*మానవుడు తాను అనుభవిస్తున్న పాప పుణ్యాలకు, జన్మకు కర్మకు జన్మ జన్మలకు సంబంధాన్ని ధర్మశాస్త్రాల ఆధారంగా వివరణ ఇవ్వండి.*
భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తే పుణ్యం, ఆయనకు ఇష్టం కాని పనులు చేస్తే పాపం వస్తాయి.
భగవంతుడు మనకిచ్చిన వేదాలు, ధర్మశాస్త్రాలు ఆయన ఇష్టాయిష్టాలను తెలియచేస్తాయి. స్థూలంగా చెప్పాలంటే ఎదుటివారికి మంచిచేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం వస్తాయి. కర్మ అంటే మనం చేసే పని. అంతేకాదు... ఆ పని చేయడానికి మనం చేసే ఆలోచనలు కూడా కర్మలే. కర్మ మనం చేసే చర్య, ప్రతి చర్య గొలుసులాంటిది. ఈ గొలుసు తెగితేనే ముక్తి.
మన జన్మకు, కర్మకు అవినాభావ సంబంధం ఉంటుంది. మన జన్మతో పాటే చేసుకున్న కర్మ కూడా వస్తుంది. ఈ కర్మ మూడు విధాలు. సంచిత కర్మ, ప్రారబ్ధకర్మ, ఆగామి కర్మ.
వెనుక జన్మలలో చేసుకున్నది సంచితం. సంచితంలో నుంచి ఈ జన్మలో మనం అనుభవించడానికి వచ్చేది ప్రారబ్ధం. ఈ జన్మలో చేసుకుని, వచ్చే జన్మలో అనుభవానికి వచ్చేది. ఆగామి.
అయితే కొన్ని కర్మలు, వాటి ఫలాలు ఈ జన్మలోనే అనుభవానికి వస్తాయి. ఎలాగంటే నేరస్థుడికి న్యాయస్థానం కఠినశిక్ష విధిస్తుంది. అంటే ఈ జన్మలోనే కర్మఫలాన్ని పొందినట్లు, ఆ శిక్ష అతడికి సరైనది కాకపోతే, శిక్షపడేలోగానే అతడు మరణిస్తే కర్మఫలం వచ్చే జన్మకు బదిలీ అవుతుంది.
అలా జన్మజన్మలకు పేరుకపోయిన మన కర్మల ఫలితాలనే మనం అనుభవిస్తాం. అదే భగవంతుని కృప ఉంటే మన ప్రారబ్ధాన్ని సుఖంగా అనుభవించే శక్తిని ఆయన ప్రసాదిస్తాడు. కర్మసిద్ధాంతం మూలసూత్రం ఏంటంటే, కర్మలు చేసేది మనమైతే దాని ఫలితాలను ఇచ్చేది భగవంతుడు.
అందుకే ఆ భగవానుడిపై భారంవేసి, అన్నీ మంచి పనులు చేసి లోకహితం చేకూర్చడానికి మనం పాటుపడాలి. ఏవైనా తప్పులు చేస్తే పశ్చాత్తపపడాలి. మరొక్కసారి మన వల్ల అలాంటి తప్పులు జరగకుండా నడుచుకోవాలి.
No comments:
Post a Comment