*సంపద-సుఖం*
ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! లోకంలో ధనికులు, పేదవారు ఉన్నారు కదా ! ఎవరు ఎక్కువగా సుఖపడుతున్నారు ? " అని అడిగాడు.
భీష్ముడు " ధర్మనందనా! ధనవంతులు, పేదవాళ్ళను త్రాసులో ఉంచి తూచినప్పుడు ముల్లు పేదవారి వైపే మొగ్గుతుంది. సంపన్నులకు పేదవారికి ఉన్న గుణదోషాలు చెప్తాను విను. ధనము, సంపద, ఆస్తులు కలిగిన వాడు ఎప్పుడూ తన సంపదను ఎవరు దోచుకుంటారో అని కలత చెందుతూ ఉంటాడు. ఎప్పుడూ మృత్యు ముఖంలో ఉన్నట్లు అశాంతిగా ఉంటాడు. ధనవంతుడు ఉన్నది చాలక అత్యాశకు పోయి మనసు వికలం చేసుకుంటాడు. ధనాన్ని కాపాడు కోవడానికి నిరంతరం చింతిస్తుంటాడు. ధనకారణంగా ఎప్పుడూ ఆగ్రహానికి గురి ఔతాడు. కనుక ధనవంతులకు సుఖం దొరకడం కఠినమే. ధనంలేని వాడు స్వతంత్రుడు, నిర్భీతికలవాడు, ఆగ్రహం రానివాడు, సకల ప్రదేశములలో సంచరించ గలవాడు. మోసం చేయాలన్న ఆశలేక, అత్యాశలకుపోక ప్రశాంత చిత్తతంతో ఉండగలడు. కనుక పేదవాడే సుఖవంతుడు. ధనం చంచలమైనది కనుక తరిగి పోతూ ఉంటుంది. కనుక అది దుఃఖ కారకం. ధనం శాశ్వతం కాదని తెలుసుకుని దాని మీద వ్యామోహం విడిచిన వాడు సుఖవంతుడు.
*ధనతృష్ణ*
ధర్మరాజు " పితామహా ! ధనతృష్ణతో కొట్టుకులాడే జీవి ఎప్పుడు సుఖాన్ని పొందగలడు' అని అడిగాడు.
భీష్ముడు " ధర్మజా ! ధనము సంపాదించి సంపాదించి విసుగుపుట్టి ధనం సంపాదించడం మానుకున్నప్పుడే మానవుడికి సుఖం కలుగుతుంది. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో మంకి అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడికి ధనాపేక్ష అధికం. అందు వలన అతడు రెండు కోడెదూడలను కొని వాటిని తాళ్ళతో బంధించాడు. ఒక రోజు అవి తాళ్ళతో కలిసి పారిపోయాయి. అవి పడుకుని ఉన్న ఒంటెను దాటబోయే సమయానికి అది పైకిలేచి నిలబడిన కారణంగా కోడెదూడలు వాటిమెడకు కట్టిన తాళ్ళకారణంగా దూడలు చనిపోయి ఒంటె మెడకు రెండు వైపులా వేలాడసాగాయి. అది చూసిన బ్రాహ్మణుడు హడలిపోయి తాను ప్రేమగా పెంచుకున్న దూడలు చనిపోవడం చూసి అక్కడ చేరిన జనులతో " అయ్యలారా ! నేను నా ప్రతిభతో ధనం సంపాదించాలి అనుకున్నాను, కానీ అది సాధ్యం కానిది అని తేలి పోయింది. మానవుని ఉన్నతికి దైవానుగ్రహం ఉండాలి కాని మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా వ్యర్ధమే కదా ! కనుక దైవం మీద భారంవేసి మన ప్రయత్నాలు చేయాలి. కోరిక వదలక ఉన్న సుఖం ఉండదు. కోరికలకు మూలం మనస్సంకల్పం. మనస్సులో సంకల్పం లేకుండా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. కోరికలు లేకున్న ధనంతో పని లేదు. కనుక ధనాపేక్ష లేని వాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు. ధనం సంపాదించే కొలదీ తృష్ణ పెరుగుతుంది, దానిని దాచాలన్న తాపత్రయం కలుగుతుంది. కనుక అంతు లేని కోరికలను వదిలిన శాశ్వత ప్రశాంతత పొందగలడు. నేను ధన సంపాదనాపేక్షతో తెచ్చిన దూడలు చనిపోగానే నా లోని ధనాపేక్ష తగ్గింది. నాలో ధనతృష్ణ తగ్గింది, ఇంద్రియ నిగ్రహం కలిగింది, నాలో సహనం కలిగింది, ఇక నాకు లోభం అంటదని సమాధానపడి శేషజీవితం ప్రశాంతంగా గడిపాడు.
No comments:
Post a Comment