Friday, April 2, 2021

వాస్తవం


వాస్తవం
                                 ***
ఏవండీ...మీకీ సంగతి తెలుసా...?   మన పక్క ఫ్లాట్ లో ఉండే  కరుణాకర్ గారూ, వసుంధర గారూ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లిపోతున్నారట...   
వాళ్ళుండే  ఫ్లాట్ అద్దెకి ఇస్తారట ప్రస్తుతం అంది భర్త తో..ప్రభావతి..  
అవునా...నీకెలా తెలుసు..నీకు చెప్పారా..?  అన్నారు ప్రభావతి భర్త ముకుంద రావు గారు..
.                              
ఈ విషయం మన పనిమనిషి చెప్పింది అందామె'.
"పోనీలే పాపం,  అక్కడ ఉంటే మంచి కాలక్షేపం, 
కనిపెట్టుకుని చూసే వాళ్ళు ఉంటారు...సేఫ్టీ కూడా...
అన్నారు"  ముకుందం గారు...
:ఏంటో... ఖర్మ కాకపోతే,  ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని దిక్కులేనట్టు... అక్కడ ఉండటం ఏంటో..అంది"  ఆవిడ దీర్ఘం తీస్తూ...
"చూడు..నువ్వు అలా మాట్లాడటం తప్పు...
ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు బ్రతుకుతారు అంతే గానీ ఇలానే బ్రతకాలి అని ఒక రూల్ పెట్టుకుని అందరం బ్రతకడం కష్టం...ఆ రూల్ ఎంత సహేతుకమైనా...
మనం విమర్శించడం మానేస్తే మంచిది"...అన్నారు ముకుందం గారు...
"సరే లెండి ఏదో పక్క వాళ్ళు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకోవడం అంతే... నాకెందుకు...?
సాయంత్రం వంట పని చూసుకోవాలి అంది ఆవిడ తనలో తను మాట్లాడుకున్నట్లు గా పైకే..
ఆవిడ కొడుకూ కోడలు ఉద్యోగాలనుండి రాత్రి 7 దాటాక  వస్తారు...ఈవిడే వాళ్ళొచ్చే టైంకి వంట చేసి పెట్టాలి....
కోడలు చిన్న సాయం కూడా చేయదు...మనవలిద్దరినీ వీళ్లే చూసుకోవాలి.. ఒకడు స్కూల్ కి వెళ్తాడు... రెండో వాడు రెండేళ్ల వాడు....
ఈవిడ ఓపిక లేక,  పిల్లల్ని చూసుకోలేక... పని చేయలేకుండా ఉంటుంది...
'ఆవిడకి పక్కవాళ్ళ మీద అసూయ....చక్కగా ఇద్దరే ఉంటారు లింగు లిటుకు అంటూ...
పనేమీ ఉండదు ఆవిడకి అంతా రెస్ట్ అని ఆవిడ భావన'...
కొన్ని రోజులకే అందరికీ తెలిసింది...
కరుణాకర్ గారి విషయం...
ఫ్లాట్స్ లో ఉన్న అసోసియేషన్ వాళ్ళ ఫంక్షన్ హాల్ లోనే ఆయనకి చిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశారు...
ఆ రోజు సాయంత్రం అందరూ వచ్చారు...చాలా మంది మాట్లాడారు...
కరుణాకర్ గురించి ఆయన భార్య గురించి...వాళ్ళు ఎంత మంచి వాళ్ళో...ఎంత హుందాగా ఉండేవారో...అని..
కొంతమంది సానుభూతి గా మాట్లాడారు...
పిల్లలుండీ ఈ పరిస్థితి రావడం మీద...ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోవడం లేదని..
ఇలాంటి తల్లి తండ్రుల ని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించడం బాధాకరమని...
ఇలా అనేక రకాలుగా...
కొంతమంది కి మాట్లాడే అవకాశం వచ్చినా...చేతికి మైకు ఇచ్చినా పట్టలేము...
అందరూ కరుణాకర్ గారి  జంట వంక సానుభూతి తో చూస్తున్నారు...
చివరిగా కరుణాకర్ గారి వంతు వచ్చింది...
ఆయన మాట్లాడేస్తే..అందరూ భోజనాలు చేసేసి వెళ్లిపోవచ్చని ఆత్రుత అందరిదీ...
