవేదో௨స్మి దేవానామస్మి వాసవః |
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా || 22

వేదాలలో సామవేదాన్ని ; దేవతలలో ఇంద్రుణ్ణి; ఇంద్రియాలలో మనస్సును; భూతాలలో చైతన్యాన్ని నేనే.

రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ || 23

నేను ఏకాదశ రుద్రులలో శంకరుణ్ణి; యక్షులలో, రాక్షసులలో కుబేరుణ్ణి; అష్టవసువులలో అగ్నిని; పర్వతాలలో మేరువును.

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః || 24

పార్థా ! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనని తెలుసుకో. సేనాధిపతులలో కుమారస్వామిని నేను. సరస్సులలో నేను సముద్రుణ్ణి.

మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |
యజ్ఞానాం జపయజ్ఞో௨స్మి స్థావరాణాం హిమాలయః || 25

మహర్షులలో నేను భృగువును; మాటలలో ఓంకారాన్ని; యజ్ఞాలలో జపయజ్ఞాన్ని; కదలని పదార్థాలలో హిమాలయ పర్వతాన్ని.

అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః |
గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః || 26

అన్ని వృక్షాలలో అశ్వత్థవృక్షాన్ని; దేవర్షులలో నారదుణ్ణి; గంధర్వులలో చిత్రరథుణ్ణి. సిద్ధులలో కపిలమునిని.

ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ || 27

గుర్రాలలో అమృతంతో పుట్టిన ఉచ్చైశ్శ్రవాన్ననీ, ఏనుగులలో ఐరావతాన్ననీ, మనుషులలో రాజుననీ నన్ను తెలుసుకో.

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః || 28

ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని; ఆవులలో కామధేనువును; సంతాన కారణమైన మన్మథుణ్ణి; సర్పాలలో వాసుకిని.

అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ || 29

నాగులలో ఆదిశేషుణ్ణి; జలదేవతలలో వరుణుణ్ణి నేను. పితృదేవతలలో ఆర్యముణ్ణి; శాసించేవాళ్ళలో యముణ్ణి నేను.

ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ |
మృగాణాం చ మృగేంద్రో௨హం వైనతేయశ్చ పక్షిణామ్ || 30

నేను రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి; లెక్కించేవాళ్ళలో కాలాన్ని; మృగాలలో సింహాన్ని; పక్షులలో గరుత్మంతుణ్ణి.

పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ |
ఝుషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ || 31

పవిత్రం చేసేవాటిలో గాలిని నేను; ఆయుధధారులలో రాముణ్ణి; జలచరాలలో మొసలిని; నదులలో గంగా నదిని.

సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున |
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ || 32

అర్జునా ! సమస్త చరాచరసృష్టికి ఉత్పత్తి, ఉనికి, అంతమూ నేనే. విద్యలలో అధ్యాత్మవిద్యను; వాదించేవాళ్ళలోని వాదాన్ని నేను.

అక్షరాణామకారో௨స్మి ద్వంద్వః సామాసికస్య చ |
అహమేవాక్షయః కాలో ధాతా௨హం విశ్వతోముఖః || 33

అక్షరాలలో ‘అ’ కారాన్ని నేను; సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని; నాశనం లేని కాలాన్ని; అన్ని దిక్కులకూ ముఖాలు కలిగిన బ్రహ్మను.

మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా || 34

సర్వాన్నీ సంహరించే మృత్యువును; కలగబోయే వస్తువులకు మూలాన్ని; స్త్రీలలోని కీర్తి, సంపద, వాక్కు, జ్ఞాపకశక్తి, మేధ, ధైర్యం, ఓర్పు నేనే.

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |
మాసానాం మార్గశీర్షో௨హమృతూనాం కుసుమాకరః || 35

నేను సామవేదగానాలలో బృహత్సామాన్ని; ఛందస్సులలో గాయత్రిని; మాసాలలో మార్గశిరాన్ని, ఋతువులలో వసంతాన్ని.

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయో௨స్మి వ్యవసాయో௨స్మి సత్త్వం సత్త్వవతామహమ్ || 36

మోసగాళ్ళలో జూదాన్ని నేను; తేజోవంతులలో తేజస్సును; విజేతల విజయాన్ని; కృషిసలిపేవాళ్ళ కృషిని; బలవంతుల బలాన్ని నేను.

