💐💐💐💐💐💐💐💐💐🌻🌻🌹🌹🌷🌷🪷
*నిజమైన పండితుడు*
పండితుడంటే అన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు. సర్వజ్ఞుడు అనే చాలామంది అనుకుంటారు. ఒక్క భగవంతుడికే సర్వజ్ఞుడు అని పేరు. పండితుడంటే చాలా తేలిక అభిప్రాయం కొంతమందిలో వుంది. అన్నీ తెలిసి వుంటే తప్పులేదట. అన్నీ తెలుసు అనుకుంటేనే తప్పట.
అన్నీ తెలుసు అని ఎవరనుకుంటారు? ఏమీ తెలియని వారే అన్నీ తెలుసు అనుకుంటారు. *చతు శ్లోకేన పండితః* నాలుగు శ్లోకాలు వస్తే పండితుడని సామెత. అదే తరువాత *శత శ్లోకేన పండితః* అంటున్నారు. నూరు శ్లోకాలు వచ్చేసరికి ఎదుటి వాడికేమీ తెలీదని అనిపిస్తుంది. అందరినీ ప్రశ్నించడం మొదలుపెడతాం. దేనికి? మనకి తెలిసిన విషయం వాడికి తెలీదని నిరూపించడానికి.
ప్రశ్నల్లో రెండురకాలు. జిజ్ఞాసుప్రశ్న, జిగీషు ప్రశ్న. *జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాసా* తెలుసుకోవాలనే కోరికతో వేసే ప్రశ్న. *జేతుం ఇచ్చా జిగీషా* జయించాలని అడిగే ప్రశ్న. ఎలాగైనా ఎదుటివాడికి తెలీదనిపించాలి అని అడిగే ప్రశ్న.
"ఏమండీ? నూరుమంది కౌరవుల పేర్లు, వారి భార్యల పేర్లు, వారి చెల్లి దుస్సల భర్త పేరు, ఆమె పిల్లల పేర్లు చెప్పండి?" ఇన్నిపేర్లు ఎవరికీ కంఠతా వచ్చివుండవు కదా! అవతలి వాడికి తెలియదు అనిపిస్తే మనకు తృప్తి! ఇలా కొన్నాళ్ళు నేను పండితుడినే అనిపించినా, బాగా చదువుకొన్న తర్వాత, నేను పండితుణ్నికాదు అని గ్రహిస్తాడు.
*తెలిసికొంటిని నాకేమి తెలియదంచు* అని తెలిసినవాడే నిజమైన పండితుడు. ఒక శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకునే వాడే నిజమైన పండితుడు.
🚩🚩🚩🌹🚩🌹🌹🙏🏻