ఆయన లేచి స్టేజి మీదకి వెళ్లి మైకు తీసుకున్నారు...
మాట్లాడటం ప్రారంభించారు...అందరికీ కృతజ్ఞతలు... మా మీద చాలా సానుభూతి చూపించారు..
మా లైఫ్ కూడా మీ అందరి సాన్నిధ్యంలో చాలా బాగా గడిచింది...
నేను ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడతాను...దయచేసి వినండి...
మాకు ఇద్దరు అబ్బాయిలు...ఇద్దరికీ రెండేళ్ల తేడా...
మేము ఇద్దరం కూడా ఉద్యోగస్థులం...
పిల్లల్ని మంచి స్కూల్ లోనే చదివించాం...
ఆ రోజుల్లో అందరూ నడిచిన  దారిలోనే నడిచాం...
పిల్లల పదో తరగతి అవగానే ఒక కార్పొరేట్ కాలేజ్ లో  ఎం.పి. సి గ్రూప్ లో జాయిన్ చేయడం...
దానితో పాట ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం...
డబ్బుకు చూసుకోలేదు...
పిల్లలకి దీని మీద ఆసక్తి ఉందా లేదా అని  అడగలేదు...
ఒకటే ధ్యేయం...
ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అవ్వాలి అంతే...
మా పిల్లలూ మేము ఏది చెప్తే అదే చేశారు..
ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకపోయినా,  లక్షల్లో డొనేషన్ కట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించాం....
ఇంజనీరింగ్ అయ్యాకా,  క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం వచ్చింది మా పెద్ద వాడికి...
మాకు అస్సలు ఆ ఉద్యోగం ఆనలేదు...
అందరిలాగే అమెరికా పంపించాలని ఆశ...
వాడిని జి.ఆర్.యి.  టోఫెల్ ఎక్జామ్స్ వ్రాయించాం...
ఏదో యావరేజ్ గా గట్టెక్కాడు...
అమెరికాలో అన్ని యూనివెర్సిటీస్ కి అప్లై చేయించాం...
ఇద్దరం ఉద్యోగస్థులం కదా...డబ్బుకి వెనకాడలేదు...
బాంక్ లోన్స్ పెట్టి మొత్తానికి అక్కడ యూనివర్సిటీస్ లో ఎయిడ్ రాకపోయినా మా డబ్బుతోనే పంపించేసాం...
అక్కడ చదువు అయ్యాకా అక్కడే ఉద్యోగం వచ్చింది...
మా ఆనందానికి అవధులు లేవు..గర్వంగా ఫీల్ అయ్యాము..
రెండో వాడిని కూడా అదే దారిలో పెట్టేసాము...
రెండో వాడు వెళ్లనన్నాడు..."ఇక్కడే చదువుకుంటాను నాన్నా  అని"  రిక్వెస్ట్ చేశాడు...
మేము ఒప్పుకోలేదు...ఇండియా లో ఏముందిరా...డెవలప్మెంట్ ఉండదు...ఎక్సపోజర్ ఉండదు అని వాడిని ఒప్పించి, ఇంచుమించు బలవంతంగా ఆస్ట్రేలియా పంపించేసాం పై చదువుకి....
మాకు ఎంత గర్వం గా ఉండేదో...మా ఇద్దరి పిల్లలు  విదేశాల్లో ఉన్నారని...
దానికి తోడు,  మా చుట్టాలు, ఆఫీస్ లో మా ఇద్దరి కోలీగ్స్,  మమ్మల్ని పొగుడుతుంటే...నా ఛాతీ గర్వంతో వెడల్పు అయ్యేది...
మీకేమండి... మీ ఇద్దరి పిల్లలూ విదేశాల్లో ఉన్నారు అనగానే మాకు గాలిలో తెలిపోతున్నట్టు ఉండేది...
అసలు మా పూజలు, మా మొక్కులు అన్నీ మా ఇద్దరి పిల్లలు ఇండియా దాటి వెళ్లాలనే...
అవన్నీ ఫలించి మా పిల్లలు అక్కడ ఉన్నారు అనుకునే వాళ్ళం...
ఇద్దరికీ ఉద్యోగాలు అక్కడే వచ్చాయి...
ఇంకా పండగ మాకు...