వృష్ణీనాం వాసుదేవో௨స్మి పాండవానాం ధనంజయః |
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః || 37

యాదవులలో వాసుదేవుణ్ణి; పాండవులలో అర్జునుణ్ణి నేను; మునులలో వ్యాసుణ్ణి; సూక్ష్మబుద్ధి కలిగినవాళ్ళలో శుక్రాచార్యుణ్ణి.

దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ || 38

దండించేవాళ్ళలో దండనీతిని; జయించ కోరేవాళ్ళ రాజనీతిని; రహస్యాలలో మౌనాన్ని; జ్ఞానవంతులలో జ్ఞానాన్ని నేను.

యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాత్, మయా భూతం చరాచరమ్ || 39

అర్జునా ! సకలభుతాలకూ మూలకారణాన్ని నేను. ఈ చరాచర ప్రపంచంలోని వస్తువులలో ఏదీ నేను లేకుండా లేదు.

నాంతో௨స్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా || 40

పరంతపా ! నా దివ్యవిభూతులకు అంతం లేదు. అయినప్పటికీ క్లుప్తంగా నీకు నా విస్తారమైన విభూతులను వివరించాను.

యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజో௨0శసంభవమ్ || 41

ఈ లోకంలో ఐశ్వర్యవంతమూ, శోభాయుతమూ, ఉత్సాహభరితమూ అయిన ప్రతివస్తువూ నా తేజస్సులోని ఒక అంశం నుంచే కలిగిందని గ్రహించు.

అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ || 42

అర్జునా ! అంతేకాకుండా నా విభూతి వివరాలన్నీ తెలుసుకోవడం వల్ల నీకు ప్రయోజనమేమీలేదు. ఈ సమస్త జగత్తునూ నాలోని ఒక్క అంశంతోనే నిండి నిబిడీకృతమై వున్నానని మాత్రం తెలుసుకో.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "విభూతియోగం" అనే పదవ అధ్యాయం సమాప్తం.

శ్రీమద్భగవద్గీతతొమ్మిదవ అధ్యాయంరాజవిద్యారాజగుహ్యయోగంశ్రీ భగవానువాచ:ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |జ్ఞానం విజ్ఞానసహితం యద్‌జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ ||

శ్రీమద్భగవద్గీత

తొమ్మిదవ అధ్యాయం

రాజవిద్యారాజగుహ్యయోగం

శ్రీ భగవానువాచ:

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం యద్‌జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ || 1

శ్రీ భగవానుడు: అశుభకరమైన సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతిరహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని అసూయలేని నీకు ఉపదేశిస్తున్నాను.

రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ || 2

విద్యలలో ఉత్తమం, పరమరహస్యం, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మజ్ఞానం ప్రత్యక్షానుభవంవల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం సులభసాధ్యం.

అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప |
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని || 3

అర్జునా ! ఈ ధర్మంపట్ల శ్రద్ధలేని పురుషులు నన్ను పొందకుండా మరణరూపమైన సంసారపథంలో పరిభ్రమిస్తారు.

మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్‌స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః || 4

ఇంద్రియాలకు కనుపించని నా రూపం ఈ విశ్వమంతా వ్యాపించి వున్నది. సకలజీవులూ నాలో వున్నాయి; నేను మాత్రం వాటిలో లేను.

న చ మత్‌స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః || 5

ఈశ్వర సంబంధమైన నా యోగశక్తిని చూడు. భూతాలు నాలో లేవు. నా ఆత్మ సమస్త భూతాలనూ సృష్టించి, పోషిస్తున్నప్పటికీ వాటిలో వుండదు.

యథా௨௨కాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని మత్‌స్థానీత్యుపధారయ || 6

సర్వత్రా సంచరించే మహావాయువు ఆకాశంలో నిరంతరం నిలిచి వున్నట్లే సర్వభూతాలూ నాలో వున్నాయని తెలుసుకో.

సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ || 7

కౌంతేయా ! ప్రళయకాలంలో ప్రాణికోటులన్నీ నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. సృష్టికాలంలో వాటిని మళ్ళీ నేను సృజిస్తున్నాను.

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ || 8

ప్రకృతికి అధీనమై, అస్వతంత్రమైన సకల భూతసంఘాన్నీ స్వాధీనంలో వుంచుకున్న నా ప్రకృతితో మళ్ళీ మళ్ళీ సృష్టిస్తుంటాను.

