Sunday, June 14, 2020

ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన

Y: ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం: గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.

శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.

శనివారం: శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు. పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...