Monday, June 8, 2020

తోలు వస్తువులు వాడుతున్నారా?

జంతువుల నుంచి తోలు సేకరించి, తోలు వస్తువులను తయారు చేయడంలో అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. దాని గురించి నేను గత నెలలోనే ఒక పోస్ట్ రాసాను. మనలో ఎంతమంది తోలు వస్తువులను ఇక మేము కొనుగోలు చేయము అని తీర్మానించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? 

తోలు వస్తువులు వాడుతున్నారా?

ఇప్పుడు మనమంతా కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో తోలు (లెధర్) వాడకాన్ని తగ్గించాము, లేదా ఆపివేశాము. అసలు ముందు లెధర్ ఎలా తయారవుతుందో తెలుసుకుని, అప్పుడు మన సంస్కృతిలో దాని స్థానం ఏంటో చూద్దాము.

లెధర్ పరిశ్రమలో తోలు కోసం పంది, పాము, మేక, గేదె, మొసలి, ఆవు, కంగారు మొదలైన అనేక జంతువులు వధించబడతాయి. కానీ తోలు కోసం అత్యధికంగా వధించబడేది ఆవు. ఇది అందరూ అంగీకరించే సత్యము. ఒక్క అమెరికాలోనే ఏటా తోలు కోసం 13.9 కోట్ల అవులు, దూడలు, మేకలు, గొఱ్ఱెలు వధించబడతాయి.

గోవు నుంచి తోలు తీసే ప్రక్రియ మీకు తెలుసా?

గోవులను నీటిలో శుభ్రం చేసే నీటి పంపుల వద్దకు తెస్తారు. శుభ్రం చేసే సమయంలో నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. బయట 40 డిగ్రీలు ఉంటేనే తట్టుకోలేకపోతున్నాము. మరి దానికి 5 రెట్లు వేడి. ఇంతటి ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని గోవులపై ధారగా పోస్తారు. ఈ విధంగా చేసినందువల్ల వీటి చర్మం నునుపెక్కి వొలచటానికి సులభమౌతుంది. కానీ, ఈ సమయంలో అవి (గోవులు) ఎంతో భయంతో బిక్కచచ్చిపోయి ఉండే హృదయ విదారకమైనస్థితి. గోవుగా ఎందుకు పుట్టామా అన్నట్టు, ఇంకా ప్రాణం ఎందుకు పోలేదని రోధిస్తున్న వైనం... భూమి మీద జాలి, దయ, కరుణ అన్నవి మృగ్యమైపోయిన వైనం...రాక్షసత్వానికి పరాకాష్ట.

ఆ తర్వాత గొలుసులతో ఉన్న కొక్కాలకు ఒక్కొక్క గోవును తలక్రిందులుగా ఒక్కొక్క కాలుని ఆ కొక్కాలకు తగిలించి వేలాడదీస్తారు. రక్తం ఏకధాటిగా ఏరులై పారుతున్నా గోవు పూర్తిగా చనిపోదు. గోవులను పూర్తిగా చంపిన తర్వాత వాటి చర్మము ఉబ్బి గట్టిపడుతుంది. అటువంటి చర్మము మార్కెట్టులో తక్కువ ధర పలుకుతుంది. కాని ప్రాణమున్నప్పుడే వొలిచిన గోవుల చర్మము చాలా పలుచనగా ఉండటమే కాదు, వాటి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్టులో అత్యంత ఎక్కువ ధర పలుకుతుంది. ఒకప్రక్క గోవుల మెడలు సగం తెగి రక్తం కారుతుంటే, మరొకప్రక్క గోవుల కడుపులో రంధ్రం చేసి, అందులోకి అతివేగంగా గాలిని జొప్పిస్తారు. అప్పటికి గాని గోవు లోపలి భాగాలు ఉబ్బి, చర్మం వొలవటం అనే పక్రియ సులభతరం కాదు. చర్మం పూర్తిగా వొలిచిన తర్వాత బ్రతికి ఉన్న ఆ గోవులను నాలుగు భాగాలుగా (తల, కాళ్లు, మధ్యభాగము, తోక) ముక్కలు చేస్తారు. అప్పుడు వాటి మాంసాన్ని ప్రాసెస్ చేస్తారు.

పాములను చంపి తోలు తీసే ప్రక్రియ - బ్రతికి ఉన్న పామును చెట్టుకు మేకుతో కొట్టి, శరీరం మీద చర్మాన్ని నిలువునా వొలిచేస్తారు.