న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు || 9

అయినప్పటికీ అర్జునా ! వాటిపై ఆసక్తిలేని తటస్థుణ్ణి కావడం వల్ల ఈ కర్మలు నన్ను బంధించలేవు.

మయా௨ధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ |
హేతునా௨నేన కౌంతేయ జగద్విపరివర్తతే || 10

కౌంతేయా ! ప్రకృతి నా పర్యవేక్షణలో ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. అందువల్లనే అవిచ్ఛిన్నంగా జగన్నాటకం జరుగుతున్నది.

అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11

సమస్త ప్రాణికోటికీ ప్రభువునైన నా పరమాత్మతత్త్వం తెలియని మూఢులు మానవరూపంలో వున్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు.

మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12

అలాంటి మూఢులు పనికిమాలిన కాంక్షలూ, కర్మలూ, జ్ఞానమూ కలిగి వివేకం కోల్పోయి రాక్షసుల స్వభావాన్ని ఆశ్రయిస్తారు.

మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః |
భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ || 13

పార్థా ! సాత్వికస్వభావం కలిగిన మహాత్ములు సర్వభూతాలకూ ఆదికారణమైనవాడిగా, నాశనంలేనివాడిగా నన్ను తెలుసుకుని ఏకాగ్రచిత్తంతో సేవిస్తారు.

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14

వాళ్ళలో కొంతమంది నిరంతరం నన్ను కీర్తిస్తూ, దృఢవ్రతంతో ప్రయత్నిస్తూ భక్తితో నాకే నమస్కరిస్తూ మనస్సు నామీదే నిలిపి నన్ను ఉపాసిస్తారు.

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ || 15

మరికొంతమంది మహాత్ములు విశ్వరూపంతో వున్న నన్ను జ్ఞానయజ్ఞంతో సేవిస్తారు. అనేక భావాలతో—నేను ఒక్కడినే అనీ, వేరే వ్యక్తిననీ, బహురూపాలు కలిగినవాడిననీ భజిస్తారు.

అహం క్రతురహం యజ్ఞః స్వధా௨హమహమౌషధమ్ |
మంత్రో௨హమహమేవా௨జ్యమహమగ్నిరహం హుతమ్ || 16

క్రతువూ, యజ్ఞమూ, పితృదేవతలకు అర్పించే అన్నమూ, ఔషధమూ, మంత్రమూ, నేయీ, నిప్పూ, హోమమూ నేనే.

పితా௨హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ || 17

ఈ జగత్తుకు తండ్రి, తల్లి, కర్మఫలదాత, తెలుసుకోదగ్గవస్తువు నేనే. ఓంకారం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనే.

గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ |
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ || 18

ఈ జగత్తుకు గతి, పతి, ప్రభువు, సాక్షి, నివాసస్థానం, ఆశ్రయం, ఆప్తుడు, సృష్టికర్త, సంహారకుడు, ఆధారం, ప్రళయం, స్థానం, శాశ్వతబీజం నేనే.

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున || 19

అర్జునా ! నేనే వేడి కలుగజేస్తున్నాను. వర్షాన్ని నిలుపుతున్నాను; కురిపిస్తున్నాను. అమృతమూ, మృత్యువూ నేనే. శాశ్వతమైన సత్తూ, అశాశ్వతమైన అసత్తూ నేనే.

త్రైవిద్యా మాం సోమపాః పూత పాపా
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |
తే పుణ్యమాసాద్యసురేంద్రలోకం
అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ || 20

మూడు వేదాలు చదివినవారు యజ్ఞాలతో నన్ను పూజించి, సోమపానంచేసి, పాపాలు పోగొట్టుకుని స్వర్గం కోరతారు. అలాంటివాళ్ళు పుణ్యఫలమైన దేవేంద్రలోకాన్ని పొంది, దివ్యభోగాలు అనుభవిస్తుంటారు.

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నాః
గతాగతం కామకామా లభంతే || 21

వాళ్ళు విశాలమైన స్వర్గలోకంలో సుఖాలు అనుభవించి, పుణ్యం క్షీణించిపోగానే మానవలోకంలో మళ్ళీ ప్రవేశిస్తారు. ఇలా వేదంలోని కర్మకాండను పాటించే భోగపరాయణులు జననమరణాలు పొందుతుంటారు.