కొంత కాలానికి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ అమ్మాయిలని భారత్ మెట్రిమోనియల్ డాట్ కాం లో చూసి పెళ్ళిళ్ళు కూడా చేసేసాం...
మరి ఇక్కడ అమ్మాయిని చేస్తే అక్కడికి వెళ్లడం...స్థిరపడటం టైం తీసుకుంటుంది అని...
మేము రెండు మూడేళ్ళ కోసారి అమెరికా, ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్లి వస్తూ ఉండేవాళ్ళం...మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు మావాడు, కోడలు మమ్మల్ని మొత్తం అంతా తిప్పి చూపించారు...
వాళ్ళ వైభోగం, ఆ దేశం చూడటానికి  మా కళ్ళు చాలలేదు...
మేమిద్దరమనుకున్నాం..మనం పిల్లల్ని ఇక్కడికి పంపించి మంచి పని చేశాం అని...మమ్మల్ని మేము మెచ్చుకోలుగా  భుజాలు తట్టుకున్నాం...
వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వచ్చేవాళ్ళు...
వాళ్ళ హోదా, అలవాట్లు కి తగ్గట్టు మా ఇల్లుని పూర్తిగా మార్చేసామ్...అన్నట్లు మధ్యలో
మేము రిటైర్ అయిపోయాం....
మాకు మనవలు కలిగారు...
మేము కూడా వెళ్లి అక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్నాం...
రెండోసారి వెళ్ళినప్పుడు మొదటిసారి లా ఎక్కడికీ తీసుకెళ్లలేదు వాళ్ళు...
అప్పటికే అన్నీ చూసేసి ఉండటం...చిన్న పిల్లలతో వీలు కాకపోవడం వలన...
అప్పుడు మాత్రం నాలుగు గోడల మధ్య ఓ ఆరు నెలలు జైలు లా, నరకం గా ఉండేది...
ఇంట్లో పనులు, వంట, పిల్లల్ని చూసుకోవడం మా వల్ల కాలేదు...
తరువాత ఇండియా లో మా ఇంటికి వచ్చాకా మాకు ఇక్కడ స్వేచ్ఛ అర్ధమయ్యింది....స్వేచ్ఛ విలువ తెలిసింది...
కొన్నాళ్ళకి మా పిల్లలు "మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది" అని ఫోన్ చేసినప్పుడు, నిజంగా మా సంతోషానికి అవధులు లేవు...
ఈ సారి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసామ్...
చుట్టాలకి ఫ్రెండ్స్ కి హోటల్ లో పార్టీ ఇచ్చాం...
కనిపించిన వాళ్లందరికీ స్వీట్స్ పంచాం....
అంత ఆనందం ఎప్పుడూ పొందలేదు....
కాలం ఆగదు కదా...సాగిపోతూనే ఉంటుంది...
మా పిల్లలు అక్కడే ఇళ్లు వాకిళ్ళు కొనుక్కున్నారు...
మా మనవలు పెద్ద వాళ్ళైయ్యారు....మా పిల్లలకి కూడా 40 ఏళ్ళు వస్తున్నాయి...
మాకు అంత పెద్ద ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలంటే కష్టం గా ఉండేది...
పిల్లలు ఇప్పుడు ఇండియా కి రావడం తగ్గిపోయింది...
అంత ఇంట్లో ఇద్దరం బిక్కు బిక్కు మంటూ ఉండలేకపోయాం...
మా పిల్లలు కూడా ఆలోచించి...రోజులు బాగాలేవు, క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి...ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చాలా వింటున్నాం...
ఎందుకైనా మంచిది  మీరు అపార్ట్మెంట్ లో ఉంటే మంచిది అని,  ఇక్కడ ఫ్లాట్ కొని మమ్మల్ని షిఫ్ట్ అవమన్నారు...
ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసాం...ఇక్కడికి వచ్చాం...
నాకు 70 ఏళ్ళు, మా ఆవిడకి 65 దాటాయి...
వయసుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి...సహజం కదా....
ఇద్దరం ముసలి వాళ్ళు ఏ తోడూ లేకుండా ఒంటరిగా ఉండటంలో కష్టనష్టాలు తెలియడం మొదలు పెట్టాయి...
