Tuesday, December 8, 2020

*కార్తీక పురాణం - 22 వ అధ్యాయము*_

_*కార్తీక పురాణం - 22 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 *పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట*

☘☘☘☘☘☘☘☘☘

మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.
పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి , శ్రీహరిని గానముచేసి , సాష్టాంగ నమస్కారము చేసి , సూర్యోదయముకాగానే నదికిపోయి , స్నానమాచరించి తన గృహమున కెగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు - మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి *"రాజా ! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని , యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము , నీ రాజ్యము నీకు దక్కును"*, అని దీవించి అదృశ్యుడయ్యెను. *"ఈతడెవరో మహానుభావునివలె ఉన్నారు అని , ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక , శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా !*

ఆ యుద్దములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి *"పురంజయా రక్షింపుము రక్షింపు"* మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా ! విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా *'శ్రీ హరి'* అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా ! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా !

హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులు పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసారసాగరం ఉద్దరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు , అంబరీషుడు , శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు , భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండును.

శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి , వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు , నిరాకారుడు , నిర్వికల్పుడు , నిత్యానందుడు , నీరజాక్షుడు , పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...