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || 22

ఏకాగ్రచిత్తంతో నిరంతరం నన్నే స్మరిస్తూ సేవించేవాళ్ళ యోగక్షేమాలు నేనే చుస్తాను.

యే௨ప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః |
తే௨పి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ || 23

కౌంతేయా ! ఇతర దేవతలను భక్తి శ్రద్ధలతో భజించేవాళ్ళు కూడా నన్నే పూజిస్తున్నారు. అయితే వాళ్ళ ఆరాధన శాస్త్రసమ్మతం కాదు.

అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్వేనా௨తశ్చ్యవంతి తే || 24

సర్వయజ్ఞాలలో భోక్త, ప్రభువు నేనే. ఇతర దేవతల భక్తులు ఈ వాస్తవాన్ని గ్రహించలేక మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు.

యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినో௨పి మామ్ || 25

దేవతలను సేవించేవాళ్ళు దేవతలనూ, పితృదేవతలను ఆరాధించేవాళ్ళు పితృదేవతలనూ, భూతాలను అర్చించేవాళ్ళు భూతాలనూ పొందుతారు. నన్ను పూజించేవాళ్ళు నన్నే పొందుతారు.

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః || 26

పరిశుద్ధమైన మనస్సు కలిగినవాడు భక్తితో నాకు ఆకుకాని, పువ్వుకాని, పండుకాని, నీరుకాని సమర్పిస్తే సాదరంగా స్వీకరిస్తాను.

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ || 27

కౌంతేయా ! నీవు ఏంచేసినా—భోజనం చేసినా, హోమం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, నాకు ఆ సర్వం సమర్పించు.

శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి || 28

శుభాశుభఫలాలు కలగజేసే కర్మబంధాలనుంచి నీవు అలా విముక్తి పొందుతావు. సన్యాసయోగం అవలంబిస్తే జీవించి వుండగానే ముక్తిపొంది, మరణానంతరం నన్ను చేరుతావు.

సమో௨హం సర్వభూతేషు న మే ద్వేష్యో௨స్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ || 29

సమస్తప్రాణులపట్ల సమభావం కలిగిన నాకు విరోధికాని, ఇష్టుడుకాని లేడు. నన్ను భక్తితో భజించేవాళ్ళు నాలోనూ, నేను వాళ్ళలోనూ వుంటాము.

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః || 30

ఎంతటి పాపి అయినప్పటికీ ఏకాగ్రచిత్తంతో నన్ను సేవించేవాణ్ణి సాధువుగానే భావించాలి. ఎందువల్లనంటే అతని సంకల్పం మంచిది.

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి || 31

అలాంటివాడు అచిరకాలంలోనే ధర్మాత్ముడై, శాశ్వతశాంతి పొందుతాడు. కౌంతేయా ! నా భక్తుడెప్పుడూ చెడిపోడని ఘంటాపథంగా శపథం చేసి మరీ చెప్పు.

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే௨పి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తే௨పి యాంతి పరాం గతిమ్ || 32

పార్థా ! నన్ను ఆశ్రయించినవాళ్ళు ఎవరైనా సరే—పాపజన్ములు కాని, స్త్రీలుకాని, వైశ్యులుకాని, శూద్రులు కాని—పరమశాంతిపదం పొందుతారు.

కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ || 33

ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షులగురించి వేరే చెప్పాలా? సుఖంలేని అశాశ్వతమైన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః || 34

నామీదే మనస్సూ, భక్తీ కలిగి నన్నే పూజించు. నాకే నమస్కరించు. ఇలా నన్ను ఆశ్రయించి, నామీదే మనస్సు నిలిపితే నన్నే పొందుతావు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " రాజవిద్యారాజగుహ్యయోగం" అనే తొమ్మిదవ అధ్యాయం సమాప్తం.

మహాలక్ష్మీ అనుగ్రహం పొందడానికి............!!సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు.

మహాలక్ష్మీ అనుగ్రహం పొందడానికి............!!

సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు.
ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం
ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము.
కానీ, శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు,
ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం
సూక్ష్మంగ తెలుసుకొందాము.
పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.

సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడేయకూడదు.
గడప..లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం,
గడప మీద కాలు వేయడం,
గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు.
పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి.
అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.

ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.

శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం.
కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు,
విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు
ఎప్పటికప్పుడు బయట పారేయాలి.