నెమ్మదిగా వాస్తవాలు బోధపడసాగాయి...
మా పిల్లలు ఫోన్లు చేస్తూ ఉంటారు...
మనకి పగలైతే వాళ్ళకి రాత్రి కదా...
వాళ్ళు వాళ్ళ పగలు టైం లో మాకు ఫోన్ చేస్తే...రాత్రి పదింటికి కొంచెం నిద్రపడుతున్న మాకు మెలుకువ వస్తుంది...
వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసినాకా ఇంక నిద్ర పట్టదు...
అలా అని ఫోన్ చేయొద్దు అని చెప్పలేం..
ఇలా ఎన్నాళ్లు అనే ఆలోచన వచ్చేసింది....
ఏ అర్ధ రాత్రో ఎవరికి బాగోలేకపోయినా,వాళ్ళని తీసుకుని ఇంకొకరు హాస్పిటల్ కి వెళ్లడం అసంభవం....
మా ఆవిడ వంట చేయలేకపోతోంది మా ఇద్దరికే అయినా కూడా...
వంటమనిషిని పెట్టుకుందామంటే భయం...
కార్ కి డ్రైవర్ ని పెట్టుకుందాం అంటే  భయం...
మేము ఇద్దరమే అని తెలిసి మాకు ఏ హాని తలపెడతారో అని...
ఈ మధ్యనే  నమ్మిన ఒక  డ్రైవర్ తన ముసలి ఓనర్స్ ని చంపి దొరికినవన్నీ పట్టుకుపోయాడు.అని విన్నాం...
సాటి మనుషుల్ని నమ్మలేని స్థితి కి వచ్చాం...
మా ఈ దీనావస్థకి కారణం మా పిల్లలని, వాళ్ళకి హృదయం లేదని మీలో చాలా మంది అన్నారు...
కానీ ఎంత మాత్రం కాదు...
మా పిల్లలు చాలా మంచి వాళ్ళు...మేము చెప్పిందల్లా చేశారు...!
మమ్మల్ని ఆనంద పెట్టారు...!
వాళ్ళు విదేశాలు వెళ్తామని అడగలేదు...మేమే పంపాము...!
మాచిన్నబ్బాయి "నేను ఎక్కడికీ వెళ్ళను నాన్నా, ఇక్కడే మీ దగ్గరే ఉంటా"  అని రిక్వెస్ట్ చేసాడు...
మేము కొట్టి పారేసామ్...వినలేదు వాడి మాట...
ఎందుకంటే మాకు సొసైటీ లో గుర్తింపు కావాలి...మా ప్రతిష్ట పెరగాలి...
అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలనే యావ...
అక్కడ ఉద్యోగం వస్తే సంబరపడిపోయాం...
అక్కడ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తే...అయ్యో...పిల్లలు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారే అన్న బాధ లేకపోగా, ఎగిరి చంకలు గుద్దుకున్నాం...
ఆరోజుల్లో "ఇండియా వచ్చేయండి రా" అని మేము ఒక్క మాటంటే,  వచ్చేసేవారు...కనీసం ఒక్కళ్ళయినా...
మేము అనలేదు సరికదా అక్కడి పిల్లల్నిచ్చి పెళ్లి చేసామ్...
ఇప్పుడు మా కోడళ్ళకి కూడా అక్కడే ఉండాలని ఆశ...
ఒకవేళ మా పిల్లలకి రావాలని ఉన్నా తమ భాగస్వాములు, తమ పిల్లలూ కూడా ఒప్పుకోరు...
మేమే వాళ్ళని అక్కడనుండి కదలకుండా అనేక బంధనాలతో బంధించేసాం...
నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఈ పరిస్థితి మేమే కారణం...
మా పిల్లలు కాదు...ఇది స్వయం కృతం...
మా పిల్లల్ని తిడుతుంటే నేను భరించలేక వచ్చి చెప్తున్నాను...
ఇప్పుడు ఇక్కడ కూడా మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తున్నాయి...
మీరు మీ పిల్లల్ని ఈ దిశగా మరలించండి...
మీకు తెలుసు అనుకోండి..ఆయినా చెప్తున్నాను...
మీ పిల్లల ఫ్యూచర్ తో పాటు,  మీ ఫ్యూచర్ సంగతి కూడా చూసుకోండి...
