Sunday, January 24, 2021

*వైద్యనాథాష్టకము..!!*ఓం నమః శివాయ..!!🙏పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది

*వైద్యనాథాష్టకము..!!*
ఓం నమః శివాయ..!!🙏

పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది.  నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా 
రోగ నివారణ, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి. అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. 

దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. 
అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే.

జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. 
సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. 
ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి,  
వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసం. 

అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుకు మూడు సార్లు చదివితే ఆరోగ్యం కలుగుతుందట. 
అంతటి మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం, తాత్పర్యము మీకోసం..

శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
షడాననాదిత్య కుజార్చితయ
శ్రీ నీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: 
శ్రీరాముడు, లక్ష్మణుడు జటాయువు,వేదములు, సుబ్రహ్మణ్య స్వామి,సూర్యుడు,అంగారకుడిచే పూజించబడిన, నీలకంఠము కలవాడు, 
దయామయుడు, వైద్యనాథుడైన శివునికి 
నా నమస్కారములు.

గంగా ప్రవాహేందు జటాధరయ
త్రిలోచనాయ స్మర కాల హంత్రే
సమస్త దేవైరపి పూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: 
ప్రవహించే గంగను, చంద్రుని జటాఝూటములో ధరించిన, మూడు కన్నులు కలవాడు, 
మన్మథుని, యముని సంహరించిన వాడు, 
దేవతలందరి చేత పూజించ బడినవాడు, 
వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: 
భక్త ప్రియుడు, త్రిపురములను నాశనము చేసినవాడు, పినాకమును (త్రిశూలమును) చేతిలో ధరించిన వాడు, నిత్యము దుష్టులను సంహరించేవాడు, 
వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ప్రభూత వాతాది సమస్త రోగ
ప్రణాశ కర్త్రే ముని వందితాయ
ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: 
వాతము, కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనము చేసేవాడు, మునులచే పూజించబడిన వాడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: 
వాక్కు, వినికిడి శక్తి, కాంతి చూపు, నడిచే శక్తి కోల్పోయిన జీవ రాశులకు ఆ శక్తులను తిరిగి కలిపించేవాడు,  
కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలము చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వేదాంత వేద్యాయ జగన్మయాయ
యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: 
వేదముల ద్వారా తెలుసుకొనే దైవము, 
విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, 
యోగులచే ధ్యానింపబడిన పాదపద్మములు కలిగిన వాడు, త్రిమూర్తుల రూపమైన వాడు, 
సహస్ర నామములు కలవాడు, 
వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపయ శరీర భాజాం
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: 
ఆయన దేవాలయమున ఉన్న పుణ్య పుష్కరిణీ స్నానము వలన, వేపచెట్టు క్రింద మట్టి మరియు భస్మము వలన -భూత ప్రేతముల బాధ, దుఃఖములు, కష్టములు, భయములు, రోగములు తొలగించే, ఆత్మ స్వరూపుడై దేహము నందు నివసిస్తున్న,  వైద్యనాథుడైన శివునికి 
నా నమస్కారములు.

శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
స్రక్గంధ  భస్మాద్యభి శోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: 
నీలకంఠుడు, వృషభమును (ఎద్దును) పతాకమందు చిహ్నముగా కలవాడు,  పుష్పములు, గంధము, భస్మముచే అలంకరించబడి శోభిల్లేవాడు, సుపుత్రులు, మంచి ధర్మపత్ని, సత్సంపదలు, అదృష్టములు ఇచ్చే వాడు,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ఫల శ్రుతిః..
బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం

ఫల శృతి: 
బాలాంబిక పతి, జరామరణముల భయమును పోగొట్టేవాడు అయిన వైద్యనాథుని 
ఈ వైద్యనాథాష్టకం ప్రతిదినము మూడుసార్లు పఠించే వారికి సకల రోగ నివారణ కలుగును.
స్వస్తి..

ఓం నమః శివాయ..!!🙏

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...