చెడిపోయిన గడియారాలు,
విరిగిపోయిన అద్దాలు,
చిరిగి, వాడని వస్త్రాలు
ఇంట్లో అస్సలు ఉండకూడదు.

ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి.

ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం,
నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం
వంటివి చేయకూడదు.

ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో,
ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో,
ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.

అబద్ధాలు చెప్పేవాళ్ళు,
ఇరు సంధ్యలలో భుజించేవారు,
నిద్రించే వారు,
బద్దకస్తులు ఎక్కడ ఉంటారో,
అక్కడ లక్ష్మి దేవి ఉండదు.

ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.

సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.

వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

అతిగా మాట్లాడే వారు,
గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు,
జూదరులు, అతి నిద్రాలోలురు,
అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట
లక్ష్మి దేవి ఉండలేదు.

ప్రతి శుక్రవారం తలస్నానం చేసి,
ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి,
లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.

చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు..!
ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః..!!

శ్రీమద్భగవద్గీతఎనిమిదవ అధ్యాయంఅక్షరపరబ్రహ్మయోగంఅర్జున ఉవాచ:కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే ||

శ్రీమద్భగవద్గీత

ఎనిమిదవ అధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం

అర్జున ఉవాచ:

కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే || 1

అర్జునుడు: పురుషోత్తమా ! బ్రహ్మమంటే ఏమిటి? అధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి?

అధియజ్ఞః కథం కో௨త్ర దేహే௨స్మిన్ మధుసూదన |
ప్రయాణకాలే చ కథం జ్ఞేయో௨సి నియతాత్మభిః || 2

మధుసూదనా ! ఈ శరీరంలో అధియజ్ఞుడెవడు; ఎలావుంటాడు? మనో నిగ్రహం కలవాళ్ళు మరణసమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు?

శ్రీ భగవానువాచ:

అక్షరం బ్రహ్మ పరమం స్వభావో௨ధ్యాత్మముచ్యతే |
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః || 3

శ్రీ భగవానుడు: సర్వోత్తమం, శాశ్వతమూ అయిన పరమాత్మనే బ్రహ్మమనీ, ఆత్మ పరమాత్మతత్వాన్ని అధ్యాత్మమనీ చెబుతారు. సమస్త జీవుల ఉత్పత్తికీ, ఉనికికీ కారనమైన త్యాగపూర్వం, యజ్ఞరూపం అయిన కార్యమే కర్మ.

అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ |
అధియజ్ఞో௨హమేవాత్ర దేహే దేహభృతాం వర || 4

అర్జునా ! శరీరంలాంటి నశించే స్వభావం కలిగిన పదార్థాలను అధిభూతమంటారు. పురుషుడే అధిదైవం. ఈ దేహంలో అంతర్యామి రూపంలో వుండే అధియజ్ఞాన్ని నేనే.

అంతకాలే చ మామేవ స్మరన్‌ముక్త్వా కలేవరమ్ |
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః || 5

మరణసమయంలో నన్నే స్మరణచేస్తూ శరీరాన్ని విడిచిపెట్టినవాడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో సందేహమేమీ లేదు.

యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్ |
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః || 6

కౌంతేయా ! అంత్యకాలంలో ఎవడు ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో, ఆ భావాలకు తగిన స్థితినే పొందుతాడు.

తస్మాత్‌సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |
మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ || 7

అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి. మనస్సునూ, బుద్ధినీ నాకు అర్పిస్తే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు.

అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ || 8

పార్థా ! మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమపురుషుడైన భగవానుణ్ణి నిరంతరం ధ్యానించేవాడు ఆయననే పొందగలుగుతాడు.

కవిం పురాణమనుశాసితారమ్
అణోరణీయాంసమనుస్మరేద్యః |
సర్వస్య ధాతారమచింత్యరూపమ్
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 9

ప్రయాణకాలే మనసా௨చలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురుషముపైతి దివ్యమ్ || 10

సర్వమూ తెలిసినవాడు, సనాతనుడు, సకలలోకాలనూ శాసించేవాడు, సూక్ష్మాతిసూక్ష్మమైనవాడు, సూర్యుడులాంటి కాంతి కలిగినవాడు, అఖిల జగత్తుకూ ఆధారమైనవాడు, ఆలోచించడానికి శక్యంకాని రూపంకలిగినవాడు అజ్ఞానాంధకారానికి అతీతుడు అయిన పరమేశ్వరుణ్ణి మరణకాలంలో మనస్సు నిశ్చలంగా వుంచుకొని భక్తిభావంతో, యోగబలంతో కనుబొమల మధ్య ప్రాణవాయువును బాగా నిలిపి ధ్యానించేవాడు ఆ దివ్యపురుషుణ్ణి పొందుతాడు.

యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః |
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే || 11

వేదార్థం తెలిసినవాళ్ళు శాశ్వతమని చెప్పేదీ, కామక్రోధాలను జయించిన యోగులు చేరేదీ, బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు చేరకోరేదీ అయిన పరమపదాన్ని గురించి నీకు క్లుప్తంగా చెబుతాను విను.

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |
మూర్ధ్న్యా ధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ || 12

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌మామనుస్మరన్ |
యః ప్రయాతి త్యజన్‌దేహం స యాతి పరమాం గతిమ్ || 13

ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును హృదయంలో నిలిపి, ప్రాణం శిరస్సులోవుంచి, ఆత్మయోగం అభ్యసిస్తూ బ్రహ్మను ప్రతిపాదించే ఓంకారమనే ఒక్క అక్షరాన్ని ఉచ్చరిస్తూ, నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టేవాడు మోక్షం పొందుతాడు.

అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః |
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః || 14

పార్థా ! ఏకాగ్రచిత్తంతో ఎల్లప్పుడూ నన్నే స్మరించే ధ్యానయోగికి నేను అతి సులభంగా లభిస్తాను.

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |
నాప్నువంతి మహాత్మానః సంసిద్దిం పరమాం గతాః || 15

మోక్షపదాన్ని పొందిన మహాత్ములు నన్ను చేరి, దుఃఖపూరితం, అశాశ్వతమూ అయిన పునర్జన్మ పొందరు.

ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినో௨ర్జున |
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే || 16

కౌంతేయా ! బ్రహ్మలోకంవరకూ వుండే సకలలోకాలూ పునర్జన్మ కలగజేసేవే. నన్ను పొందినవాళ్ళకు మాత్రం మరోజన్మ లేదు.

సహస్రయుగపర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః |
రాత్రిం యుగసహస్రాంతాం తే௨హోరాత్రవిదో జనాః || 17

బ్రహ్మదేవుడికి వేయియుగాలు పగలనీ, ఇంకో వేయియుగాల కాలం రాత్రి అనీ తెలుసుకున్నవాళ్ళే రాత్రింబవళ్ళ తత్వాన్ని గ్రహిస్తారు.

అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే || 18

బ్రహ్మదేవుడి పగటిసమయంలో చరాచర వస్తువులన్నీ అవ్యక్త ప్రకృతి నుంచి కలుగుతాయి. మళ్ళీ రాత్రికావడంతోనే అవ్యక్తం అనబడే ఆ ప్రకృతి లోనే కలసిపోతాయి.

భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే௨వశః పార్థ ప్రభవత్యహరాగమే || 19

పార్థా ! ఈ జీవకోటి పుట్టి పుట్టి బ్రహ్మకు రాత్రి రావడంతోనే ప్రకృతిలో లీనమవుతుంది. పగలు కాగానే మళ్ళీ పుడుతుంది.

పరస్తస్మాత్తు భావో௨న్యో௨వ్యక్తో௨వ్యక్తాత్ సనాతనః |
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి || 20

ఈ అవ్యక్తప్రకృతికి అతీతమై, అగోచరం, శాశ్వతమూ అయిన పరబ్రహ్మతత్వం సమస్తభూతాలూ నశించినా నశించదు.

అవ్యక్తో௨క్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ || 21

అగోచరుడనీ, శాశ్వతుడనీ చెప్పే ఆ పరమాత్మనే పరమగతిగా భావిస్తారు. నాకు నిలయమైన పరమపదాన్ని పొందినవాళ్ళకు మళ్ళీ జన్మలేదు.

పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ || 22

అర్జునా ! సమస్తభూతాలనూ తనలో ఇముడ్చుకుని, సకలలోకాలలో వ్యాపించి వున్న పరమాత్మను అచంచలమైన భక్తివల్లనే పొందవచ్చు.

యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః |
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ || 23

భరతవీరా ! యోగులు ఏ సమయంలో మరణిస్తే మళ్ళీ జన్మించరో, ఏ వేళ దేహం విడిచిపెడితే పునర్జన్మ పొందుతారో చెబుతాను విను.

అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః || 24

అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, ఆరుమాసాల ఉత్తరాయణం—వీటిలో మరణించే బ్రహ్మోపాసకులకు బ్రహ్మప్రాప్తి కలుగుతుంది.

ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే || 25

పొగ, రాత్రి, కృష్ణపక్షం, ఆరుమాసాల దక్షిణాయనంలో గతించిన యోగి చంద్రజ్యోతిని పొంది, మళ్ళీ మానవలోకంలోకి వస్తాడు.

శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే |
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః || 26

శుక్ల, కృష్ణ అనే రెండింటినీ జగత్తులో శాశ్వతమార్గాలుగా భావిస్తున్నారు. శుక్లమార్గంలో పయనించినవాడికి జన్మరాహిత్యమూ, కృష్ణమార్గంలో పోయినవాడికి పునర్జన్మమూ కలుగుతాయి.

నైతే సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున || 27

పార్థా ! ఈ రెండుమార్గాలూ తెలిసిన యోగి ఎవడూ మోహంలో పడడు. అందువల్ల నీవు నిరంతరం ధ్యానయోగంలో వుండు.

వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ || 28

దీనినంతా గ్రహించిన యోగి వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలకు చెప్పబడ్డ పుణ్యఫలాలను అధిగమించి, అనాది అయిన పరమపదం పొందుతాడు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "అక్షరపరబ్రహ్మయోగం" అనే ఎనిమిదవ అధ్యాయం సమాప్తం.

గంగా తరంగ రమణీయ జటా కలాపం,గౌరీ నిరంతర విభూషిత వామ భాగంనారాయణ ప్రియ మనంగ మదాపహారంవారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

గంగా తరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: గంగా నదీ అలలను తన జటాఝూటంలో అందంగా కలిగిన, తన ఎడమ వైపు పార్వతీ దేవి ఎల్లప్పుడూ శోభించే, శ్రీహరికి ప్రియుడైన, మన్మథుని గర్వము అణచిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

లక్ష్మీ శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర - తాత్పర్యం

లక్ష్మీ శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర - తాత్పర్యం



లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం

దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం  


ప్రతి పదార్ధం: లక్ష్మీం = విష్ణు పత్నియైన శ్రీ మహాలక్ష్మి; క్షీర సముద్ర రాజ = పాలసముద్రమునకు రాజు; తనయాం = కుమార్తె; శ్రీ రంగ = శ్రీ రంగంలోని శ్రీ రంగనాధుని/నాయకుని; ధామ = గృహము (గుడి); ఈశ్వరి = నాయిక /అధిపతి; దాసీభూత = దాస దాసీ జనులు /సేవకులు; సమస్త = అందరు; దేవ = దేవ సంబంధమైన / దేవతా; వనితాం = స్త్రీలు; లోకైక = లోకములో ఒకే ఒక / ఉన్నతమైన; దీప = జ్యోతి; అంకురం = మొలక; దీపాంకురాం = ప్రకాశము నిచ్చే చిరు జ్యోతి / చిరు దివ్వె; శ్రీమన్ = శ్రీమంతు రాలైన లక్ష్మీ దేవి; మంద  = చల్లని/నెమ్మదైన; కటాక్ష = చూపులచే; లబ్ధ = పొందిన; విభవత్ = వైభవము; బ్రహ్మ = సృష్టి కర్తయైన బ్రహ్మ; ఇంద్ర = దేవతల  రాజైన ఇంద్రుడు; గంగాధరాం = గంగను ధరించిన వాడు (శివుడు); త్వాం = నిన్ను; త్రై = మూడు; లోక్య = లోకములకు; కుటుంబిణీం = పరివారమైన; సరసిజాం = సరసులోని పద్మము నుండి పుట్టిన (లక్ష్మి); వందే = నీకు నమస్సులు; ముకుంద = విష్ణువు; ప్రియాం = ఇష్టమైన.


తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.

💐 హ్యాపీ ఇంజనీర్స్ డే 💐

🌹 జాతీయ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు 🌹 ఈ విశ్వంలో ఇంజనీరింగ్ యొక్క గొప్పతనాన్ని చాటుతూ, తమ మేధస్సు, సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత మరియు అంకిత...