గర్భం ధరించిన ఆవులు, ఆడగొఱ్ఱెల కడుపులో ఉండే దూడల చర్మం 'విలాసం' (luxury leather item) గా చెప్పబడుతోంది. అందుకే అనేక ఆవులు మరియు గొఱ్ఱెలకు కృతిమ గర్భధారణ చేయించి, కావాలని గర్భవిచ్ఛితి (అబార్షన్) చేస్తారు.

తోలు కోసం ప్రత్యేకమైన ప్రదేశాల్లో మొసళ్ళను పెంచుతారు. వాటి జీవితకాలం ఎక్కువే అయినా, 2-4 ఏళ్ళు రాగానే వాటిని వధశాలకు పంపిస్తారు. అవి బ్రతికి ఉండగానే వాటిని సుత్తి, గొడ్డలి వంటి వాటితో కొట్టి కొట్టి చంపుతారు. చాలా సందర్భాల్లో సజీవంగానే వాటి తోలు ఒలుస్తారు. ఆ తర్వాత అవి చాలా సమయం వేదన అనుభవించి మరణిస్తాయి.

ప్రపంచంలో ఈరోజు అధిక హింసను ప్రేరేపించే పరిశ్రమల్లో డైరి ఒకటి. ఎప్పుడైతే ఆవు వట్టిపోతుందో (పాలు ఇవ్వడం ఆపివేస్తుందో) అప్పుడు దాన్ని వధశాలకు తరలిస్తారు. చాలా సందర్భాల్లో డైరీ పరిశ్రమలో ఆవుకు ఆడదూడ పుడితే దాన్ని రక్షిస్తారు. అదే కోడె దూడ పుడితే, దాన్ని మరుక్షణమే వధశాలకు పంపుతారు. అప్పుడే పుట్టిన లేగదూడల మాంసానికి, వాటి తోలుకు ఉన్న డిమాండే దీనికి కారణం. కొన్ని సందర్భాల్లో వీటి మాంసాన్ని చాక్లెట్స్‌లో కలుపుతారట. మనం ఇప్పుడు వ్యవసాయంలో ఎద్దుకు బదులు కాలుష్యం విడుదల చేసే ట్రాక్టర్ వాడుతున్నాము. కనుక ఎడ్ల అవసరం తగ్గింది, ఇక ఎడ్లను ఎవరు పెంచుతారు? ఎడ్ల వధకు ఇది కూడా ఒక కారణం.

ఇలా మనకు తోలు ఉత్పత్తులు రావాలంటే దాని వెనుక ఎంతో హింస ఉంటుంది. అలాంటి హింసతో కూడిన వస్తువులను ఆలయంలోకి తీసుకెళ్ళవచ్చా? అది మృతదేహం కాదా ? మన గోవును పూజిస్తాము, నాగదేవతను పూజిస్తాము, కాలభైరవుడిని పూజిస్తాము. మీరు వాడే తోలు వస్తువుల్లో గోవు, పాము, కుక్క తోలు ఉండదని మీకు ఖచ్ఛితంగా చెప్పగలరా ? లేదు కదా ! తోలు వస్తువులను వాడటమంటే జంతువధను సమర్ధించడం కాదా ? గోహత్యా పాతకం సంగతేంటి?

ఒకప్పుడు మనవాళ్ళు తోలు చెప్పులను వాడేవారు వేరే ప్రత్యామ్నాయం లేక. అప్పటికీ శుభాశుభకార్యాల్లో ఎక్కడా చెప్పులు వేసుకోరు. చెప్పులు వేసుకుని వెళ్ళవద్దనే చెప్పారు. కానీ ఈరోజు మనం వాడే సెల్ఫ్‌ఫోన్ కవర్, బెల్ట్, పర్సు, హ్యాండ్ బ్యాగ్ మొదలుకుని ఇంట్లో ఉపయోగించే సోఫాల వరకు విలాసం, పరపతి పేరుతో తోలు వస్తువులు వాడుతున్నాము. దేవతలు ఆవాహన చేసిన ఆలయాలు, యజ్ఞయాగాదుల వంటివి జరిగే పవిత్ర ప్రదేశాలకు అలాంటివి ధరించి, తీసుకుని వెళ్ళడం ఎంతవరకు సమంజసం? తోలు ఉత్పత్తులను ప్రోత్సహించడమంటే హింసను సమర్ధించడమే. ఇప్పుడు తోలు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలు వచ్చాయి. వాటిని వాడవచ్చు కదా. ఆలోచించండి.

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...