*శ్రీమద్ భాగవతం - ప్రథమ స్కంధము*
*కృష్ణ నిర్యాణంబు వినుట*
*1-366-సీ.సీస పద్యము*
పందికై పోరాడ ఫాలాక్షుఁ డెవ్వని;
బలమున నా కిచ్చెఁ బాశుపతము?
నెవ్వని లావున నిమ్మేన దేవేంద్రు;
పీఠార్థమున నుండ బెంపుఁ గంటిఁ?
గాలకేయ నివాత కవచాదిదైత్యులఁ;
జంపితి నెవ్వని సంస్మరించి?
గోగ్రహణము నాఁడు కురుకులాంభోనిధిఁ;
గడచితి నెవ్వని కరుణఁ జేసి?
*1-366.1-ఆ.*
కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల
తలలపాగ లెల్లఁ దడవి తెచ్చి
యే మహాత్ము బలిమి నిచ్చితి విరటుని
పుత్రి యడుగ బొమ్మపొత్తికలకు?
*భావం:*
అన్నా! ఆ నాడు వరాహం కోసం సాగిన సమరంలో ఫాలనేత్రుని వల్ల పాశుపత మహాస్త్రాన్ని ఆయన దయవల్లనే కదా అందుకొన్నాను. త్రిలోకాధిశుడైన దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని అయన అనుగ్రహం వల్లనే కదా అధిష్ఠింప గలిగాను. కాలకేయుడు, నివాతకవచుడు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలం వల్లే కదా పరిమార్చాను. ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగి వచ్చిన కౌరవ సేవావాహినిని ఆయన కరుణాకటాక్షం వల్లనే కదా దాటగలిగాను. ఆనాడు బొమ్మ పొత్తికలను తెమ్మని ఉత్తర అడిగితే కర్ణ సైంధవ సుయోధనాదుల పట్టుకుచ్చుల తలపాగలు కోసి తెచ్చి ఆమె ముద్దు చెల్లించగలిగింది. ఆ పరమ పురుషుని దయవల్లనే కదా.
No comments:
Post a Comment