ప్ర: శ్రీపంచమి అంటే సరస్వతీదేవి ఆవిర్భావ రోజు పుట్టినరోజు
జ: మాఘశుద్ధ పంచమిని సరస్వతీ పుట్టినరోజు గా ఆరాధించడం అనేది మనకు పురాణాలలో, ఇతర శాస్త్రాలలో కనబడుతున్న అంశం.
ఈ మాఘశుద్ధ పంచిమి శ్రీపంచమి అనే పేరు ప్రసిద్ధిగా కనిపిస్తున్నది. ఈ రోజున సరస్వతీదేవి ఆవిర్భావ దినంగా దేవీభాగవతం, బ్రహ్మవైవర్తపురాణం ప్రస్తావిస్తున్న అంశములు. పరమపురుషుని వదనం నుండి సరస్వతీదేవి ఆవిర్భవించింది అని కథ. ఇందులో ఉన్న సంకేతార్థం ఏమిటంటే ఈ జగతి అంతటికీ కారణమైన పరమేశ్వరుడు, విరాట్పురుషుడు.... ఆయన వాక్కు, బుద్ధి, జ్ఞానము ఈ మూడిటి స్వరూపమే సరస్వతి. 'వాగ్బుద్ధిజ్ఞానాధిష్ఠాత్రి'. మనం కూడా ఏదైనా పని చేయాలంటే మన నుండి రకరకాల శక్తులు వ్యక్తమవుతుంటాయి.
మనకు ఒక పని చేయడానికి మన వాక్కు, బుద్ధి, జ్ఞానము ఎలా కావాలో.... ఈ విశాలమైన విశ్వం సృష్టిస్థితిలయలు చేయడానికి పరమేశ్వరునికి కూడా ఒక జ్ఞానము, వాక్కు, బుద్ధి ఉన్నాయి. ఆ బుద్ధి, జ్ఞానరూపంలో ఏ శక్తి ఉన్నదో దానిని మనం సరస్వతి అని ఉపాసన చేస్తున్నాం.
ఆ సరస్వతి ఈ మాఘశుద్ధ పంచమినాడు విరాట్పురుషుని నుండి ఆవిర్భవించింది - అని మనకు శాస్త్రం చెప్తున్న వాక్యం. అందుకే ఈ రోజున సరస్వతీదేవి ఆరాధన అత్యంత ప్రశస్తిగా ఉన్నది. కేవలం భూలోకమానవులు మాత్రమే కాకుండా దేవలోకంలో వారు కూడా ఈ రోజు సరస్వతీదేవిని ఆరాధిస్తారు అని దేవీభాగవతం చెప్తున్నది. కాబట్టి ఈ రోజున సరస్వతీ ఆవిర్భావదినంగా ప్రతివారూ - అందునా విద్యార్థులు, పెద్దవారు అందరూ - కూడా అమ్మవారిని వివిధ విధాలుగా పూజించాలి అని శాస్త్రం చెప్తున్న విషయం.
తెల్లని కలువలు తో లేదా మంచి సుమాలతో పూజ చేసి పాయసాన్నము నివేదించాలి.
పిల్లలతో తప్పక ఆచరింప చేయవలసిన పూజల లో ఈ సరస్వతి పూజ విశేషమైనది.
పూజ్య గురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనం నుండి 🙏🏻 సేకరణ...
No comments:
Post a Comment