ఇక్కడ కొన్ని కుటుంబాలు కొడుకుకొడళ్లతో, మనవలతో ఉండటం చూస్తుంటే ఆనందం వేస్తుంది...
మాకు అలాంటి అదృష్టం ఎప్పటికీ రాదు కదా...
అటువంటి అదృష్టాన్ని కోల్పోకండి...
మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తున్నా...
అది ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో ఉంది...
మా పిల్లలే ఆన్లైన్ లో చూసి ఏర్పాటు చేశారు...
అక్కడ ఉండటానికి చిన్న చిన్న కాటేజీలు, 
ఎవరికి ఎలాంటి తిండి అవసరమో అలాంటి ఫుడ్ వండి పెట్టె వంటమనుషులు....
మాలాంటి వాళ్ళు ఎందరో అక్కడ మాకు కాలక్షేపం....
పదిహేను రోజులకి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్ లు చేస్తారు.....
వాకింగ్ సౌకర్యం...అందరికీ ఇంట్లో టీవీ...
కామన్ హాల్ లో పెద్ద టీవీ....
ఆకుపచ్చని వాతావరణం....ఇవన్నీ ఉన్నాయి....
ఒక్కొకళ్ళకీ నెలకి 50000 కట్టి మా పిల్లలు ఇందులో చేర్చారు....
అంటే మా ఇద్దరికీ నెలకి ఒక లక్ష ఖర్చు పెడుతున్నారు...
ఒకప్పుడు మేము వాళ్ళ చదువులకి లక్షలు ఖర్చు  పెడితే, వాళ్ళు ఇప్పుడు మాకోసం ఖర్చు పెడుతున్నారు...
వాళ్ళు ఇప్పుడు మా విషయంలో ఇలా చేయక పోయినా మేము చేసేది ఏమీ లేదు... అంటే నా ఉద్దేశ్యం ఇంత జాగ్రత్త తీసుకోకపోయినా అని...
మా పిల్లలకి మేమంటే ప్రేముంది కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి, స్థోమత ఉంది కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు...
మేము ఒక విధంగా అదృష్టవంతులమే...
పిల్లలతో మనవలతో ఉండటమే ఎక్కువ అదృష్టం...దానితో ఏ అదృష్టానికి పోలిక లేదు...
కానీ ఉన్నంతలో సంతృప్తి చెందాలి...
కానీ ఇండియా లో ఉంటూ కూడా  ముసలితనం లో తల్లి తండ్రులని పట్టించుకోకుండా వదిలేసిన పిల్లలూ ఉన్నారు...
ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా దయనీయం...
US లో ఉన్న పిల్లలు తాము రాలేక, తల్లిదండ్రులని తీసుకుపోలేక, పెద్దవయసైన తల్లిదండ్రులని ఒంటరిగా ఉంచలేక...
అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో,  వాళ్ళు తమ తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుతున్నారు...వాళ్ళకి వేరే దారి లేక...
కనీసం అక్కడ ఉంచితే, 
రక్షణ తో పాటు వాళ్ళ అతీ గతీ చూసేవాళ్ళు ఉంటారని...
వైద్య సదుపాయం ఉంటుందని....
మంచి ఆహారం తో పాటూ... ఒకే ఏజ్ వాళ్ళ సహచర్యంతో,  కొంత టైం పాస్ ఉంటుందని...
వాళ్ళని విమర్శించకండి...
దయచేసి మీ పిల్లల అభిప్రాయం తెలుసుకుని, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి చదివించండి...ఇది నా సలహా...అందని వాటికి అర్రులు చాచొద్దు...
మీకు వీలున్నప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి పోతూ ఉండండి...
మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ దగ్గరికి రాలేకపోవచ్చు....
మా మీద జాలి పడకండి...
నమస్తే....
అని ఆయన ఆపేశారు...
కొన్ని సెకండ్స్ నిశ్శబ్దం గా గంభీరమైపోయిన  ఆ ప్రదేశం... కొద్ది క్షణాల అనంతరం చప్పట్లతో మారు మ్రోగిపోయింది..
.
వసుంధర గారు చెంగుతో కళ్ళు వొత్తుకున్నారు....
                          ***
(రచన: ఉమాబాల చుండూరు)

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...