*శ్రీమద్ మహాభారతం - 652 - కర్ణపర్వం-45*
*కౌశికుని కథ*
పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. వాడికి పెద్దలు చెప్పిన మాటలు వినే అలవాటు లేదు. తాను నమ్మిందే ఆచరిస్తాడు. అతడు ఒకసారి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. కొంత మంది దొంగలు దారిన పోయే బాటసారులను తరుముకుంటూ వస్తున్నారు. బాటసారులు తమ తమ ధనము ఆభరణముల మూటలతో ఆశ్రమ సమీపములోని పొదలలో దాక్కున్నారు. బాటసారులను వెదుక్కుంటూ వచ్చిన దొంగలు తాము తరుముతూ వస్తున్న బాటసారులు ఎక్కడ ఉన్నారని కౌశికుని అడిగారు. కౌశికుడు ధర్మాధర్మ విచక్షణ లేని వాడు కావడం చేత తనకు అసత్యదోషం చుట్టుకుంటుందని అనుకుని వారు పొదల మాటున దాక్కున్న విషయం చెప్పాడు. దొంగలు బాటసారులను చంపి వారి ధనమును దోచుకున్నారు. మరణానంతరం కౌశికుడు ఘోరనరకానికి పోయారు. కనుక అర్జునా! *హింసకు కారణమయ్యే సత్యము ధర్మం అనిపించుకోదు. సత్యాసత్యం, ధర్మాధర్మం గురించిన విచక్షణ పెద్దల చేత నిర్ణయించ బడాలి కాని ఎవరికి వారు వారికి తోచినట్లు చేయకూడదు. కనుక నీవు నీ అన్న ధర్మరాజును వధించుట ధర్మం కాదు* " అన్నాడు.
*అర్జునుడు శాంతి పొందుట*
అప్పటికి శాంతించిన అర్జునుడు " కృష్ణా ! నన్ను మన్నించు. తల్లీ తండ్రి వలె నాకు హితవు చెప్పి నేను అనుచిత కార్యము చేయకుండా కాపాడావు. లేకున్న ఘోరం జరిగి పోయేది. కాని కృష్ణా ! జనులు నన్ను చేసిన ప్రతిజ్ఞ కాపాడని వాడని నిందించకుండా నాకు , నా అన్న ధర్మజునికి ఆపద వాటిల్లని చక్కని మార్గం సూచించు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! ధర్మజుడు కర్ణుని వాడి బాణములతో బాధించడమే కాక నీచమైన మాటలతో నిందించాడు కనుక ఆ బాధ భరించ లేక ఏవో మాటలు అన్నాడే కాని నీ మీద ప్రేమ లేక కాదు. నీకు అన్న ప్రభువు. మిమ్ములను తండ్రివలె కాపాడే వాడు. అతడు నిన్ను అనకూడదా! నీవు పడకూడదా! అతడి వంశోద్ధారకులైన నీవు, భీముడు, నకులసహదేవులు అతడి వశంలో ఉంటారు కదా ! మీ మీద కోపం ఎందుకు ఉంటుంది. ఆయనను చంపడానికి నీవు కత్తి ఎత్తావు కదా ! ఆ భావన మనసులో ఉంచుకుని నీ అన్నయ్యలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ నిందించు. కాని ఆ మాటలు మనసులో పెట్టు కోవద్దని వినయముగా నమస్కరించు. ఆ తరువాత నీకు అనృత దోషం పోయి నీ మనస్సు శాంతపడుతుంది. ఆ పై మనం కర్ణుడిని చంపడానికి వెళదాము.
No comments:
Post a Comment