Friday, August 20, 2021

శ్రీ గరుత్మంతుడి కధ -12 వ భాగం 💥వివిధ_గ్రంధాలలో_గరుత్మంతుని_ప్రస్తావనా

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -12 వ భాగం 

    💥వివిధ_గ్రంధాలలో_గరుత్మంతుని_ప్రస్తావనా

🌹వేదాలు
అధర్వణ వేదంలో గారుడోపనిషత్తు ఉంది. అందులో వైనతేయుడైన గరుడుడు విషదహారి అని చెప్పబడింది. గరుత్మంతుని స్వరూపం, అతని ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా చెప్పారు..

దక్షిణ పాదము స్వస్తికము, ఎడమపాదము కుంచితముగా ఉండి విష్ణువుకు నమస్కరిస్తున్న, హరికి ఇష్టుడైన గరుత్మంతునికి నమస్కరించెదను. అతనికి అనంతుడు వామకటకము, వాసుకి యజ్ఞసూత్రము. తక్షకుడు  కటిసూత్రము, కర్కోటకుడు హారము. దక్షిణ కర్ణమున పద్ముడు, వామకర్ణమున మహాపద్ముడు, తలమీద శంఖుడు, భుజముల మధ్య గుళికుడు ఉన్నారు. అతడు నాగులచే సేవింపబడుచున్న కపిలాక్షుడు. నాగాభరణ భూషితుడు. బంగారు కాంతి కలవాడు. పొడవైన బాహువులు, పెద్ద మూపు, మోకాళ్ళనుండి బంగారు రంగు కలిగినవాడు. మొలపైన తెలుపు రంగు, కంఠము వరకు ఎరుపు రంగు, వంద చంద్రుల కఅంతిగల ముక్కు, కిరీటము ఉన్నవాడు. విష్ణువునకు వాహనుడు. గరుత్మంతుని పేరు తలచినంతనే సర్వవిషములు హరించిపోతాయి.

🌹పురాణాలు_రామాయణం

రామాయణం యుద్ధకాండలో నాగబంధవిమోచన అనే ఘట్టం ఉంది. ఈ భాగం పారాయణకు శ్రేష్టమైన భాగాలలో ఒకటిగా భావిస్తారు.

ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేసి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. రామలక్ష్మణుల దేహంపై ప్రతి అంగుళం బాణాలతో నిండిపోయింది. వానరసేన సిగ్గువిడిచి పరుగులు తీసింది. ఆ నాగాస్త్ర బంధాలనుండి తప్పుకోవడం ఎవరివల్లా కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తండ్రివద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్యం చేసేశానని చెప్పాడు. భయభీతులైన వానరులంతా రాఘవుల చుట్టూ కూర్చుని దుఃఖించసాగారు. కొద్దిగా సృహ వచ్చిన రాముడు లక్ష్మణుని చూచి వ్యాకులపడి, తన ప్రతిజ్ఞలన్నీ మిధ్యలయ్యాయని వగచి, ప్రాయోపవేశానికి సిద్ధనయ్యాడు. తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపి వానరులను తిరిగి వెళ్ళిపొమ్మన్నాడు. వారు శక్తి వంచన లేకుండా మిత్ర కార్యం నిర్వహించారని, అయినా ఈశ్వరాజ్ఞ ఉల్లంఘించరానిదని చెప్పాడు. వానరులందరూ కళ్ళనీళ్ళు పెట్టుకొన్నారు. శరతల్పగతులైన రామలక్ష్మణులను చూచి విభీషణుడు హతాశుడయ్యాడు. సుగ్రీవుడు మాత్రం విభీషణుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు.

అంతా విషణ్ణులైన సమయానికి పెద్ద సుడిగాలి వీచి సముద్రం  కల్లోలమయ్యింది. గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చాడు. అతని రాకతో శరరూపంలో రామ సౌమిత్రులను పట్టుకొని ఉన్న సర్పాలన్నీ పారిపోయాయి. గరుడుడు తన రెండు చేతులతోను రామలక్ష్మణుల సర్వావయవాలను నిమిరాడు. వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటి కంటే ఎక్కువ తేజస్సు, బల వీర్య పరాక్రమాలు సమకూరాయి. వారిని కౌగలించుకొని గరుడుడు - "మీరు జాగరూకతతో ఉండండి. నేను మీకు స్నేహితుడనెలా అయ్యానో తరువాత తెలుస్తుంది. రామా! నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి సీతను పొదడం తథ్యం" - అని చెప్పి, రామలక్ష్మణులకు ప్రదక్షిణం చేసి ఆకాశానికి ఎగిరి పోయాడు..

🌹మహాభారతం

మహా భారతం ఆది పర్వములో సర్పయాగానికి ముందుగా వినత, కద్రువుల వృత్తాంతము, గరుత్మంతుని కథ చెప్పబడింది. భగవద్గీత విభూతి యోగము 30వ శ్లోకములో కృష్ణుడు తాను వైనతేయశ్చ పక్షిణామ్ - పక్షులలో నేను వినతాసుతుడైన గరుత్మంతుని - అని తెలిపాడు..

🌹సంప్రదాయాలు 

గరుడారూఢుడైన విష్ణువు - బ్యాంగ్‌కాక్, థాయిలాండ్లో ఒక విగ్రహం
సాధారణంగా విష్ణువు ఆలయాలలో మూలవిరాట్టు విగ్రహానికి అభిముఖంగా గరుత్మంతుని విగ్రహం ఉంటుంది. శ్రీవైష్ణవ చిహ్నాలలో ఊర్ధ్వపుండ్రాలకు ఇరుప్రక్కలా శంఖ చక్రాలు, వానికి ఇరుప్రక్కలా హనుమంతుడు, గరుత్మంతుడు ల బొమ్మలు చూపుతారు.

పండుకొనేముందు ఈ శ్లోకం పఠించే సంప్రదాయం ఉంది. ఇందులో గరుత్మంతుని స్మరణ కూడా ఉంది.

రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనే యః పఠేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి.

🦅🦅🦅🦅🦅🦅🦅

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...