Monday, June 8, 2020

సింహాచలం

సింహాచలం

విశాఖకు ఉత్తరంగా సుమారు 20కి.మీ, దూరంలో సముద్రమట్టానికి 243 మీటర్ల ఎత్తులో సమున్నతంగా ఒక కొండమీద వెలసిన  లక్ష్మీనరసింహస్వామి శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన వరాహ నృసింహస్వామి క్షేత్రం. ఈ ప్రాంతంవారికి ఈ స్వామి అంటే ఎంతో గురి. విశాఖజిల్లాలోని వారంతా ఈ స్వామిని భక్తితో, ఆప్యాయంగా సింహాద్రి అప్పన్నగా పిలుచుకుంటూ ఈ స్వామిపేరే ఎక్కడచూచినా పెట్టుకుంటూ వుంటారు. ఇక్కడి సుప్రసిద్దుల నుండి పూరిపాకల్లో వుండేవారు సైతం ఈ స్వామి వారి పేరులేకుండా వుండరు. కొండమీద గంగ, గోదావరి, కూర్మ, మాధవ, ఆకాశధారలను హనుమద్ధ్వారము వరకూ చూడవచ్చు. సింహాద్రి అప్పన్న దేవాలయం 11వ శతాబ్ధపుకాలం నాటిది అంటున్నా ఆలయం ఇంకా పురాతనకాలానికి చెందినదిగా భావించబడుతుంది. హిరణ్య కశిపుని వధానంతరం భక్తశ్రేష్టుడైన ప్రహ్లాదునిచేత ప్రతిష్టితమైనదిగా చెప్పుకుంటారు. స్వామి ఉగ్రత్వమును శాంతింప జేయటానికి విగ్రహానికి ప్రతి నిత్యమూ చందనపు పూత పూస్తుంటారుట. 

స్వామికి వైశాఖ శుద్ధ తదియనాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంవత్సరమంతా చందనంతో మెత్తి వేయబడి వున్న స్వామి నిజరూప దర్శనం ఆనాడే జరుగుతుంది. దీన్నే గంధవలుపు ఉత్సవం అని కూడా అంటారు. స్వామిని ఈ రోజున దర్శించటానికి లక్షలాది యాత్రికులు వస్తారు. కొన్ని వ్యాధులు సైతం నయంకాగలవని ఒక గట్టి నమ్మకం. ఆ రోజున స్వామివారి దివ్యానుభూతి భక్తులకు వెచ్చగా స్పృశ్యమవుతుందట. చాళుక్యరీతి శిల్ప వైభవం ఆలయమంతా కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. శ్రీ కృష్ణదేవరాయలు సైతం ఈ క్షేత్రాన్ని దర్శించి పునీతుడై, సంతుష్టాతరంగంతో కొన్ని గ్రామాలు స్వామివారి భోగముల నిమిత్తం భక్తితో సమర్పించారట, మరెన్నో సువర్ణాభరణాలు భక్తిమేర చేయించారట. చైత్రమాసంలో రధోత్సవాదులు జరుగుతాయి. విశాఖ నుండి నేరుగా కొండమీదికి బస్సులున్నాయి. వుండటానికి కొండమీద చందన రెస్టు హౌస్, A.P.T.T.D.C. వారి తాలూకు, దేవస్ధానం కాటేజీలు, జిల్లా పరిషత్తువారి గెస్టుహొం మొదలైనవి ఉన్నాయి. ప్రకృతి రమణీయంగా కన్నులు పండుగగా కనబడుతూంది. స్వామి దర్శనార్ధం ప్రతిరోజూ భక్తులు యాత్రికులు కోకొల్లలు వస్తూనే వుంటారు. ఎప్పుడూ జనసందోహంతోటి కిటకిటలాడుతూంటుంది.

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...