Friday, April 2, 2021

👌🏻పదవి గురించి భీష్ముడు చెప్పిన కథ🙏🏻*

***********

👌🏻పదవి గురించి భీష్ముడు చెప్పిన కథ🙏🏻*
      ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలి? అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు.
     ‘‘పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని, దానిని తన చెంత ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతుండటా ఓరోజు ఆ కుక్క ఓ పులి కంటపడింది. అంతే! ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలిగొనబోయింది.
‘‘వెంటనే ఆ కుక్క పరుగుపరుగున పోయి మునీశ్వరుని వెనుక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులికంటే బలహీనంగా ఉండటం వల్లే కదా, దానికి ఆపద కలిగింది- అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఆ ఘటనను చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మరోసారి దాని మీదకి ఓ ఏనుగు దూసుకువచ్చింది. యథాప్రకారం పులిరూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చివేశాడు ఆ మునివర్యుడు.
‘‘ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. అలా బెబ్బులిలా మారిన కుక్క ఓ రోజు బోర విరుచుకుని అడవిలో తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకి లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కానీ అలా తిరుగుతుండగా దాని మనసులో ఓ ఆలోచన మొదలైంది- ‘మునివర్యులు నా మీద జాలిచూపారు కాబట్టి, నన్ను అన్నింటికంటే శక్తిమంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునీంద్రుని శరణువేడితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తలవంచాల్సిందే కదా!’ అనుకుంది. ‘అసలు ఆ మునీశ్వరుని చంపిపారేస్తే, అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు,’ అని పన్నాగం పన్నింది.
‘‘కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లు ముని ముందరకి వచ్చి కూర్చుంది. కానీ  కుక్కను బెబ్బులిగా మార్చినవాడు, దాని మనసులో ఏముందో గ్రహించలేడా! మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడో వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు! అది పూర్వంలాగే కుక్కబతుకుని గడపసాగింది.
‘‘కాబట్టి ధర్మనందనా! దుర్మార్గులకు ఉన్నతపదవులని ఇస్తే, వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతని అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నయినా సాధించగలడు,’’ అంటూ ముగించాడు భీష్మపితామహుడు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏  🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...