*************************
*కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందే. అయినప్పుడు ఈ పూజలు, వ్రతాలు ఎందుకు? ఈ సందేహం తీరడం లేదు.*
మన సనాతన ధర్మం కర్మ సిద్దాంతం గురించి ఏం చెప్తోంది?
మనది వేదభూమి, కర్మభూమి, మనిషై పుట్టిన తర్వాత ఏదో ఒక కర్మ చెయ్యాల్సిందే. అయితే మనం చేసే పని మంచో చెడో తెలుసుకోవడానికి భగవంతుడు మనకు వివేకం ఇచ్చాడు. వివేకానికి తోడుగా ధర్మశాస్త్రాల నిచ్చాడు. అనాదిగా వస్తున్న కర్మల్ని తొలగించుకోవడానికి, జీవులకు దుర్లభమైన మానవజన్మనిచ్చాడు. ఇందుకు మనం భగవంతుడికి కృతజ్ఞత తెలపాలి.
కృతజ్ఞత ప్రతి మనిషి జీవ లక్షణం కావాలి. ఆరాధన చెయ్యడమంటే భగవంతుడికి మన కృతజ్ఞత తెలుపుకోవడమే. ఇలా కృతజ్ఞత ప్రకటించడంలో వివిధ రూపాలే ప్రీతి, ప్రేమ, భక్తి, ప్రపత్తి, పూజ, వ్రతం మొదలైనవి. మనం రోజూ తినే ఆహారం ఎటువంటిదో ప్రార్థన కూడా అలాంటిదే.
మన శరీరానికి పరిమిత సాత్వికాహారం ఎంత అవసరమో, నిత్య ప్రార్ధన, ధ్యానం అంతే అవసరం. ప్రార్థన మన విద్యుక్తధర్మం. అనాదిగా వస్తున్న మన (జీవుల) సంచిత కర్మల్ని ఈ జీవితంలో ప్రారబ్ధ కర్మలుగా అనుభవించాలి. దీనికి మనం ఈ జన్మలో చెయ్యవలసిందేమిటి?
సత్సంగంలో చేరాలి. సదాచార్యులను ఆశ్రయించాలి. నవవిధ భక్తిమార్గాల ద్వారా భగవంతుణ్ణి సేవించాలి. సత్కర్మలు చెయ్యాలి. మాధవసేవగా సర్వప్రాణి కోటిసేవ, పర్యావరణసేవ చెయ్యాలి. అపుడేమవుతుంది?
మన నిత్యప్రార్థనల వల్ల, పూజా పునస్కారాలవల్ల భగవంతుడు ప్రీతిజెందుతాడు. మనల్ని అనుగ్రహిస్తాడు, మనం అనుభవించే ప్రారబ్ధకర్మను సుఖప్రారబ్ధంగా మారుస్తాడు. మన పాపాలను, శాపాలను తొలగిస్తాడు. ఇహలోకంలో మనల్ని కృతకృత్యుల్ని చేసి, శాశ్వత బ్రహ్మానందాన్ని మనకు అందిస్తాడు. ఇదే మానవ జీవిత పరమాశయం. మహాప్రస్థానం.
జీవికి ఇహ లోక విముక్తి
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
No comments:
Post a Comment