మనసే మంత్రం*
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
మనకున్న జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు కదా! ఈ పది ఇంద్రియాలతోపాటు భగవంతుడు మనకు ప్రసాదించిన మరో ఇంద్రియం మనసు. అది కంటికి కనబడకుండానే అనేక ఇంద్రజాల మహేంద్రజాలాలను అనుభూతిలోనికి తెస్తుంది.
సాక్షాత్తు పరమశివుడినే ద్వంద్వయుద్ధంలో జయించి, పాశుపతాస్త్రాన్ని వరంగా పొందిన అర్జునుడిని సైతం 'కృష్ణా! నా శరీరం వణుకుతున్నది; నాలుక పిడచకడుతోంది... కళ్లు బైర్లు కమ్ముతున్నాయి... గాండీవం చేతినుంచి జారిపోతున్నది' అనేట్లుగా బలహీనుడిని చేసింది అతడి మనసే!
ఉత్తరగోగ్రహణ సమయంలో అర్జునుడి వైపు ఒక్క ఉత్తరకుమారుడు మాత్రమే ఉండగా- కౌరవుల వైపున భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ దుర్యోధన దుశ్శాసన కర్ణాది కురువృద్ధులు, గురువృద్ధులు అందరూ ఉన్నారు. ఆనాడు ఆ వీరాధివీరులనందరినీ ఒకే ఒక్క అస్త్రంతో మూర్ఛిల్లజేసేంత గుండెధైర్యాన్ని అర్జునుడికి ఇచ్చిందీ అతడి మనసే!
'సాగితే బండి; సాగకపోతే మొండి' అనేది మనసుకున్న లక్షణం. అది ఉత్సాహంగా ఉన్నదా, మనిషిని నక్షత్రమండలం దాకా పెంచగలదు. పిరికితనం ముసిరిందా, పాతాళలోకందాకా కుంగదీయగలదు. మనిషిని గుడిగోపురంలాగా, గిరిశిఖరంలాగా నిటారుగా నిలబెట్టగలది మనసే! కూకటివేళ్లతో సహా కూలిపోయిన వృక్షంలాగా నేలమీద పడవేయగలదీ మనసే!
పురాణాలను దాటి వర్తమానంలోకి వద్దాం! మనకందరికీ అనుభవంలో ఉన్న విషయమే! మన అబ్బాయి- పది పదకొండు సంవత్సరాలవాడు మనం ఇంట్లో లేని సమయంలో సైకిల్ వేసుకొని బజారుకు వెళ్లాడు. ఇంటికి రాగానే మనకు ఆ సంగతి తెలిసింది. అంతే! గుండెలో గుబులు మొదలు... 'బజారులోనా బండ్ల రద్దీ ఎక్కువ. వీడా పసివాడు, బండిని జాగ్రత్తగా నడుపుతాడో లేదో! మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన సరిపోదాయె. అవతలి బండివాడు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా! వాడు వీడి మీద పడితే! బతుకంతా వైకల్యమే కదా!...' ఈ ఆలోచనలకు అంతు ఉండదు. ఆలోచిస్తున్నంతసేపూ గుండె దడదడ.
గమ్మత్తు ఏమిటంటే ఇప్పటివరకూ మన పిల్లవాడికి జరిగిన ప్రమాదమేమీలేదు. ఆ ప్రమాదాలన్నీ మన మనసులోనే, మన ఊహలలోనే జరిగి మనకు నరకాన్ని చూపిస్తాయి.
ఇంతలో మన మిత్రుడు వస్తాడు. విషయం తెలుసుకొంటాడు. అతడు తెలుసుకొనే దాకా ఎందుకు? మనమే చెబుతాం. అతగాడు అంతా విని నవ్వుతాడు. 'ఒరే! మీవాడు మా ఇంటికే వచ్చాడురా! మా వాడితో ఆడుకొంటున్నాడు' అని చెబుతాడు. ఇప్పుడు చూడండి. మన ఆవేదన అంతా అరక్షణంలో అదృశ్యం.
ఒకరాత్రి వేళ మనం ఆదమరచి గాఢంగా నిద్రపోతున్నాం. పెద్దపాము ఒకటి మన పొట్టమీదుగా జరజరా పాకుతూ వెళ్లిపోయింది. మనకు కించిత్తయినా భయం కలిగిందా? లేదు! మరొకరోజున బల్లిపిల్ల ఒకటి 'టపీమని మన ఒడిలో పడ్డది. చూశాం. ఏమైంది? గుండె అదిరిపోయింది.
పాము మన మీదుగా వెళితే ప్రశాంతంగా నిద్రపట్టడమేమిటి? బల్లిపిల్ల మీదపడితే గుండె అదరటమేమిటి? అంటే- పాము సంగతి మన మనసుకు తెలియదు. బల్లి సంగతి తెలిసింది. ఇదే తేడా!
మన మనస్సు ఇంద్రజాలికుడి సంచీ. అందులో ఉండని వస్తువు ఉండదు. ఉండని విషయమంటూ ఉండదు. భయం, ధైర్యం, దిగులు, ఆనందం, ఆందోళన, ప్రశాంతత, ఆశ, తృప్తి- అదీ ఇదీ ఏమిటి? అన్నీ ఆ సంచీలోనే ఉంటాయి. హాయిగా నిద్రపోతుంటాయి. దేన్ని మేల్కొలిపితే అది మేల్కొని, మనకు దుఃఖాన్నో ఆనందాన్నో కలిగిస్తుంటుంది.
మనమందరమూ ఈ విషయాన్ని తెలుసుకొని మనసులోని అవలక్షణాలనన్నింటినీ జోకొట్టి నిద్రపుచ్చుదాం. ఆనందాన్ని, ధైర్యాన్ని సంతృప్తినే మేల్కొలుపుదాం. బయటకు తీద్దాం. వాటి తాలూకు ఆనందాన్ని అనుభవిద్దాం! ఆ అనుభూతులను ఇతరులకు పంచిపెడదాం. అప్పుడు మన మనసు మనకొక వరమే అవుతుంది.
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
No comments:
Post a Comment